పాకిస్థాన్‌లో బుల్లెట్ ట్రైన్స్..?
పాకిస్థాన్‌లో బుల్లెట్ ట్రైన్స్..?
Published Wed, Nov 30 2016 4:17 PM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM
ఇస్లామాబాద్: దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసుల ఏర్పాటుపై పాకిస్థాన్ ప్రభుత్వం ఊహించని నిర్ణయాన్ని వెలుబుచ్చింది. ఎన్నికల ప్రచారంలో ‘బుల్లెట్ ట్రైన్ల’పై భారీ హామీలు గుప్పించిన నవాజ్ షరీప్ పార్టీ.. ఇప్పుడు ‘ఆ మాట ఎత్తితేనే ప్రపంచం నవ్వుతోంది’ అంటూ తలదించుకుంది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో బుల్లెట్ రైళ్లపై జరిగిన చర్చకు రైల్వే శాఖ మంత్రి ఖవాజా సాద్ రఫీఖ్ బుధవారం ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
‘దేశంలో అవసరమైన చోటల్లా బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది నిజమే. ప్రస్తుతం చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) నిర్మాణంలో ఉందికదా, అందులో భాగంగా చైనా మన దేశంలో 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైల్వే ట్రాక్‌లను ఏర్పాటుచేస్తోంది. ‘అదే క్రమంలో బుల్లెట్ రైళ్లు కూడా ప్రారంభిస్తే బాగుంటుంది కదా’ అని మనవాళ్లు చైనీస్‌ను కోరారు. అందుకు ప్రతిగా వారు పగలబడి నవ్వి..‘పాకిస్థాన్‌లో బుల్లెట్ ట్రైనా..’అని అవమానించినత పని చేశారు’ అని రైల్వేమం త్రి రఫీఖ్ సభకు తెలిపారు.
‘వాస్తవ పరిస్థితి ఏంటంటే.. పాకిస్థాన్‌కు బుల్లెట్ ట్రైన్లను భరించే స్తోమత లేదు. ట్రాక్స్ నిర్మించడానికి సరిపడా డబ్బు కూడా లేవు. ఒకవేళ చచ్చీచెడీ నిర్మించినా అందులో ఆ రైళ్లు ఎక్కేదెవరు? మన దేశంలో అత్యథికులు పేదలు, నిరుపేదలే. ఎగువ మధ్యతరగతి ప్రజలు చాలా తక్కువ. అందుకే పాకిస్థాన్‌లో బుల్లెట్ ట్రైన్స్ నిర్మాణం ఆలోచనను ఉపసంహరించుకుంటున్నాం. సమీప భవిష్యత్తులోనూ ఆ ప్రాజెక్టు జోలికి పోబోము’అని మంత్రి ముక్తాయింపునిచ్చారు. వాణిజ్య, రక్షణ అవసరాల నిమిత్తం పాక్, చైనాలు ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇరుదేశాలను కలుపుతూ భారీ హైవేలు, హైస్పీడ్ రైల్వే ట్రాక్స్, పోర్టుల అభివృద్ధి తదితర పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
Advertisement
Advertisement