న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పాక్‌లోని బలూచిస్తాన్ తీరంలో గల గ్వడార్ పోర్టు వద్ద ఇప్పటికే పలు నిర్మాణాలు చేపట్టిన చైనా- పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపెక్) అథారిటీ మరో కీలక నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. గ్వడార్ పట్టణం చుట్టూ కంచెను ఏర్పాటు చేసినట్లు సమాచారం. సుమారు 10 అడుగుల ఎత్తు, 30 కిలోమీటర్ల పరిధి మేర ఓ గోడను నిర్మించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనం వెలువరించింది. ఈ విషయం గురించి మానవహక్కుల కార్యకర్తలు మాట్లాడుతూ.. రహస్యంగా గోడను నిర్మించడం వంటి ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా స్థానికులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని ఆరోపిస్తున్నారు.
అదే విధంగా పోర్టు సిటీలో పాక్ ఆర్మీ దురాగతాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు బయటపెట్టకుండా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, మీడియాను నిషేధించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అంతేగాకుండా.. గడ్వార్‌ను పూర్తిస్థాయిలో తమ నిఘా, నియంత్రణలోకి తెచ్చుకునే విధంగా సుమారు 500 హెచ్‌డీ కెమెరాలు బిగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ పౌరులు, సామాజిక కార్యకర్తలు సహా ప్రతి ఒక్కరి కదలికలను కనిపెడుతూ నిరసన గళాలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. (చదవండి: నాలుగు యుద్ధాల్లో మట్టికరిచినా బుద్ధి రాలేదు)
కాగా గ్వడార్‌లో ఇప్పటికే సుమారు 15 వేల మంది (పాకిస్తాన్ 9 వేలు, డ్రాగన్ ఆర్మీ 6 వేలు) సైనికులను అక్కడ మోహరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భద్రతా నిపుణులు మాట్లాడుతూ.. ఆర్థిక కారిడార్ అని పైకి చెబుతున్నా మిలిటరీ బేస్ కోసమే గ్వడార్‌లో చైనా ఆర్మీ పలు నిర్మాణాలు చేపడుతోందని పేర్కొంటున్నారు. పోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లను ప్రయోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. బెలూచిస్తాన్ నుంచి బెలూచీలను ఖాళీ చేయించి పంజాబీలు, ఫంక్తూన్లతో తమ ప్రాంతాన్ని నింపేందుకు చేస్తున్న కుట్రలో ఇదొక భాగమని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు బదులుగా.. 2018లో కరాచిలోని చైనీస్ కాన్సులేట్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే.
సీపెక్..
భారత్ అభ్యంతరాలను పక్కనపెట్టిన డ్రాగన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) మీదుగా చైనా -పాక్ మధ్య వ్యూహాత్మక ఆర్థిక కారిడార్ (సీపెక్)ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రోడ్లు, నౌకాశ్రయాల వ్యవస్థ ద్వారా యూరప్, ఆసియా, ఆఫ్రికాలతో తన అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చైనా చేపట్టిన అత్యంత భారీ సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సీపెక్ నిర్మాణాన్ని తలపెట్టినట్లు తెలిపింది. ఇందులో భాగంగా చైనా పశ్చిమ ప్రాంతం నుంచి పీఓకే మీదుగా అరేబియా సముద్రం తీరంలోని గ్వడార్ పోర్టుకు ఆర్థిక కారిడార్ ఏర్పాటు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment