న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజల్లో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలింది. నూతన సంవత్సరంలోనూ ఇదే స్ఫూర్తిని, వేగాన్ని కొనసాగించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండిందన్నారు. ఆదివారం 108వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘ఫిట్ ఇండియా’ మన లక్ష్యం కావాలని, ఇందుకోసం భౌతిక, మానసిక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు వాసుదేవ్, భారత మహిళా క్రికెట్ టీమ్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్, చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ఫిట్‌నెస్ సలహాలిచ్చారు. దేశం ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆవిష్కరణలు జరగకపోతే అభివృద్ధి నిలిచిపోతుందని అన్నారు. భారత్ ‘ఇన్నోవేషన్ హబ్’గా మారిందని, అభివృద్ధి పరుగును ఆపబోమనే సత్యాన్ని చాటిందని అన్నారు. నూతన ఆవిష్కరణల్లో 2015లో 81వ స్థానం నుంచి దేశమిప్పుడు 40వ స్థానానికి చేరిందని తెలిపారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
సృజనాత్మకతను పంచుకోండి
‘‘2023లో మన దేశం ఎన్నో ప్రత్యేక ఘనతలు సాధించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పట్ల ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. వారి మనోభావాలను విభిన్న రీతుల్లో తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడిపై, అయోధ్యపై కొత్తకొత్త పాటలు, భజనలు రచించి స్వరపరుస్తున్నారు. చాలామంది కొత్త గేయాలు, పద్యాలు రచిస్తున్నారు.
అనుభవజు్ఞలైన కళాకారులతోపాటు యువ కళాకారులు సైతం శ్రీరాముడిపై, అయోధ్యలో రామమందిర నిర్మాణంపై పాటలు, భజనలు రాస్తున్నారు. చక్కగా ఆలపిస్తున్నారు. కొన్నింటిని నా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో కళాకారులు భాగస్వాములవుతుండడం హర్షణీయం. ‘శ్రీరామ్‌భజన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో మీ సృజనాత్మకతను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని కోరుతున్నా.
ఈ పాటలు, భజనాలన్నీ కలిపి ఒక భావోద్వేగ ప్రవాహంగా, ప్రార్థనగా మారుతాయి. శ్రీరాముడి బోధించిన నీతి, న్యాయం వంటి సూత్రాలతో ప్రజలు మమేకం అయ్యేందుకు తోడ్పడుతాయి. తెలుగు పాట ‘నాటు నాటు’కు 2023లో ఆస్కార్ అవార్డు లభించడం దేశ ప్రజలకు ఆనందాన్నిచి్చంది. అలాగే ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే తమిళ డాక్యుమెంటరీకి కూడా ఆస్కార్ లభించింది. వీటిద్వారా భారతదేశ సృజనను, పర్యావరణంతో మనకున్న అనుబంధాన్ని ప్రపంచం గుర్తించింది.’’
ఎన్నెన్నో ఘనతలు
‘భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దీనిపై ప్రజలు లేఖలు రాసి ఆనందం పంచుకున్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడంపైనా వారు లేఖలు రాశారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతంపై నాకిప్పటికీ సందేశాలు అందుతున్నాయి. దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తులు కొని ఉపయోగించడం ద్వారా మన శక్తిని నిరూపించాం. 2023లో మన క్రీడాకారులు సాధించిన విజయాలు దేశం గర్వపడేలా చేశాయి. మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ ప్రదర్శించారు.
ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలు సొంతం చేసుకున్నారు. వన్డే క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు అందరి మనసులు దోచేలా ప్రతిభ చూపింది. అండర్–19 టీ20 ప్రపంచకప్‌లో మహిళల జట్టు సాధించిన విజయం ప్రేరణగా నిలుస్తుంది. 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మేరీ మాటీ–మేరా దేశ్ వంటి కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వాములయ్యారు’’.
ఫిట్టర్ లైఫ్ కావాలి: అక్షయ్ కుమార్
సినిమా తారలను గుడ్డిగా అనుకరించవద్దని ప్రజలకు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సూచించారు. సినీ నటులను చూసి ‘ఫిల్టర్స్ లైఫ్’ ఎంచుకోవద్దని, ‘ఫిట్టర్ లైఫ్’ గడపాలని పేర్కొన్నారు. ఫిట్‌నెస్‌కి సంబంధించి ‘మన్ కీ బాత్’లో ఆయన పలు సూచనలు చేశారు. వాస్తవానికి నటులు తెరపై కనిపించినట్లుగా బయట ఉండరని అన్నారు.
తెరపై వారు బాగా కనిపించడానికి వివిధ రకాల ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తారని వెల్లడించారు. నటులను చూసి యువత ఫిట్‌నెట్ కోసం దగ్గరిదారులు ఎంచుకుంటున్నారని, కండల కోసం స్టెరాయిడ్స్ వంటివి వాడుతున్నారని అక్షయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త సంత్సరంలో ఫిట్‌నెస్ సాధించడం ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవాలని అక్షయ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment