సాక్షి, తిరుమల: రామతీర్థంలో ప్రతిష్టించే విగ్రహాలు తిరుపతి నుంచి శుక్రవారం రోజు రామతీర్థానికి తరలించామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆలయాన్ని పునఃనిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రిని అధికారులు పట్టువస్త్రంతో సత్కరించారు. మంత్రి దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనతంరం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ... నూతన విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ట చేసి, రామ తీర్థం ఆలయ నిర్మాణం చేపడతామని తెలిపారు. పూర్వవైభవం వచ్చేలా ఆలయ నిర్మాణం సంవత్సరాల కాలంలో పూర్తి చేసి, విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా మంత్రి వెల్లంపిల్లి కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారిని మర్యాదపూర్వకంగా కలిశారు. బెజవాడ దుర్గమ్మ ప్రతిమ, ప్రసాదాన్ని స్వామివారికి అందజేసి, మంత్రి వెల్లంపల్లి ఆశీర్వాదాలను తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment