సాక్షి, ముంబై: మీరు నిత్యం తలమునకలయ్యే పనుల్లో పడి ఇంటికి కావాల్సిన కూరగాయలు తెచ్చుకోలేకపోతున్నారా.. తాజా కూరలు దొరక్క ఇబ్బంది పడుతున్నారా! ఏం ఫర్లేదు.. ఒక ఫోన్ కాల్.. 9223433734 సెల్ నంబర్‌కు చేయండి.. తాజా కూరలు మీ ఇంటి ముందుంటాయ్..అని అంటున్నారు మాజ్‌గావ్‌లోని ఘోడ్పదేవ్ నాగరిక్ సహకార సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్ కామ్కర్. నగరంలో బతుకు అంటే ఇంట్లో అందరూ కష్టపడాల్సిందే. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల పరిస్థితి గురించి అసలు చెప్పక్కర్లేదు.. ఇటు ఇల్లు, అటు ఉద్యోగం.. తెల్లారిన దగ్గర్నుంచి ఉరుకులు పరుగుల బతుకు.. ఈ గందరగోళంలో ఇంటికి సరిపడా తాజా కూరగాయలు తెచ్చుకోవడం గగనంగా మారుతోంది. ముంబైకర్లలో సుమారు 80 శాతం ఉద్యోగినుల పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. ఇటువంటివారికి దోహదపడేలా కూరగాయల డోర్ డెలివరీకి నడుం బిగించింది ఘోడ్పదేవ్ నాగరిక్ సహకార సంస్థ. ‘ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు..వారికి కావాల్సిన తాజా కూరగాయాలు ఇంటిముందు ఉంటాయి.
ఈ సేవలకు అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా మార్కెట్ ధర కంటే చౌకగానే అందజేస్తాం..’ అని చెప్పారు ప్రవీణ్ కామ్కర్. ‘రైతుల నుంచి మా సంస్థ కూరగాయలు నేరుగా కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. పేదలే కాదు మధ్యతరగత ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొనుగోలు చేసిన దళారులు ధరలు పెంచి లాభాలు గడిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ నుంచి కూరగాయలు కొనుగోలు చేసి నేరుగా కస్టమర్లకు విక్రయించాలని మా సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజా కూరగాయలు కొనుగోలుదార్ల చెంతకే నేరుగా చేరుతుండటంతో మంచి స్పందన వస్తోంద’ని ప్రవీణ్ అన్నారు. తాము అన్ని రకాల కూరగాయలు అందజేస్తామన్నారు. ఫోన్ చేస్తే చాలు వాహనంలో కూరగాయలు చేరవేస్తామని కామ్కర్ తెలిపారు.
అందుకు గృహిణులే కాకుండా సొసైటీ యాజమాన్యాలు కూడా తమ నంబర్‌కు సంప్రదిస్తే సరుకులు డెలివరీ చేస్తామన్నారు. మహిళా పొదుపు సంఘాలు, లేదా ఇతర ఎవరైనా ఈ వ్యాపారంపై ఆసక్తి ఉంటే తమని సంప్రదించవచ్చని కామ్కర్ తెలిపారు. ఇప్పటికే వడాల, వర్లీ లాంటి కీలక ప్రాంతాల్లో బొలేరో వాహనంలో కూరగాయలు విక్రయించడం ప్రారంభించామన్నారు. దీనివల్ల సంస్థకు నెలకు రూ.10వేలు వరకు ఆదాయం వస్తోందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో సేవలు విస్తరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో మహిళా పొదుపు సంఘాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
కూరగాయలు..డోర్ డెలివరీ!
Published Fri, Jan 3 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement