న్యూఢిల్లీ: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేశ ప్రజలను ప్రధాని మోదీ హెచ్చరించారు. అన్ని జాగ్రత్తలతో మరింత అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ కరోనా సంక్షోభం పేదలు, కూలీలు, శ్రామికులపై పెను ప్రభావం చూపిందన్నారు. వారి బాధను వర్ణించేందుకు తనవద్ద మాటలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వలస శ్రామికుల నైపుణ్యాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, కొత్తగా మైగ్రేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని వెల్లడించారు. గతంలో జరిగిన వాటిని సమీక్షించుకుని, తప్పులను సవరించుకుని, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకునేందుకు లభించిన అవకాశం ఈ సంక్షోభం అన్నారు.
ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా పునః ప్రారంభమైందన్న ప్రధాని.. కరోనాపై పోరులో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం వద్దని ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలకు ఇచ్చే సందేశం ‘మన్ కీ బాత్’లో హితవు పలికారు. దేశీయంగా రైల్వే, విమాన సర్వీసులు పరిమితంగా ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరిన్ని సడలింపులు త్వరలో ఉంటాయని తెలిపారు. కష్టపడి కరోనాను కొంతవరకు కట్టడి చేశామని, పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవాల్సి ఉందని సూచించారు.
‘స్వావలంబ భారత్’ ఇప్పుడొక నినాదం
కరోనా సంక్షోభంతో అన్ని వర్గాలు ఇబ్బందులు పడినప్పటికీ.. నిరుపేదలపై దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉందన్నారు. ‘మనం గ్రామ స్థాయి నుంచి ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించి ఉంటే.. ఇంత కఠిన పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు. తన పిలుపుతో ‘స్వావలంబ భారత్’ నినాదం ఉద్యమంగా మారిందని, ఇప్పుడంతా స్థానిక ఉత్పత్తులనే కొంటున్నారన్నారు. పేదలకు అంతా చేతనైనంత సాయం అందిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. వలస కూలీలను శ్రామిక్ రైళ్ల ద్వారా సొంతూళ్లకు తరలిస్తూ రైల్వే శాఖ గొప్ప సేవ చేస్తోందన్నారు.
వలసలు ఎక్కువగా ఉండే దేశ తూర్పు ప్రాంతం ఈ సంక్షోభం కారణంగా ఎక్కువగా కష్టనష్టాలను ఎదుర్కొందని, దేశాభివృద్ధికి చోదక శక్తిగా మారగల ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ‘గత ఐదేళ్లుగా ఈ దిశగా కొంత సాధించాం. ఇప్పుడు వలస కూలీల వెతలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళికలను రచించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీతో గ్రామీణ ఉపాధి, స్వయం ఉపాధి, చిన్నతరహ పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment