కనుల పండువగా కల్యాణం
- కాచిగూడలో వేడుక
- భారీగా తరలివచ్చిన భక్తజనం
కాచిగూడ: పద్మావతి అలివేలు మంగ సహిత వేంకటేశ్వర కల్యాణమహోత్సం అంగరంగ వైభ వంగా జరిగింది. ఆదివారం రాత్రి కాచిగూడ స్టేషన్ రోడ్డులోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం హాలు ప్రాంగణంలో తిరుపతి తిరుమల దేవస్థానం వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ కనులపండువగా నిర్వహించారు. టీటీడీ సంచార కల్యాణ మూర్తులను స్వాగతించి లోక కల్యాణార్థం ఈ మహోత్సవాన్ని చేపట్టారు.
టీటీడీ ప్రధాన అర్చకులు గురురాజారావు, సుందరవదనాచార్, కాది పత్రి స్వామిల నేతృత్వంలో కల్యాణం జరి గింది. సమాజ శ్రేయస్సు కోసమే శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నామని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు, కల్యాణ ప్రాజెక్టు ఆఫీసర్ రాంచంద్రారెడ్డిలు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ మ్యాడం జనార్దన్‌రావు, ట్రస్టీలు మ్యాడం వెంకట్‌రావు, గంప చంద్రమోహన్, పుంజరి బద్రినారాయణ.
జెల్లి సిద్ధయ్య, ఆకుల పాండురంగారావు, పన్నాల విష్ణువర్ధన్, మున్నూరుకాపు మహాసభ ప్రతినిధులు పిల్లి శ్రీనివాస్, చామకూర ప్రదీప్, కొండూరు వినోద్‌కుమార్ శ్రీ రాజరాజేశ్వరి మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్రం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండ దేవయ్య తదితరులు హాజరయ్యారు. శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం నాలుగు గంటలపాటు జరిగింది. విశ్వక్సేన, ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, స్వస్తీవచనంతో కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. తిరుమలలోని అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి వచ్చిన ప్రత్యేకబృందం కళాకారులు ఈ సందర్భంగా స్వామివారి కీర్తనలు ఆలపించారు.