‘రైతులకు స్వేచ్ఛ’ అమలయ్యేనా?
ముంబై: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని, పండ్లు, కూరగాయలు రైతులు తమకిష్టం వచ్చినచోట విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అయోమయంలో పడ్డారు. ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, సంబంధిత వ్యక్తులతో మాట్లాడిన తర్వాత వారి సమస్యలు విని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము తీసుకునే నిర్ణయం రైతులకు ప్రయోజనకరంగానే ఉంటుందని చెప్పారు. వ్యవసాయదారుల కుంభమేళాగా చెప్పుకునే ‘కృషి వసంత్’ మేళా ప్రారంభించే విషయమై ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. ‘కృషి వసంత్’ ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నాగపూర్‌లో జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్ మాట్లాడుతూ...
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో రైతులకు ప్రయోజన ం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారని, పండ్లు, కూరగయాలను తమకు అనుకూలమైన చోట విక్రయించుకునే అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన ఆదేశించారని, అందుకోసం ఏపీఎంసీ చట్టాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని ఆయన సూచించారన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా రైతులకు కొంత స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఏపీఎంసీలోనే తమ పంటలను విక్రయించాలనే ఒత్తిడి నుంచి వారికి విముక్తి లభిస్తుందన్నారు. ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ తమ పంటలను విక్రయించుకునే అవకాశం లభిస్తుందన్నారు.