న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతన్నలకు లాభాలే తప్ప ఎలాంటి నష్టం ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ చట్టాలతో అన్నదాతలకు నూతన అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటున్నాయని చెప్పారు. ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడారు.
అన్నదాతలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త వ్యవసాయ చట్టాలతో అతి తక్కువ సమయంలోనే పరిష్కారం దొరుకుతోందని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో రైతులకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
రైతులు బంధ విముక్తులయ్యారు..
‘‘ఎన్నో ఏళ్లుగా రైతులు ఎన్నో డిమాండ్లు వినిపిస్తున్నారు. రాజకీయ పార్టీలు రైతన్నలకు ఎన్నో హామీలిస్తున్నాయి. ఈ డిమాండ్లు, çహామీలను ప్రభుత్వం నెరవేర్చింది. మేము అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణలతో అన్నదాతలు బంధ విముక్తులయ్యారు. వారికి చాలా అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. హక్కులు దఖలు పడ్డాయి. అతి తక్కువ సమయంలోనే రైతుల సమస్యలు పరిష్కారమవుతున్నాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు. కొత్త సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్న డిమాండ్‌తో వేలాదిగా రైతులు ఢిల్లీలో 4 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మన కళాఖండాలను వెనక్కి తీసుకొస్తున్నాం..
ఏ రంగంలోనైనా సరైన సమాచారం అనేది ప్రజలకు ఒక బలమేనని ప్రధాని మోదీ తెలిపారు. పుకార్లకు, గందరగోళానికి తావు లేని సమాచారం కావాలన్నారు. 1913లో వారణాసిలో అపహరణకు గురైన మాత అన్నపూర్ణ విగ్రహాన్ని కెనడా నుంచి వెనక్కి తీసుకొచ్చామని గుర్తుచేశారు. అత్యంత విలువైన ప్రాచీన సంపద అంతర్జాతీయ ముఠాల చేతుల్లో చిక్కుకుందన్నారు. మన కళాఖండాలను ఆయా ముఠాలు అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాయని చెప్పారు. వాటిని వెనక్కి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని గుర్తుచేశారు.
కర్తార్‌పూర్ కారిడార్ చరిత్రాత్మకం..
సిక్కు గురువు గురు నానక్ జయంతి సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా ఆయన అందించిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. సిక్కు గురువులు, గురుద్వారాలకు సంబంధించిన ఎన్నో పనుల్లో భాగస్వామి కావడం తన అదృష్టమన్నారు. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభం చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు.
భారతీయ సంస్కృతికి ఆదరణ..
విలక్షణమైన భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఇనుమడిస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. బ్రెజిల్‌కు చెందిన జోనాస్ మాసెట్టి భారతీయ వేదాలు, భగవద్గీత, మన సంప్రదాయాలు, సంస్కృతిని బహుళ ప్రచారంలోకి తీసుకొస్తున్నారని తెలిపారు. న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడు గౌరవ్ శర్మ ఇటీవల సంస్కృత భాషలో ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేశారు. ప్రముఖ తత్వవేత్త శ్రీఅరబిందోను కూడా ప్రధాని మోదీ స్మరించుకున్నారు. శ్రీఅరబిందో జయంతి డిసెంబర్ 5వ తేదీన జరగనుంది.
వ్యాక్సిన్ బృందాలతో నేడు మోదీ మాటామంతీ
వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో ముందంజలో ఉన్న మూడు బృందాలతో ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. జెనోవా బయోఫార్మా, బయోలాజికల్ ఈ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ సంస్థల పరిశోధకులతో మోదీ సంభాషిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం ట్విట్టర్‌లో వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి పురోగతిని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ శనివారం అహ్మదాబాద్, హైదరాబాద్, పుణేల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment