లసల్గావ్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు శుక్రవారం ఒక్కసారిగా విపరీతంగా పెరిగాయి.
నాసిక్: లసల్గావ్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు శుక్రవారం ఒక్కసారిగా విపరీతంగా పెరిగాయి. క్వింటాల్ ఉల్లిపాయలు అత్యధికంగా రూ. 5,600కు చేరుకున్నాయి. సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లిపాయల ధర రూ. 5.501గా ఉంది.హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు పెరిపోవడం కొనుగోలుదారులకు ఇబ్బందికరంగా పరిణమించింది. చిల్లర మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలను రూ. 60కి విక్రయిస్తున్నారు. జిల్లా మార్కెట్లలో క్వింటాల్ ఉల్లిపాయల సగటు ధర గురువారం రూ. 5,451 నుంచి రూ. 5,751కి పలుకింది. అంతకుముందురోజు రూ. 5,350కి విక్రయించారు. శుక్రవారం లసల్గావ్ మార్కెట్‌లో ఎనిమిది వేల క్వింటాళ్ల ఉల్లిపాయలను వేలం వేశారు. సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చె బుతున్నాయి. ఖరీఫ్ దిగుబడి మార్కెట్‌కు రావడం మొదలైందని, అయితే పెద్దమొత్తంలో రావడం లేదని, ఇందుకు మరికొంత సమయం పడుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
శుక్రవారం మార్కెట్‌కు ఖరీఫ్‌లో పండించిన 200 క్వింటాళ్ల ఉల్లిపాయలొచ్చాయని, అయితే ఉల్లిపాయలు క్రమం తప్పకుండా వస్తే ధరలు తగ్గిపోయే అవకాశముంటుందన్నారు. వేసవికాలంలో పండించిన ఉల్లిపాయలు మార్కెట్‌కు వచ్చినప్పటికీ అవన్నీ అమ్ముడుపోయాయన్నారు. కొత్త పంట రాకపోవడం, వేసవిలో పండించిన ఉల్లిపాయల నిల్వలు మొత్తం అమ్ముడుపోయిన నేపథ్యంలో ధరల పెరుగుదల మరో పదిరోజులపాటు కొనసాగే అవకాశముందన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లనుంచి తాజా సరుకు రావడం ప్రారంభమైందన్నారు. కాగా ఇక పింపల్గావ్ మార్కెట్‌లోనూ ఉల్లిపాయల ధరలు పెరిగాయి. శుక్రవారం ఈ మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 5,451 పలికాయి. అంతకుముందు ఇది రూ. 5.251గా ఉంది. ఈ మార్కెట్‌లో శుక్రవారం 500 క్వింటాళ్ల ఉల్లిపాయలను వేలం వేశారు. కాగా జిల్లాలోని యోలా మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 5,700 పలికాయి.