
సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్‌టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ నగరంలో వెంకటేశ్వర స్వామి మహోత్సవాలను నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్‌టీఆర్ స్టేడియంలో ప్రతి రోజు పది వేల మంది దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవోత్సవాలను ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథం నగరానికి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడే లడ్డూలు తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
గోపూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఎన్‌టిఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎన్‌టిఆర్ స్టేడియం ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోలేని వారికోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నగరానికి తరలిరావడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు ముప్పవరపు హర్షవర్ధన్, బి.సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలివీ..
ఎన్‌టీఆర్ స్టేడియంలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే రోజు వారి పూజా కార్యక్రమాలు 11న ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కొలుపు, అర్చన, 7.30 నుంచి 8.15 వరకు నివేదన, 8.15 నుంచి 8.30 వరకు పాద పద్మారాదన, ఉదయం 8.30 నుంచి 9.30 వరకు రెండో నివేదన, 9.30 నుంచి 10 గంటల వరకు వసంతోత్సవం, వీధి ఉత్సవం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 5.30 గంటల నుచి 6.30 వరకు, వీధి ఉత్సవం సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు, రాత్రి కైంకర్యం రాత్రి 7.30 నుంచి 8.30 వరకు, ఏకాంత సేవ రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి.
15న...
15వ తేదీన ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కోలుపు, అర్చన 7.30 నుంచి 8.15, నివేదన 8.15 నుంచి 8.30 వరకు, పాదపద్మారాధన, ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, పుష్పయాగం, రెండవ నివేదన 10.30 నుంచి 11 గంటల వరకు, సర్వదర్శనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, సహస్రదీపాలంకరణ సేవ, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం 6.30నుంచి 8.30 వరకు తోమాల సేవ అర్చన, నివేధన రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment