సాక్షి, ముంబై: నగరవాసులపై ఉరుముల పిడుగులకు బదులుగా ఉల్లి పిడుగులు పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కాస్త ఫరవాలేదనిపించిన ఉల్లి గత వారం రోజుల్లోనే రెట్టింపు ధర పలుకుతోంది. నిన్నమొన్నటి దాకా రూ.15 కిలో విక్రయించిన ఉల్లి మంగళవారం ఒక్కసారిగి రూ. 30-35కు చేరింది. వ్యాపారులు కుమ్మక్కవడం, వర్షాలు కురవకపోవడం, సరుకు సరఫరా తగ్గడం వంటివి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
నవీముంబైలోని వాషిలోగల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ)కి ఉల్లితో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య గత రెండు వారాల్లో గణనీయంగా తగ్గిందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్‌లోనే రూ.25కు పైగా పలుకుతున్న ఉల్లి రిటైల్ మార్కెట్‌లోకి వచ్చేసరికి మరో పది రూపాయలు అదనంగా వచ్చి చేరుతోంది. దీంతో వంటింటి బెడ్జెట్ అమాంతంగా పెరుగుతోంది. విదేశాలకు ఉల్లిని ఎగుమతి చేయడంతోనే ఉల్లి ధరలు పెరుగుతున్నాయంటూ వ్యాపారులు గగ్గోలు పెట్టడం, కిలో ఉల్లి ధర రూ. 60-80కి పెరగడంతో కేంద్రం ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది.
దీంతో ఉల్లి ధర దిగొచ్చిందని సంబరపడిన ఇల్లాలికి ఆ ఆనందం ఎన్నోరోజులు ఉండలేదు. మళ్లీ ఉల్లి పైపైకే చూస్తోంది. కరెంటు కోతలు, నీటి కోతలు, నిత్యావసరాల వాతలకు తోడు పెరుగుతున్న ఉల్లి కూడా సామాన్యుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. రోజుకు ఏపీఎంసీ మార్కెట్లోకి దాదాపు 300-350 వరకు రావల్సిన ఉల్లీ ట్రక్కులు సోమవారం సాయంత్రం వరకు కేవలం 125 మాత్రమే వచ్చాయి.
ఉల్లి పంటలకు పేరుగాంచిన నాసిక్ జిల్లా లాసల్‌గావ్‌లో గత వారంపది రోజుల నుంచి ఉల్లి ధర ఎగబాకుతోంది. గత వారం రోజుల కిందట ఉల్లి క్వింటాలుకు రూ.800 ధర పలికింది. ఇప్పుడు ఏకంగా రూ.2,400 ధర పలకడంతో పంట పండించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నా వాటిని కొనుగోలుచేస్తున్న గృహిణులు మాత్రం క ంటతడి పెడుతున్నారు. వర్షాల పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత మండిపోయే సూచనలున్నాయని లాసల్‌గావ్ మార్కెట్‌లోని ఉల్లి వ్యాపారులు అంటున్నారు.
ఉల్లిగడ్డుకాలం
Published Tue, Jul 1 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement