నేరగాళ్ల ఫోన్లకు బెంబేలెత్తకండి
అప్రమత్తతతోనే డిజిటల్ భద్రత
మన్ కీ బాత్‌లో మోదీ సూచన
న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం వేశారు. ఇటీవల పెచ్చరిల్లుతున్న ‘డిజిటల్ అరెస్టు’ ఫ్రాడ్‌ను ఆదివారం ‘మన్‌కీ బాత్’లో ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘అన్ని వయసుల వారూ వీటి బారిన పడుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. సైబర్ నేరగాడికి, బాధితుడికి మధ్య జరిగిన సంభాషణను మోదీ ఉదాహరించారు.
‘‘సైబర్ నేరగాళ్లు తొలుత వ్యక్తిగత సమాచారం సేకరిస్తారు. తర్వాత ఫోన్లు చేసి మీరు నేరాల్లో ఇరుక్కున్నారంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆలోచించుకొనే సమయం కూడా ఇవ్వరు. డబ్బులిస్తారా, అరెస్టవుతారా అంటూ బెదిరిస్తారు. భయపడితే మానసికంగా మరింత ఒత్తిడికి గురి చేసి డబ్బు గుంజుతారు. ‘ఆగడం, ఆలోచించడం, చర్య తీసుకోవడం’ ఈ మోసాలకు విరుగుడు’’ అన్నారు. ‘‘ఇలాంటి గుర్తు తెలియని బెదిరింపు ఫోన్లకు భయపడకుండా ధైర్యంగా ఉండండి.
దర్యాప్తు సంస్థలు, పోలీసులు ప్రజలకు ఇలాంటి ఫోన్లు చేయరని, డబ్బులడగరని గుర్తుంచుకోండి. సాయం కోసం జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ ‘1930’కు ఫోన్ చేయండి. సైబర్ నేరగాళ్లతో సంభాషణను రికార్డు చేసి దర్యాప్తు సంస్థలకు అందించండి. సైబర్ మోసాలపై cybercrime. gov. in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయండి’’ అని సూచించారు. ‘‘డిజిటల్ మోసాలు, ఆన్‌లైన్ స్కాములపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అప్రమత్తతే డిజిటల్ భద్రత కల్పిస్తుంది’’ అని ఉద్ఘాటించారు. సైబర్ నేరగాళ్లను సమాజానికి శత్రువులుగా అభివరి్ణంచారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలన్నారు.
అవి మరపురాని క్షణాలు
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఈ నెల 31న ఘనంగా నిర్వహించుకుందామని మోదీ అన్నారు. ‘‘గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు నవంబర్ 15న ప్రారంభమవుతాయి. గతేడాది జార్ఖండ్‌లో బిర్సా ముండా స్వగ్రామం ఉలిహాతును సందర్శించా. అవి మరపురాని క్షణాలు’’ అన్నారు.
యానిమేషన్‌లో అద్భుతాలు
ప్రతి రంగంలోనూ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తి కనిపిస్తోందని మోదీ హర్షం వెలిబుచ్చారు. ‘‘మన రక్షణ ఉత్పత్తులు 85 దేశాలకు ఎగుమతవుతున్నాయి. యానిమేషన్ రంగంలో మన కళాకారులు గణనీయమైన ప్రగతి సాధించారు. చోటా భీమ్, హనుమాన్, మోటు–పత్లూ, ధోలక్‌పూర్ కా ధోల్ వంటి యానిమేషన్ సిరీస్‌లు విదేశాల్లోనూ ప్రజాదరణ పొందుతున్నాయి. భారత్‌ను ప్రపంచ యానిమేషన్ పవర్‌హౌస్‌గా మారుద్దాం. ఇండియాలో గేమింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. మన గేమ్స్‌కు ప్రపంచమంతటా ఆదరణ ఉంది. ప ర్యాటకానికి వర్చువల్ రియాలిటీ (వీటీ) ఊతం ఇస్తోంది. ప్రపంచంలో తదుపరి సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం మీ కంప్యూటర్ నుంచే రావొచ్చు. మరో గొప్ప గేమ్‌ను మీరే సృష్టించవచ్చు’’ అని యువతనుద్దేశించి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment