న్యూఢిల్లీ: 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాన మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయం సమృద్ధ భారత్‌కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని కొనియాడారు.
ఆదివారం మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులపై ఒక వర్గం రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండగా ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. అదే సమయంలో ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. మహాత్మాగాంధీ ఆర్థిక సిద్ధాంతాలను కాంగ్రెస్ పాటించి ఉంటే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్ భారత్’ యోజన అవసరం ఉండేదే కాదన్నారు.
దేశం ఎప్పుడో స్వయం సమృద్ధం సాధించి ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతు సంఘా లతో ముచ్చటించారు. 2014లో చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)చట్టంతో లాభం పొందిన హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతుల అనుభవాలను వివరించారు. ఉత్పత్తులను విక్రయించే సమయంలో వీరికి దళారుల బెడద తప్పిందని, మెరుగైన ధర లభించిం దని పేర్కొన్నారు. ఇప్పుడు వరి, గోధుమ, చెరకు రైతులకు కూడా ఇదే స్వేచ్ఛ లభించనుందని, వారు మంచి ధర పొందనున్నారని అన్నారు.
కథలు చెప్పడం మన సంస్కృతిలో భాగమంటూ ఆయన.. సైన్స్‌కు సంబంధిం చిన కథలు ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ‘బెంగళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ’ సభ్యులతో ముచ్చటించారు. వారితో తెనాలి రామకృష్ణుడి కథ ఒకటి చెప్పించారు. ప్రజలంతా కూడా పిల్లలకు కథలు చెప్పేందుకు కొంత సమయం కేటాయించాలని కోరారు. మాలి దేశానికి చెందిన సేదు దెంబేలే గురించి ప్రధాని తెలిపారు. ఆయనకు భారత్‌పై ఉన్న అభిమానాన్ని వివరించారు.
ప్రధాని ఇంకా ఏమన్నారంటే..
► కథలు ప్రజల సృజనాత్మకతను ప్రకటిస్తాయి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు. నా పర్యటనల్లో నేను పిల్లలతో మాట్లాడేవాడిని. వారిని కథలు చెప్పమని అడిగేవాడిని. కానీ వారు జోక్స్ చెబుతామని, మాకు జోక్స్ చెప్పండని అడగేవారు. నేను ఆశర్యపోయేవాడిని. వారికి కథలతో పరిచయం ఉండటం లేదు. గతంలో ఇంట్లో పెద్దలు పిల్లలకు కథలు చెప్పేవారు. ఆ కథల్లో శాస్త్రం, సంప్రదాయం, సంస్కృతి, చరిత్ర ఉండేవి. కథల చరిత్ర మానవ నాగరికత అంత పురాతనమైంది. కథలు చెప్పే సంప్రదాయం అంతరించిపోకుండా ఇప్పటికీ కొందరు కృషి చేస్తున్నారు. ఐఐఎం(ఏ)లో ఎంబీఏ చేసిన అమర్‌వ్యాస్ వంటి కొందరు వెబ్‌సైట్స్‌ను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతికత సాయంతో ఆసక్తి ఉన్నవారికి పలు కథారీతులను పరిచయం చేస్తున్నారు. బెంగుళూరులో శ్రీధర్ అనే వ్యక్తి గాంధీజీ కథలను ప్రచారం చేస్తున్నారు.
► ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వం టి పెద్దలుంటే వారి వద్ద కథలను విని, రికార్డ్ చేసుకోండి. భవిష్యత్తులో ఉపయోగ పడ్తాయి.
► ఆధునిక వ్యవసాయ పద్దతులను ఉపయోగించడం వల్ల వ్యయం తగ్గుతుంది. దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. రైతులు మార్కెట్ అవసరాలకనుగుణంగా పంటలు వేయాలి.
► సెప్టెంబర్ 28 షహీద్ భగత్ సింగ్ జయంతి. బ్రిటిష్ వారిని గడగడలాడించిన సాహస దేశభక్తుడు భగత్ సింగ్. లాలా లాజ్‌పత్ రాయ్ పట్ల ఆయనకున్న అంకితభావం, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి విప్లవకారులతో అనుబంధం చాలా గొప్పది. ఆయనకు నా వినమ్ర నివాళులు.
భగత్‌సింగ్‌లా కావడం ఎలా?
హైదరాబాద్ వ్యక్తికి మోదీ సమాధానం
నమో యాప్‌లో ఒక ప్రశ్న చూశాను. ఈ తరం యువత భగత్‌సింగ్‌లా కావడం ఎలా? అని హైదరాబాద్‌కు చెందిన అజయ్ ఎస్‌జీ అడిగారు. మనం భగత్‌సింగ్ కాగలమో, లేదో తెలియదు కానీ, ఆయనకు దేశంపైన ఉన్న ప్రేమను, దేశ సేవ కోసం ఆయన పడే తపనను మనం పెంపొందించుకోవచ్చు. అదే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మన సైనికుల శక్తి సామర్థ్యాలను చూశాం. అప్పుడు ఆ వీర సైనికుల మనస్సులో ఒకటే ఉంది.. దేశ రక్షణ ఒకటే వారి లక్ష్యం. తమ ప్రాణాలకు వారు ఎలాంటి విలువనివ్వలేదు. పని ముగించుకుని, వారు విజయవంతంగా తిరిగిరావడం మనం చూశాం. దేశ మాత గౌరవాన్ని వారు మరింత పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment