kaciguda
-
కనుల పండువగా కల్యాణం
కాచిగూడలో వేడుక భారీగా తరలివచ్చిన భక్తజనం కాచిగూడ: పద్మావతి అలివేలు మంగ సహిత వేంకటేశ్వర కల్యాణమహోత్సం అంగరంగ వైభ వంగా జరిగింది. ఆదివారం రాత్రి కాచిగూడ స్టేషన్ రోడ్డులోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం హాలు ప్రాంగణంలో తిరుపతి తిరుమల దేవస్థానం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కనులపండువగా నిర్వహించారు. టీటీడీ సంచార కల్యాణ మూర్తులను స్వాగతించి లోక కల్యాణార్థం ఈ మహోత్సవాన్ని చేపట్టారు. టీటీడీ ప్రధాన అర్చకులు గురురాజారావు, సుందరవదనాచార్, కాది పత్రి స్వామిల నేతృత్వంలో కల్యాణం జరి గింది. సమాజ శ్రేయస్సు కోసమే శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నామని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు, కల్యాణ ప్రాజెక్టు ఆఫీసర్ రాంచంద్రారెడ్డిలు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ మ్యాడం జనార్దన్‌రావు, ట్రస్టీలు మ్యాడం వెంకట్రావు, గంప చంద్రమోహన్, పుంజరి బద్రినారాయణ. జెల్లి సిద్ధయ్య, ఆకుల పాండురంగారావు, పన్నాల విష్ణువర్ధన్, మున్నూరుకాపు మహాసభ ప్రతినిధులు పిల్లి శ్రీనివాస్, చామకూర ప్రదీప్, కొండూరు వినోద్‌కుమార్ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండ దేవయ్య తదితరులు హాజరయ్యారు. శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం నాలుగు గంటలపాటు జరిగింది. విశ్వక్సేన, ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, స్వస్తీవచనంతో కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. తిరుమలలోని అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి వచ్చిన ప్రత్యేకబృందం కళాకారులు ఈ సందర్భంగా స్వామివారి కీర్తనలు ఆలపించారు. -
డబుల్ డెక్కర్ రెడీ
13 నుంచి అందుబాటులోకి.. కాచిగూడ నుంచి గుంటూరు, తిరుపతిలకు బైవీక్లీ సర్వీసులు రెండంతస్తుల రైలు పట్టాలపెకైక్కనుంది. ఒకప్పటి డబుల్ డెక్కర్ బస్సును గుర్తుకు తెచ్చే ఈ ట్రైన్ కాచిగూడ నుంచి వారానికి రెండుసార్లు గుంటూరు, తిరుపతి పట్టణాలకు పరుగులు తీయనుంది. రైల్వే భద్రతా కమిషన్ అనుమతితో కూత పెట్టేందుకు సిద్ధమైన ఈ ట్రైన్.. తొలిసర్వీసు 13వ తేదీన కాచిగూడ నుంచి గుంటూరుకు, 14వ తేదీన కాచిగూడ నుంచి తిరుపతికి బయలు దేరనుంది. రెండు మార్గాల్లో ప్రయాణికులకు ఊరట.. జంటనగరాల నుంచి ప్రతిరోజూ 80కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 220 ప్యాసింజర్, లోకల్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రతి రోజు 2.5 లక్షల మంది సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి బయలుదేరుతారు. కానీ నగరం నుంచి తిరుపతి, గుంటూరు పట్టణాలకు మాత్రం విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరుతారు. ప్రస్తుతం నగరం నుంచి వెంకటాద్రి, నారాయణాద్రి, పద్మావతి, కృష్ణా ఎక్స్‌ప్రెస్, రాయలసీమ, సెవెన్‌హిల్స్, మద్రాస్ ఎక్స్‌ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లతోపాటు, మరో రెండు పాసింగ్ త్రూ రైళ్లు తిరుపతికి రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే గుంటూరు పట్టణానికి నగరం నుంచి జన్మభూమి, ఇంటర్ సిటీ, శబరి, ఫలక్‌నుమా, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్, నారాయణాద్రి, నర్సాపూర్, రేపల్లె ప్యాసింజర్, పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ వేలాదిమంది ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు. డబుల్‌డెక్కర్ వల్ల ఈ రెండు మార్గాల్లోను ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. పైగా ఈ సర్వీసులు పూర్తిగా పగటిపూట మాత్రమే నడుస్తాయి. ఉదయం బయలుదేరి సాయంత్రం తిరుపతికి చేరుకొనే విధంగా, మధ్యాహ్నం గుంటూరుకు చేరుకొనే విధంగా అందుబాటులో ఉంటాయి. గుం‘టూరు’ వివరాలివీ... కాచిగూడ-గుంటూరు (22118) ఏసీ డబుల్‌డెక్కర్ బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి ఉదయం 5.46 గంటలకు మల్కాజిగిరి స్టేషన్‌కు, 7.21 గంటలకు నల్గొండకు, 7.51 గంటలకు మిర్యాలగూడకు, 8.36 గంటలకు పిడుగురాళ్లకు, ఉదయం 10.40 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుంటూరు-కాచిగూడ (22117) ఏసీ బై వీక్లీ డబుల్ డెక్కర్ ప్రతి మంగళ, శుక్ర వారాల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.36 గంటలకు పిడుగురాళ్ల, 2.36లకు మిర్యాలగూడ, 3.01లకు నల్లగొండ, సాయంత్రం 5.41 గంటలకు మల్కాజిగిరి చేరుకుంటుంది. సాయంత్రం 5.55 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుపతి ప్రయాణం ఇలా.. కాచిగూడ-తిరుపతి (22120) ఏసీ డబుల్‌డెక్కర్ ప్రతి బుధ, శని వారాలలో ఉదయం 6.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి ఉదయం 8.06 గంటలకు మహబూబ్‌నగర్, 9.26కు గద్వాల్, 11కు కర్నూల్, మధ్యాహ్నం 12.10కి డోన్, ఒంటిగంటకు గుత్తి, 1.47కు తాడిపత్రి, 2.49కు ఎర్రగుంట్ల, 3.20కు కడప, సాయంత్రం 4.20కి రాజంపేట్, 5.35 గంటలకు రేణిగుంట, సాయంత్రం 6.18 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి-కాచిగూడ (22119) డబుల్ డెక్కర్ ప్రతి గురు, ఆది వారాల్లో ఉదయం 5.45 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి ఉదయం 6 గంటలకు రేణిగుంట, 7.13కు రాజంపేట్, 8.05కు కడప, 8.43కి ఎర్రగుంట్ల, 9.46కు తాడిపత్రి, 11కు గుత్తి, మధ్యాహ్నం 12.10కి డోన్, ఒంటిగంటకు కర్నూల్, 2.05కు గద్వాల్, 3.05కు మహబూబ్‌నగర్ స్టేషన్, సాయంత్రం 5.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ప్రత్యేకతలివీ.. ఈ ట్రైన్ లోయర్ డెక్‌లో 48 సీట్లు, అప్పర్ డెక్‌లో 50 సీట్లు ఉంటాయి. మిడిల్ డెక్‌లో 22 సీట్లు ఉంటాయి. ఒక బోగీలో 120 సీట్ల చొప్పున మొత్తం 14 బోగీలలో 1680 సీట్లు ఉంటాయి. కాచిగూడ నుంచి తిరుపతికి 10 గంటల్లో, గుంటూరుకు 5 గంటల్లో చేరుకుంటుంది. డబుల్ డెక్కర్ ట్రైన్ చార్జీలు : నగరం నుంచి గుంటూరుకు రూ. 415, కర్నూలుకు రూ. 335, తిరుపతికి రూ. 720 -
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన...
అరవైఏళ్లకిత్రం జరిగిన సంఘటన కారణంగా హైదరాబాద్, కాచిగూడలో వెలసిన షాపు ఆదర్శ డ్రెస్ పాలెస్. ఏమిటా సంఘటన అంటారా? తిరుమల శేషాచార్యులు అని తెలంగాణ పద్యనాటక పితామహుడు. ఆయనకి నాటకాలంటే ప్రాణం. నిజాం గవర్నమెంటు తెలుగువారి కళలు స్టేజ్ ఎక్కడానికి వీల్లేదంటూ నిబంధనలు పెట్టింది. అయినా వారి కన్నుగప్పి శేషాచార్యులు నాటకాలు వేస్తుండేవారు. ఉద్యోగరీత్యా లెక్చరర్ అయిన శేషాచార్యులు ఒకసారి వికారాబాద్‌లో ఒక నాటకం వేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అప్పట్లో హైదరాబాద్‌లోని కళాకారులకు డ్రెస్‌లు గుంటూరు నుంచి వచ్చేవి. వికారాబాద్‌లో నాటక సమయానికి వర్షాల కారణంగా డ్రస్‌లు అందలేదు. దాంతో నాటకం ఆగిపోయింది. అప్పుడు శేషాచార్యులు ఒక నిర్ణయం తీసుకున్నారు. తాను వేసే నాటకాల కోసం ప్రత్యేకంగా బట్టలు కుట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ విషయం తెలిసిన తోటి కళాకారులు శేషాచార్యులుగారి బట్టల్ని అద్దెకు తీసుకెళ్లడం మొదలెట్టారు. నాటకాలొక్కటే కాదు, నాట్య కళాకారులకు కూడా వేషాధారణ వస్త్రాలు ఎక్కడి నుంచో రావడం చూసి శేషాచార్యులు తానే స్వయంగా ఒక షాపు పెట్టి కళాకారులకు డ్రెస్‌లు అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా 1954లో ఆదర్శ డ్రెస్ పాలెస్ వెలసింది. కళపై అభిమానం... ‘‘మా నాన్నకు నాటకాలంటే ప్రాణం. శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ తులాభారం నాటకాలకు ఆయన చాలా ఫేమస్. కళాకారులకు అన్నీ అందుబాటులో ఉంటే కళలు మరింత అభివృద్ధి చెందుతాయనేవారు. చివరి నిమిషం వరకూ అదే మాటను కలవరించారు. నాన్నగారి తర్వాత అన్నయ్య పార్థసారథి షాపు బాధ్యతలు తీసుకున్నారు. నేను ఎంబీఏ పూర్తిచేసి దుబాయ్‌లో సేల్స్ మేనేజర్ ఉద్యోగం చేస్తుండగా నాన్నగారు చనిపోయారు. దాంతో వెంటనే ఇండియా వచ్చేశాను. అన్నయ్యకు కూడా పెద్దవయసు అవడంతో షాపు బాధ్యతలు నేను తీసుకున్నాను. నాకు కూడా నాటకరంగం, నృత్యప్రదర్శనలంటే చాలా యిష్టం. దుబాయ్‌లో ఉన్నప్పుడు అక్కడ రసమయి తెలుగు అసోసియేషన్‌కి కల్చరర్ సెక్రటరీగా పనిచేశాను. ఆదర్శ డ్రెస్ పాలెస్‌ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నది నాకోరిక. దానికి తగ్గట్టుగానే సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాను’’ అని చెప్పారు తిరుమల శ్రీనివాసాచార్యులు. అక్కడే తయారి.... ఆ షాపులో జడ మొదలు గజ్జెల వరకూ ఒక పక్క తయారుచేస్తుంటే మరోపక్క ప్యాక్ చేస్తుంటారు. దుస్తుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...కుడుతూనే ఉంటారు.‘‘భారతం, రామాయణం పాత్రలన్నింటికీ మా దగ్గర ఆహార్యం ఉంది. అలాగే ఇండియన్ క్లాసికల్ డాన్సులన్నింటికీ వేషాధారణలు ఉన్నాయి. ఒక్క వస్త్రాలు, ఆభరణాలే కాదు...మేకప్ కూడా మావాళ్లే చేస్తారు. కొందరు కళాకారులు ఇక్కడికే వచ్చి తయారయి వెళుతుంటారు. పెద్ద పెద్ద స్టేజిషోలకయితే మా స్టాఫ్ వెళ్లి అలంకరించి వస్తారు. కనీసం ఒకవారం రోజులముందైనా మాకు నాటకం వివరాలు, నృత్యం విషయాలు తెలియజేసి ఆర్డర్ చేస్తే వారు చెప్పిన సమయానికి మేం రెడీ చేసేస్తాం. నాటకం వివరాల్ని బట్టి ఆహార్యాలు రెడీ చేస్తాం. అలాగే నృత్యాల్లో కూడా కూచిపూడి మొదలు...కథాకళి వరకూ దాదాపు ఎనిమిది నృత్యాలకు మా దగ్గర వేషధారణలు రెడీ ఉంటాయి’’ అని ముగించారు శ్రీనివాసాచార్యులు. విదేశాలకు కూడా... ఆదర్శ డ్రెస్ పాలెస్ పేరుతో ఉన్న వెబ్సైట్లో ఎక్కడినుంచైనా కళాకారులు వస్త్రాలను ఆర్డరు చేసుకోవచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా, స్వీడన్ వంటి దేశాలకు కొరియర్లో డ్రెస్‌లు పంపుతున్నారు. పాలెస్‌లోకి అడుగుపెడితే... కళామతల్లి కాలి అందియల చప్పుడు కమ్మగా వినబడుతుంది. - భువనేశ్వరి, ఫొటోలు: ఎ. సతీష్ -
దక్షిణమధ్య రైల్వే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బెర్తులు
సాక్షి,సిటీబ్యూరో: సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం సాగుతుండడం, ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో నగరం నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వారు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో నగరం నుంచి బయల్దేరే అన్ని రైళ్లు విపరీతమైన రద్దీతో వెళ్తున్నాయి. ఫలితంగా బెర్తుల కోసం నిరీక్షణ జాబితా (వెయిటింగ్‌లిస్టు) భారీగా పెరిగింది. ఈనేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బెర్తులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. వెయిటింగ్ జాబితా బాగా పెరిగిన దృష్ట్యా మొత్తం 17వేలకు పైగా అదనపుబెర్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ద.మ.రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు రాజధాని నుంచి తిరుపతికి వెళ్లే దాదాపు అన్ని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నారు. తిరుపతి వైపు రాకపోకలు సాగించే రైళ్లు... సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈనెల 31, సెప్టెంబర్ 1,2,5,6,7,8,9,తేదీల్లో, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వచ్చేప్పుడు సెప్టెంబర్ 1,2,3,6,7,8,9,10 తేదీల్లో రెండు స్లీపర్‌క్లాస్ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ (12731/12732)లో సెప్టెంబర్ 3,4 తేదీల్లో,తిరిగి తిరుపతి నుంచి 4,5 తేదీల్లో రెండు స్లీపర్‌క్లాస్ బోగీలు అదనం. హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు ఒక స్లీపర్‌క్లాస్ అదనం. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే సెవెన్‌హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 3,7 తేదీల్లో, తిరుపతి నుంచి సెప్టెంబర్ 6,8 తేదీల్లో ఒక అదనపు స్లీపర్‌క్లాస్ అదనం. తిరుపతి-కరీంనగర్-తిరుపతి (12761/12762) వీక్లీఎక్స్ప్రెస్లో తిరుపతి నుంచి సెప్టెంబర్ 4న, కరీంనగర్ నుంచి 5న ఒక స్లీపర్‌క్లాస్ అదనంగా ఏర్పాటు చేశారు. తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు రెండు వైపులా ఒక అదనపు స్లీపర్‌క్లాస్ బోగి ఉంటుంది. ఇతర మార్గాల్లో.... కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ (17603/17604) ఎక్స్‌ప్రెస్‌లో కాచిగూడ నుంచి వెళ్లేటప్పుడు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు, యశ్వంత్‌పూర్ నుంచి వచ్చేప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు ఒక స్లీపర్‌క్లాస్ బోగీ అదనం. తిరుపతి-మచిలీపట్నం-తిరుపతి (17401/17402) ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు, మచిలీపట్నం నుంచి సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు ఒక స్లీపర్‌క్లాస్ అదనం. కాకినాడ-బెంగళూరు మధ్య నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ నుంచి వెళ్లేటప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు, తిరిగి వచ్చేప్పుడు సెప్టెంబర్ 2 నుంచి 11 వరకు ఒక ఏసీత్రీటైర్, ఒక స్లీపర్ క్లాస్ అదనం. హైదరాబాద్-త్రివేండ్రం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు, తిరుగు ప్రయాణంలో 3 నుంచి 12 వరకు ఒక ఒక ఫస్ట్ ఏసీ బోగీ అదనం. కాచిగూడ-చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు రెండు వైపులా ఒక సెకెండ్ ఏసీ అదనంగా ఏర్పాటు చేశారు. నాందేడ్-ముంబయి మధ్య నడిచే తపొవన్ ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 11 వరకు రెండు వైపులా ఒక ఏసీ చైర్‌కార్ అదనం. ధర్మాబాద్-మన్మాడ్ మధ్య నడిచే మరఠ్వాడా ఎక్స్‌ప్రెస్‌లో సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రెండు వైపులా ఒక ఏసీ చైర్‌కార్ అదనం. సికింద్రాబాద్ -రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 2, 3,9,14 తేదీల్లో ,రాజ్‌కోట్ నుంచి సెప్టెంబర్ 4,5,11.16 తేదీల్లో ఒక థర్డ్ ఏసీ అదనంగా ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్-సాయినగర్ మధ్య నడిచే షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 6,13 తేదీల్లో, సాయినగర్ నుంచి సెప్టెంబర్ 7, 14 తేదీల్లో ఒక థర్డ్ ఏసీ అదనం.