సాక్షి, ముంబై: ఉల్లి ధర పెరుగుదల కారణంగా ఇప్పటిదాకా ఇబ్బందిపడిన కొనుగోలుదారుడికి కొంతమేర ఉపశమనం లభించింది. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి వచ్చే ఉల్లి లారీల సంఖ్య ఇటీవల పెరిగింది. దీంతో దాని ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నామొన్నటిదాకా టోకు మార్కెట్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ. 50-58గా ఉంది. సామాన్యుడి వద్దకు చేరుకునే సరికి వాటి ధర రూ.70-75 దాకా పలికింది. అయితే ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న సరుకు పరిమాణం పెరిగిపోవడంతో క్రమేణా ధర తగ్గుతోంది. టోకు మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు రూ. 25 పలుకుతోంది. ఇక చిల్లర విక్రేతలు రూ.30-35 మధ్య విక్రయిస్తున్నారు. వాషి మార్కెట్‌కు మూడు రోజులుగా భారీ సంఖ్యలో ఉల్లి ట్రక్కులు వచ్చాయి. కాగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. దీంతో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి.
దీంతో హోటల్ యజమానులు సైతం ధరలు పెంచారు. రోడ్లపై స్టాళ్లలో విక్రయించే పకోడీ, వడ, దోశ తదితర తినుబండారాలు పేదలకు అందకుండా పోయాయి. దళారుల బెడద నుంచి కొనుగోలుదారుడిని కాపాడేందుకు పాకిస్థాన్‌నుంచి ప్రభుత్వం ఉల్లిపాయలను దిగుమతి చేసింది. అయితే నాణ్యతా లోపం కారణంగా వీటిని ఎవరూ కొనుగోలు చేయలేదు. చేసేదేమీలేక చైనా నుంచి కూడా ఉల్లిపాయలను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ మళ్లీ మొదటికొచ్చింది. అయితే రెండురోజులుగా రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో నిల్వ ఉంచిన ఉల్లిపాయలను విక్రయించడం ప్రారంభించారు. దీంతో ఏపీఎంసీలోకి రెండు రోజులుగా ఉల్లి లోడుతో ట్రక్కులు రావడం మొదలైంది. సరుకు రాక ఇంకా పెరుగుతుంది. కాగా లసల్గావ్ మార్కెట్‌లోనూ ఉల్లి ధరలు తగ్గిపోయాయి. కొద్దిరోజుల క్రితం క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 5,000 పలకగా, ఇప్పుడది రూ. 3,100లకు పడిపోయింది.
ఉల్లి రాక ఇంకా పెరుగుతుంది
ఈ విషయమై లసల్గావ్ మార్కెట్‌కు చెందిన చిల్లర వ్యాపారి ఒకరు మాట్లాడుతూ ఉల్లి లారీల రాక ఇంకా పెరుగుతుందన్నారు. టోకు ధరల పెరుగుదల ప్రభావం చిల్లర విక్రేతలపై పడిందన్నారు. నాణ్యమైన ఉల్లిపాయల ధర శుక్రవారం కిలో రూ. 40 నుంచి రూ. 45 దాకా పలికిందన్నారు. ఇదే విషయమై మార్కెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ తాజా ఉల్లిపాయల లారీలు పెద్దసంఖ్యలో వస్తున్నాయని తెలిపారు. ఈ నెల తొలివారంలో రోజుకు మూడు వేల లారీలు రాగా ఆ సంఖ్య ప్రస్తుతం నాలుగు వేలకు చేరుకుందన్నారు.
దిగిన ధర
Published Tue, Nov 19 2013 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement