బ్రహ్మోత్సవ నవ గోవింద..! | Srivari Salakatla Brahmotsavam Starts From September 18th To 26th, Check Timings And Other Details - Sakshi
Sakshi News home page

Srivari Salakatla Brahmotsavam 2023: బ్రహ్మోత్సవ నవ గోవింద..!

Published Sat, Sep 16 2023 4:39 AM | Last Updated on Sat, Sep 16 2023 8:41 AM

Srivari Salakatla Brahmotsavam from 18th to 26th September - Sakshi

తిరుమల: తిరుమలలో సెప్టెంబర్‌ 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను టీటీడీ శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాడ వీధుల్లో రంగవల్లులను టీటీడీ తీర్చిదిద్దింది. గ్యాలరీల్లో ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచింది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో బ్రేక్‌ దర్శనాలకు, సిఫారసు లేఖలను అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలైజ్డ్‌ దర్శనాలనూ రద్దు చేసింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8–10 గంటల వరకు, రాత్రి 7–9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనుంది. సెప్టెంబర్‌ 22న గరుడ సేవ కారణంగా ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ రద్దు చేసింది.

17న అంకురార్పణ..18న ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాలకు సెప్టెంబర్‌ 17న రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వైఖానస ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అంకురార్పణం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవారి తరఫున సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనుల వారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటి వాటికి మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు.

ఆ తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. 18న సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు 
ప్రారంభమవుతాయి.  

వాహన సేవల వివరాలివీ..
18న రాత్రి 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు 7 తలల స్వర్ణ శేషవాహనంపై (పెద్ద శేషవాహనం) మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. 19న ఉదయం 8 గంటలకు 5 తలల చిన్నశేష వాహనంపై, రాత్రి 7 గంటలకు శ్రీమలయప్పస్వామి వారు వీణాపాణియై హంస వాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమివ్వనున్నారు. 20న ఉదయం 8 గంటలకు  సింహ వాహనంపై, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతారు.

21న ఉదయం 8 గంటలకు శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. 22న ఉదయం 8 గంటలకు శ్రీవారు మోహినీరూపంలో శృంగారరసాధి దేవతగా దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంలో ఊరేగుతారు. 23న ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగుతారు. సాయంత్రం 4 గంటలకు శ్రీనివాసుడు స్వర్ణరథంపై, రాత్రి 7 గంటలకు గజవాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు.

24న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 25న ఉదయం 6:55 గంటలకు శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వ వాహనంపై విహరిస్తారు. 26న ఉదయం 6 గంటలకు చక్రస్నానాన్ని, రాత్రి 7గంటలకు బంగారు తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం  ధ్వజావరోహణాన్ని శాస్త్రోక్తంగా చేపడతారు. దీంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement