ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల: శ్రీవాణి ట్రస్టు పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ బ్యాంకుల్లోని డిపాజిట్లను వెనక్కు తీసుకుని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. శ్రీవారి నిత్య అన్న ప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేరుస్తామని చెప్పారు.
తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా భవనం లీజు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్యూలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి 2, 3 గంటల్లోనే దర్శనమయ్యేలా నిపుణుల కమిటీని నియమించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయిస్తామన్నారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు, నాలుగు నెలల్లో తొలగిస్తామని చెప్పారు.
తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చామన్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడినా, ప్రచారం చేసినా కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు.
టూరిజం కార్పొరేషన్లు, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 ) టికెట్లలో అవకతవకలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సదరు సంస్థల ద్వారా కోటాను పూర్తిగా రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు అందించే బహుమానాన్ని 10 శాతం పెంచుతున్నట్లు చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 చొప్పున బ్రహ్మోత్సవ బహుమానం అందిస్తామన్నారు.
శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ, అన్న ప్రసాద కేంద్రం ఆధునికీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నామని, వారు ఉచితంగానే చేస్తారని చెప్పారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కాగా శ్రీవాణి ట్రస్టు పేరును మార్చి ప్రధాన ఖాతాను మార్చడం వల్ల 80 సీ నిబంధన వర్తించక టీటీడీకి ట్యాక్స్ భారం పడే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment