పశ్చిమ బెంగాల్‌లో సౌత్ దినాజ్‌పూర్ జిల్లా బాలూర్ఘాట్‌లో పంటపొలాల్లో మన్‌కీ బాత్ వింటున్న రైతులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఆదివారంతో 100 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తనకు ఆధ్యాత్మిక ప్రయాణంగా అభివర్ణించారు. ‘‘ఇది కేవలం కార్యక్రమం కాదు. నా విశ్వాసానికి సంబంధించిన అంశం. 2014లో ఢిల్లీ వచ్చాక నాలో ఉన్నట్టనిపించిన ఖాళీని భర్తీ చేసింది.
కోట్లాది ప్రజలకు నా భావాలను తెలియజేసేందుకు ఉపయోగపడింది. ప్రజల నుంచి ఎప్పుడూ దూరంగా లేనన్న భావన కలిగించింది’’ అంటూ మన్ కీ బాత్‌తో ముడిపడ్డ తన జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులను నెమరేసుకున్నారు. గత మన్ కీ బాత్‌ల్లో ప్రస్తావించిన పలువురు విశిష్ట వ్యక్తులతో ఈ సందర్బంగా ఫోన్‌లో మాట్లాడారు. గత ఎపిసోడ్లలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ ప్రసాద్ ను ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే...
ఇతరుల నుంచి ఎంతో నేర్చుకున్నా...
‘‘2014 అక్టోబర్ 3న విజయ దశమి నాడు మన్ కీ బాత్‌కు శ్రీకారం చుట్టాం. ఇప్పుడదో పండుగలా మారింది. 100వ ఎపిసోడ్ సందర్భంగా శ్రోతల నుంచి వేలాది లేఖలందాయి. అవి భావోద్వేగాలకు గురిచేశాయి. కోట్లాది భారతీయుల మనసులో మాటకు, వారి భావాల వ్యక్తీకరణకు ప్రతిబింబం మన్ కీ బాత్. స్వచ్ఛ భారత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వంటి వాటిని తొలుత మన్ కీ బాత్‌లోనే ప్రస్తావించాం. తర్వాత ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఈ రేడియో కార్యక్రమం రాజకీయాలకతీతం.
ఇతరుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కీలక మాధ్యమంగా మారింది. శత్రువులైనా మంచి గుణాలను గౌరవించాలని నా గురువు లక్ష్మణ్‌రావు ఈనాందార్ చెప్పేవారు. ఇతరుల్లోని సద్గుణాలను ఆరాధించడంతో పాటు వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన్ కీ బాత్ నాకో కసరత్తులా ఉపయోగపడింది. మన్ కీ బాత్ నిజానికి మౌన్ (నిశ్శబ్దం) కీ బాత్ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. చైనాతో వివాదం, అదానీ అక్రమాలు, ఆర్థిక అసమానతలు, మహిళలపై అరాచకాల వంటి కీలకాంశాలను 100వ ఎపిసోడ్‌లో మోదీ ఎందుకు ప్రస్తావించలేదని ఆక్షేపించింది.
దేశ ప్రజలే నాకు సర్వస్వం
‘‘గుజరాత్ సీఎంగా తరచూ ప్రజలను కలుస్తూ, మాట్లాడుతూ ఉండేవాన్ని. 2014లో ఢిల్లీకి చేరాక భిన్నమైన జీవితం, పని విధానం, బాధ్యతలు! చుట్టూ పటిష్ట భద్రత, సమయపరమైన పరిమితులు. ఇలా ప్రజలను కలవని రోజంటూ వస్తుందని అనుకోలేదు. నాకు సర్వస్వమైన దేశ ప్రజల నుంచి దూరంగా జీవించలేను. ఈ సవాలుకు మన్ కీ బాత్ పరిష్కార మార్గం చూపింది. ఇది నాకు ఒక ఆరాధన, ఒక వ్రతం. గుడికెళ్లి ప్రసాదం తెచ్చుకుంటాం. ప్రజలనే దేవుడి నుంచి నాకు లభించిన ప్రసాదం మన్ కీ బాత్. ప్రజాసేవ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సాగిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులు నాకు మార్గదర్శకులుగా మారారు. మన్ కీ బాత్‌లో గతంలో ప్రస్తావించిన వ్యక్తులంతా హీరోలే. వారే ఈ కార్యక్రమానికి జీవం పోశారు’’
ఐరాస, విదేశాల్లోనూ...
న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మన్ కీ బాత్ 100వ ఎడిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ట్వీట్ చేశారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రీ అజాలే మన్ కీ బాత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారు. పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా, చిలీ, మొరాకో, మెక్సికో, కాంగో, ఇరాక్, ఇండోనేషియా తదితర దేశాల్లో మన్ కీ బాత్‌కు విశేష స్పందన లభించింది.
దేశమంతటా...
► మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం దేశవ్యాప్తంగా పండుగలా జరిపారు.
► ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా వీక్షించారు.
► బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.ళీ ‘‘ఇది కేవలం రేడియో కార్యక్రమం కాదు. సామాజిక మార్పుకు చోదక శక్తి. మోదీ సందేశం యువతకు స్ఫూర్తినిస్తోంది’’ అని అమిత్ షా కొనియాడారు.
► అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు భారత్‌లో, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అమెరికాలో కార్యక్రమాన్ని వీక్షించారు.
కేరళలోని కొచ్చిన్‌లో పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులతో కలిసి మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్ వింటున్న నూతన వధూవరులు
Comments
Please login to add a commentAdd a comment