
జర్మనీలోని మ్యూనిచ్ నగరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మ్యూనిచ్ నగరానికి చెందిన స్థానిక శివాలయం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలు నవంబర్ 3న ఉదయం 7 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై మధ్యాహ్నం కల్యాణోత్సవం వరకు నిర్వహించారు.
అర్చన, తోమాల సేవ అనంతరం అర్చకులు కన్నుల పండుగగా జరిపించిన కల్యాణోత్సవంలో మ్యూనిచ్ నగర పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జర్మనీ, ఆస్ట్రియాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఈ కార్యక్రమానికి టీటీడీ తరఫున ఎస్‌వీబీసీ ఛానల్ డైరెక్టర్, ప్రఖ్యాత సినీ దర్శకులు శ్రీ శ్రీనివాస రెడ్డి, ఏపీఎన్‌ఆర్‌టీఎస్ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, టీటీడీ ఏఈఓ వెంకట్‌లు అతిధులుగా హాజరై ఈ కార్యక్రమాన్ని కన్నుల పండువగా జరిపించారు.
అలాగే ఈ కార్యక్రమాన్ని శివాలయం తరపున జరిపించేందుకు హైదరాబాద్ నుంచి సత్యనారాయణ మూర్తి, ముక్తేశ్వరం నుంచి కామేశ్వర శాస్త్రిలు తరలి వచ్చారు. మ్యూనిచ్ శివాలయం కార్య నిర్వాహక కమిటీ సోమయాజులు శర్మ , ధృవ్ కాశ్వాల,ఆదూరి రాజశేఖర్, అనిల్ గారు, పవన్, రవి కుమార్ వర్మ, సుజాత, సాయి తేజస్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment