జాతీయ విపత్తే
ముంబై: రాష్ట్రంలో ఇటీవల వడగళ్ల వాన ధాటికి పంటలు, ఆస్తులు, జీవితాలు నాశనమయ్యాయని, ఇది నిజమైన జాతీయ విపత్తు అని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. పంటలు కోల్పోయిన రైతులకు సాధ్యమైనంత మేర చేయూతనిస్తామని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు.
దీన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ కోణంలో చూడొద్దని, నైరాశ్యంలో ఉన్న రైతాంగానికి సహకరించాలనే ధృక్పథంతో ఆలోచిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో వచ్చిన వడగాళ్ల వానను జాతీయ విపత్తుగా పరిగణించాలని బీజేపీ డిమాండ్ చేసిన నేపథ్యంలో సీఎం ప్రకటన రావడం గమనార్హం. ఇటీవల ప్రధానమంత్రిని కలిసి రూ.ఐదువేల కోట్లు పునరావాసం కింద మంజూరు చేయాలని కోరానని చవాన్ తెలిపారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చే విషయంపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దు
అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవద్దని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ కోరారు. ఆదివారం నుంచి ఇప్పటివరకు 32 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన అకాలవర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతుల బాధలు తమకు తెలుసని, రాష్ట్రంలోని 35 జిల్లాల్లో 28 ప్రాంతాల్లో భారీగా పంట నష్టం సంభవించిందని వివరించారు. ‘ప్రతి రైతన్నకు చేదోడువాదోడుగా ఉంటాం. ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తాం.
భావోద్వేగాలు, నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకోవద్దని అభ్యర్థిస్తున్నా. సాధ్యమైన మేర ఆదుకునే ప్రయత్నం చేస్తామ’ని చవాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించే ప్రక్రియ ఆలస్యమవుతోందని గుర్తు చేశారు. ఇప్పటికే పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని ఓ అత్యున్నత స్థాయి కమిటీని పీఎం నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. సుశీల్ కుమార్ షిండే, పి.చిదంబరం, జైరాం రమేశ్, ఎంఎస్ అతుల్‌వాలియాలతో కూడిన ఈ బృందం బుధవారం సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితుల గురించి చర్చించిందన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులను కలసి, ఇటీవల రాష్ట్రంలో వడగళ్ల వాన సృష్టించిన ప్రళయాన్ని వివరించామని తెలిపారు. రైతులకు నష్టపరిహారం అందించేందుకు నిబంధనాల్లో సడలింపులు ఇవ్వాలని కోరామన్నారు.
ఏప్రిల్ 10వ తేదీలోపు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు (నోటా)ను నొక్కుతామని విదర్భ రైతులు హెచ్చరించిన నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పార్లమెంట్‌లో రైతుల వాణి వినిపించేందుకు పది శాతం ప్రాతినిధ్యం కల్పించాలని వార్ధాలో గురువారం పర్యటించిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని విదర్భ రైతులు కోరారు.
‘పంట నష్టంతో కొంత మంది అన్నదాతలు గ్రామంలో బహిరంగ ప్రాంతంలోనే ఉరి వేసుకుంటున్నారు. వారికి స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థలు కౌన్సెలింగ్ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. తమ సమస్యలను వినిపించే రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఎవరూ లేరన్న నిరాశానిస్పృహల్లో ఉన్నార’ని విదర్భ జనాందోళన సమితి (వీజేఏఎస్) అధ్యక్షుడు కిశోర్ తివారి బుధవారం పేర్కొన్నారు.
ప్యాకేజీ ప్రకటనపై ఈసీని కలుస్తాం: పవార్
న్యూఢిల్లీ: గత నెలలో కురిసిన అకాల వర్షాలకు భారీ స్థాయిలో పంటలు ధ్వంసమైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు పునరావాస ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్రం గురువారం ఎన్నికల కమిషన్ అనుమతి కోరనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ నేతృత్వంలోని మంత్రుల బృందం బుధవారం సమావేశమై ఈ రెండు రాష్ట్రాలకు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది.
అయితే మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై తమకు ఎలాంటి సమాచారం లేదని పవార్ మీడియాకు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పునరావాస ప్యాకేజీ ఎంత అనేది ఇప్పుడే చెప్పలేనని వివరించారు. ఈ ప్యాకేజీ ప్రకటనపై గురువారం ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుంటామన్నారు.
తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాలవర్షాలు, వడగళ్ల వానలకు పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు రూ.20వేల కోట్ల నష్టపరిహారం ఇప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది.
షోలాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు గోరఖ్ ఆనంద్ గాడ్డే, విఠల్‌రావ్ పవార్‌లు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షా, జస్టిస్ ఎం.ఎస్.సంక్లేచా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించనుంది.