సాక్షి, ముంబై: ఆకాశన్నంటిన కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల మార్కెట్‌లోకి వచ్చే కూరగాయల సరఫరా తగ్గడంతో కొండెక్కిన ధరలు మళ్లీ నేలవైపు చూస్తున్నాయి. నగరంలోని అన్ని మార్కెట్లోకి కూరగాయల తాకిడి పెరిగింది. మరోవైపు వీటి వినియోగం తగ్గడం కూడా ధరల తగ్గుదలకు కారణంగా చెప్పవచ్చు. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లోకి కూరగాయల లోడుతో వస్తున్న ట్రక్కులు, టెంపోల సంఖ్య పెరిగింది. దీంతో సరుకు నిల్వలు పేరుకుపోతుండటంతో వ్యాపారులు ధరలు కొంతమేర తగ్గించారు. శ్రావణ మాసం ప్రారంభం నుంచి గణేశ్ ఉత్సవాలు ముగిసేవరకు అత్యధిక శాతం ప్రజలు మాంసానికి దూరంగా ఉన్నారు. దీంతో కూరగాయాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఈ ఉత్సవాలు ముగియడంతో కూరగాయలు కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో వస్తున్న భారీ వాహనాల సంఖ్య పెరిగింది. ఫలితంగా మొన్నటి వరకు చుక్కలను తాకిన కూరగాయల ధరలు మెల్లమెల్లగా దిగి వస్తున్నాయి.
మొన్నటివరకు కేజీ రూ.80లు ధర పలికిన ఉల్లి ఇప్పుడు సుమారు రూ.50 ధర పలుకుతోంది. ఇదే తరహాలో కేజీకీ రూ.50 ధర పలికిన వివిధ రకాల కూరగాయలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో గృహిణిలకు కొంతమేర ఊరట లభిస్తోంది. కొన్నినెలలుగా పేదలకే కాకుండా మధ్య తరగతి కుటుంబాలకు అందకుండాపోయిన కూరగాయల ధరలను నియంత్రించేందుకు కేంద్రం చౌక ధరల కూరగాయల కేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో కూరగాయల దిగుబడి కూడా పెరిగింది. గత మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ సుమారు 450కిపైగా ట్రక్కులు, టెంపోలు వచ్చాయి. కానీ శని, ఆదివారాల్లో మాత్రం ఈ సంఖ్య 600కుపైగా చేరింది. దీంతో ధరలు కొంతమేర దిగివచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత దిగివస్తాయని హోల్‌సేల్ వ్యాపారి రాజేశ్ గుప్తా చెప్పారు.
దిగొస్తున్న ధరలు
Published Tue, Sep 24 2013 1:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM
Advertisement