కాలి అందియలు ఘల్లు ఘల్లుమన... | Palace is the adhrsh dress shop in kaciguda | Sakshi
Sakshi News home page

కాలి అందియలు ఘల్లు ఘల్లుమన...

Published Mon, Nov 4 2013 12:06 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

కాలి అందియలు ఘల్లు ఘల్లుమన... - Sakshi

కాలి అందియలు ఘల్లు ఘల్లుమన...

అరవైఏళ్లకిత్రం జరిగిన సంఘటన కారణంగా హైదరాబాద్, కాచిగూడలో వెలసిన షాపు ఆదర్శ డ్రెస్ పాలెస్.  ఏమిటా సంఘటన అంటారా? తిరుమల శేషాచార్యులు అని తెలంగాణ పద్యనాటక పితామహుడు. ఆయనకి నాటకాలంటే ప్రాణం. నిజాం గవర్నమెంటు తెలుగువారి కళలు స్టేజ్ ఎక్కడానికి వీల్లేదంటూ నిబంధనలు పెట్టింది. అయినా వారి కన్నుగప్పి శేషాచార్యులు నాటకాలు వేస్తుండేవారు. ఉద్యోగరీత్యా లెక్చరర్ అయిన శేషాచార్యులు ఒకసారి వికారాబాద్‌లో ఒక నాటకం వేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అప్పట్లో హైదరాబాద్‌లోని కళాకారులకు డ్రెస్‌లు గుంటూరు నుంచి వచ్చేవి.

వికారాబాద్‌లో నాటక సమయానికి వర్షాల కారణంగా డ్రస్‌లు అందలేదు. దాంతో నాటకం ఆగిపోయింది. అప్పుడు శేషాచార్యులు ఒక నిర్ణయం తీసుకున్నారు. తాను వేసే నాటకాల కోసం ప్రత్యేకంగా బట్టలు కుట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ విషయం తెలిసిన తోటి కళాకారులు శేషాచార్యులుగారి బట్టల్ని అద్దెకు తీసుకెళ్లడం మొదలెట్టారు. నాటకాలొక్కటే కాదు, నాట్య కళాకారులకు కూడా వేషాధారణ వస్త్రాలు ఎక్కడి నుంచో రావడం చూసి శేషాచార్యులు తానే స్వయంగా ఒక షాపు పెట్టి కళాకారులకు డ్రెస్‌లు అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా 1954లో ఆదర్శ డ్రెస్ పాలెస్ వెలసింది.
 
 కళపై అభిమానం...
 
 ‘‘మా నాన్నకు నాటకాలంటే ప్రాణం. శ్రీకృష్ణ రాయబారం, శ్రీకృష్ణ తులాభారం నాటకాలకు ఆయన చాలా ఫేమస్. కళాకారులకు అన్నీ అందుబాటులో ఉంటే కళలు మరింత అభివృద్ధి చెందుతాయనేవారు. చివరి నిమిషం వరకూ అదే మాటను కలవరించారు. నాన్నగారి తర్వాత అన్నయ్య పార్థసారథి షాపు బాధ్యతలు తీసుకున్నారు. నేను ఎంబీఏ పూర్తిచేసి దుబాయ్‌లో సేల్స్ మేనేజర్ ఉద్యోగం చేస్తుండగా నాన్నగారు చనిపోయారు. దాంతో వెంటనే ఇండియా వచ్చేశాను.

అన్నయ్యకు కూడా పెద్దవయసు అవడంతో షాపు బాధ్యతలు నేను తీసుకున్నాను. నాకు కూడా నాటకరంగం, నృత్యప్రదర్శనలంటే చాలా యిష్టం. దుబాయ్‌లో ఉన్నప్పుడు అక్కడ రసమయి తెలుగు అసోసియేషన్‌కి కల్చరర్ సెక్రటరీగా పనిచేశాను. ఆదర్శ డ్రెస్ పాలెస్‌ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నది నాకోరిక. దానికి తగ్గట్టుగానే సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాను’’ అని చెప్పారు తిరుమల శ్రీనివాసాచార్యులు.
 
అక్కడే తయారి....
 
ఆ షాపులో జడ మొదలు గజ్జెల వరకూ ఒక పక్క తయారుచేస్తుంటే మరోపక్క ప్యాక్ చేస్తుంటారు. దుస్తుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...కుడుతూనే ఉంటారు.‘‘భారతం, రామాయణం పాత్రలన్నింటికీ మా దగ్గర ఆహార్యం ఉంది. అలాగే ఇండియన్ క్లాసికల్ డాన్సులన్నింటికీ వేషాధారణలు ఉన్నాయి. ఒక్క వస్త్రాలు, ఆభరణాలే కాదు...మేకప్ కూడా మావాళ్లే చేస్తారు. కొందరు కళాకారులు ఇక్కడికే వచ్చి తయారయి వెళుతుంటారు.

పెద్ద పెద్ద స్టేజిషోలకయితే మా స్టాఫ్ వెళ్లి అలంకరించి వస్తారు. కనీసం ఒకవారం రోజులముందైనా మాకు నాటకం వివరాలు, నృత్యం విషయాలు తెలియజేసి ఆర్డర్ చేస్తే వారు చెప్పిన సమయానికి మేం రెడీ చేసేస్తాం. నాటకం వివరాల్ని బట్టి ఆహార్యాలు రెడీ చేస్తాం. అలాగే నృత్యాల్లో కూడా కూచిపూడి మొదలు...కథాకళి వరకూ దాదాపు ఎనిమిది నృత్యాలకు మా దగ్గర వేషధారణలు రెడీ ఉంటాయి’’ అని ముగించారు శ్రీనివాసాచార్యులు.
 
 విదేశాలకు కూడా...


 ఆదర్శ డ్రెస్ పాలెస్ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో ఎక్కడినుంచైనా కళాకారులు వస్త్రాలను ఆర్డరు చేసుకోవచ్చు. అమెరికా, ఆస్ట్రేలియా, స్వీడన్ వంటి దేశాలకు కొరియర్‌లో డ్రెస్‌లు పంపుతున్నారు. పాలెస్‌లోకి అడుగుపెడితే... కళామతల్లి కాలి అందియల చప్పుడు కమ్మగా వినబడుతుంది.
 
 - భువనేశ్వరి,  ఫొటోలు: ఎ. సతీష్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement