అలీపుర్‌లో కిసాన్ మండీ
► ఏపీఎంసీతో సంబంధం లేకుండా దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు
► లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్
►రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడ నేరుగా విక్రయించుకోవచ్చు
►గ్రేడింగ్, ప్యాకింగ్ వంటి సౌకర్యాలను కూడా కల్పిస్తున్న కన్సార్షియం
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఏపీఎంసీ) పరిధిలో కాకుండా స్వతంత్రంగా అలీపూర్‌లో కిసాన్ మండీ ఏర్పాటవుతోంది. ఆకాశాన్నంటుతోన్న పళ్లు, కూరగాయల ధరల నుంచి నగరవాసులకు ఊరటనివ్వడం కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏపీఎంసీతో సబంధం లేకుండా దేశంలోనే ఏర్పాటవుతున్న మొట్టమొదటి కిసాన్ మండీ ఇదే కావడం విశేషం. స్మాల్ ఫార్మ ర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం ఏర్పాటుచేసే ఈ మార్కెట్‌కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
20 కిలోల ఉల్లిపాయలను సఫల్‌కు విక్రయించడంతో మండీని లాంఛనంగా ప్రారంభించారు. ఆరు నెలల తరువాత మండీ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుందని సంబంధిత అధికారులు తెలిపారు. పళ్లు కూరగాయల రైతు లు నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారులకు విక్రయించే ఉద్దేశంతో ఈ మార్కెట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. మండీలో దళారుల ప్రమేయం ఉండదని, దీం తో రైతులకు అధిక ధర గిట్టుబాటు కావడమేకాక వినియోగదారులకు తక్కువ ధరలకు పళ్లు, కూరగాయలు లభిస్తాయన్నారు.
హర్యానా ఉత్తర సరిహద్దునానుకొని ఉన్న అలీపుర్ గ్రామంలో 1.6 ఎకరాల విస్తీర్ణంలో ఈ మండీని ఏర్పాటుచేశారు. కిసాన్‌మండీ పూర్తిగా పనిచేయడం ప్రారంభించిన తరువాత 30 నుంచి 40 వ్యవసాయోత్పత్తుల సంస్థలు, రైతు సంఘాలు తమ ఉత్పత్తుల నమూనాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. మండీ నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం అందిస్తుంది. ఫార్మ్ గేట్ వద్దనే పళ్లు, కూరగాయలను వేరుచేసి, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసే వసతులను కన్సార్షియం సమకూరుస్తుంది.