తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి అంకురార్పణ జరగనుంది. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుడు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. ఇందులో భాగంగా నేటి సాయంకాల వేళలో విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమి పూజ’(మత్సంగ్రహణం)తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు.
యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో(మూకుళ్లు)–శాలి, వ్రహి,యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలతో అంకురార్పణం (బీజావాపం) చేస్తారు.సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు.
రాత్రి తొమ్మిది నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగుతుంది. ఇందులో భాగంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి సర్వం సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం మూడు వేల మంది, గరుడసేవ కోసం మరో 700 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమల సీవీఎస్‌వో నరసింహ కిషోర్, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 18 నుంచి 26వ
తేదీ వరకు జరుగనున్నాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి శనివారం డీఎఫ్‌వో శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగ నాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 18వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో దర్భ చాప, 200 అడుగుల పొడవుతో తాడు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment