తిరుమల: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 5 వరకు ఈ సదస్సు జరుగనుంది. తొలి రోజు సదస్సులో 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయగా..ఈవో ఏవీ ధర్మారెడ్డి కార్యక్రమ సందర్భ పరిచయం చేశారు.
టీటీడీ ధార్మిక కార్యక్రమాలపై ఎస్వీబీసీ రూపొందించిన 40 నిమిషాల ఆడియో విజువల్‌ను ప్రదర్శించారు. తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి, విద్యాశ్రీషతీర్థ (బెంగళూరు), సిద్ధేశ్వరానంద భారతి (కుర్తాళం), మాతృశ్రీ రమ్యానంద (తిరుపతి), సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి (విజయవాడ), రామచంద్ర రామానుజ జీయర్ స్వామి (భీమవరం), స్వస్వరూపానందగిరి స్వామి (శ్రీనివాసమంగాపురం), పరిపూర్ణానందగిరి స్వామి(ఏర్పేడు), విద్యాప్రసన్న తీర్థ (కర్ణాటక), విరజానంద స్వామి (కడప), విశ్వయోగి విశ్వంజి (గుంటూరు), సచ్చిదానంద సరస్వతి (తుని), హరితీర్థ స్వామీజీ (నెల్లూరు), ప్రకాశానంద సరస్వతి (విజయవాడ), మాతా శివానంద సరస్వతి, మాతా సుశ్రుశానంద (తేనెపల్లి), శివ దర్శనం మాతాజీ (ప్రొద్దుటూరు), స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి (ఉత్తరకాశీ), సత్యానంద భారతి (విజయవాడ), శ్రీ శివ స్వామి (గుంటూరు), దేవనాథ రామానుజ జీయర్ స్వామి (హైదరాబాద్), విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అనుగ్రహణ భాషణం చేశారు.
మరింత గొప్పగా ధర్మ ప్రచారం: భూమన
మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు భూమన తెలిపారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తామన్నారు.
స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని చెప్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తోన్న టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందన్నారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment