తగ్గిన కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: వాతావరణం అనుకూలించడంతో ప్రస్తుతం కొన్ని కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా టమాటా ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురవడం అదేవిధంగా ఇతర కారణాల వల్ల గత రెండు నెలలుగా కూరగాయల ధరలలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉన్నాయి. వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ సంతృప్తి కరంగా కురవడంతో గత నెలలో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రానికి (ఏపీఎంసీ) కూరగాయల సరఫరా కూడా పెరిగింది. దీంతో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ సందర్భంగా సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల కూరగాయలు ఈ మార్కెట్‌కు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఇది చాలా ఎక్కువన్నారు.
గతంలో రోజుకు కేవలం 350- 400 ట్రక్కుల కూరగాయలు మాత్రమే సరఫరా అయ్యేవని తెలిపారు. ఇప్పుడు సరఫరా పెరగడంతో టమాటాల ధరలు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో టమాటా ధర కిలోకు రూ.8 నుంచి 10 వరకు పలుకుతోంది. కాగా, మరికొన్ని వారాల వరకు కూరగాయల ధరల్లో తగ్గుదల కనిపిస్తుందని కూరగాయల వ్యాపారి రామ్‌దాస్ పవాలే తెలిపారు. కాగా, క్యారెట్, క్యాబేజీ, దొండకాయలు, పచ్చి బఠాణీ, పచ్చి మిరప ధరలు కూడా గణనీయంగా తగ్గగా గోరుచిక్కుడు, గోబి పువ్వు, బెండకాయల ధరలు స్థిరంగా ఉన్నాయి.