డబుల్ డెక్కర్ రైలు...వచ్చేస్తోంది!
- ప్రస్తుతం కాచిగూడ-గుంటూరు మధ్య నడుస్తున్న రైలు
- విజయవాడ వరకు పొడిగించాలని నిర్ణయం
జిల్లా వాసులకు డబుల్ డెక్కర్ రైలు కల సాకారం కానుంది. ప్రస్తుతం కాచిగూడ-గుంటూరు మధ్య నడుస్తున్న ఈ రైలును విజయవాడ వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో త్వరలో డబుల్ డెక్కర్ ప్రయాణం అవకాశం జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానుంది.
సాక్షి, విజయవాడ : రెండంతస్తుల రైలు విజయవాడ రానుంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి గుంటూరు మధ్య వారానికి రెండు రోజులు నడుస్తున్న ఈ రైలును విజయవాడ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ రైలు కాచిగూడ -గుంటూరు, కాచిగూడ-తిరుపతి మధ్య వారానికి రెండు రోజులు నడుస్తున్న సంగతి తెలిసిందే.
మొదట ఈ రైలును విజయవాడ - హైదరాబాద్ మధ్య తిప్పాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ కారణాల వల్ల అది రూట్ మారింది. విజయవాడ నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని పొడిగించాలని తాజాగా నిర్ణయించారు. ఎప్పటి నుంచి ఈ పొడిగింపు అమలులోకి వస్తుందన్న విషయంపై అధికారులకు స్పష్టమైన సమాచారం రాలేదు. గురువారం జిల్లా పర్యటనకు వస్తున్న రైల్వే జీఎం శ్రీవాస్తవ దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఈ రైలు మంగళవారం, శుక్రవారం ఉదయం కాచిగూడలో 5.30 గంటలకు బయలుదేరి ఉదయం 10.40కి గుంటూరు చేరుకుంటుంది. మళ్లీ 12.45కు గుంటూరులో బయలుదేరి 5.55 గంటలకు కాచిగూడ చేరుతుంది. దీన్ని విజయవాడకు పొడిగిస్తే తిరుగు ప్రయాణ వేళల్లో కొద్దిగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. పూర్తిగా ఎయిర్‌కండీషన్డ్ రైలులో ప్రయాణించే అనుభూతి త్వరలోనే విజయవాడ వాసులకు సొంతం కానుంది.