న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 72 వ మన్ కీ బాత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతులు, నెటిజన్ల పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రేడియోలో మీరు చెప్తున్నదంతా వినీ వినీ అలసిపోయాం. ఇక చాలు ఆపండి. మా గోడు కూడా వినండి అని రైతులు విమర్శిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు బోర్డర్, ఫరీద్‌కోట్, రోహ్‌తక్ ప్రాంతాల్లో ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు. ఈ మూడు ప్రాంతాలు బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలోనివి కావడం విశేషం.
ఇక ట్విటర్‌లోనూ ‘మోదీ బక్వాస్ బంద్ కరో’ (మోదీ వ్యర్థ ప్రేలాపణ ఆపండి) అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఆదివారం మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభం కాగానే ఈ హ్యాష్‌ట్యాగ్ భారత్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘ప్రధాని మోదీ గారు. మన్ కీ బాత్ కాదు, నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న నిరవధిక నిరసనలపై మాట్లాడండి’ అని డిమాండ్ చేస్తున్నారు. ‘ప్రజలు చెప్పే విషయాన్ని మోదీ వినరు.. కానీ ఆయన మన్ కీ బాత్ అందరూ వినాలి’ అంటూ మరో నెటిజెన్ రాసుకొచ్చారు. మరోవైపు బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో మోదీ మన్ కీ బాత్ వీడియోపై డిస్‌లైక్‌ల పరంపర మళ్లీ మొదలైంది. ఆ వీడియోకు వచ్చిన లైక్‌ల కంటే ఎక్కువ సంఖ్యలో డిస్‌లైకులు వస్తున్నాయి.
(చదవండి: సాగు చట్టాలతో రైతులకు లాభం)
ఆ మాటలు వినిపించొద్దు అంటే..
వ్యవసాయ బిల్లులపై రైతుల నిరసన నేపథ్యంలో గత ఆదివారం స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలపాలని రైతులకు పిలుపునిచ్చారు. మన గోడు వినని ప్రధాని మాటల్ని వినాల్సిన అవసరం లేదని అన్నారు. డిసెంబర్ 27 మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రైతులెవరూ పట్టించుకోవద్దు. దానికి నిరసనగా పల్లాలు మోగించండి. అలాచేస్తే ప్రధాని మన్ కీ బాత్ మనకు వినపడదు అని యోగేంద్ర సూచించారు. ఇక కరోనా లాక్‌డౌన్ మొదలైన సమయంలో ఆరోగ్య రంగంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవల గౌరవార్థం ప్రధాని మోదీ చప్పట్లు కొట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు రైతుల సంఘాల నేతలతో కేంద్రం ఐదు సార్లు జరిపిన చర్చలు విఫలం కాగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. వారి సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేయాలని ఆదేశించింది.
(చదవండి: అన్నదాతల ధర్మాగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment