( ఫైల్ ఫోటో )
అబ్బురపరిచే వేగం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. అద్భుతమైన నిర్మాణాలు.. అత్యుత్తమ సౌకర్యాలు.. అలసట తెలియని ప్రయాణం.. అతితక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేర్చేందుకు గంటకు 350 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకంగా నిర్మించనున్న ట్రాక్‌పై చెన్నై– మైసూరు మధ్య పరుగులు తీయనున్నాయి. జర్మన్ టెక్నాలజీతో దేశంలోనే ఆరో కారిడార్‌గా ఈ మార్గాన్ని అభివృద్ధి పరిచేందుకు సర్వే పనులు సాగుతున్నాయి. ఇందుకోసం వివిధ విభాగాల వారీగా పలు కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. జిల్లా మీదుగా సాగే ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి బెంచిమార్క్‌లు నిర్మాణమవుతున్నాయి.
పలమనేరు (చిత్తూరు): జపాన్, జర్మనీ దేశాల్లో కనిపించే జెట్ స్పీడ్ బుల్లెట్ రైళ్లను త్వరలోనే జిల్లాలోనూ చూడబోతున్నాం. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకత. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత వేగంగా నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై నుంచి 320 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు ప్రయాణించాలంటే గంటకు 70 కి.మీ సగటున దాదాపు ఐదు గంటల సమయం పట్టేది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ద్వారా అయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలే.
ఇప్పటికే దేశంలో ముంబై–అహ్మదాబాద్, ఢిల్లీ–వారణాసితో పాటు మరో మూడు మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లున్నాయి. ఆరో మార్గంగా చెన్నై–మైసూర్ కారిడార్‌ను జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2018లోనే జర్మన్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది. 2020 జూన్‌లో చెన్నై–మైసూర్ రైల్యే కారిడార్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ప్రాథమిక సర్వేతోపాటు బెంచిమార్క్‌ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
ఇప్పటికే ఖరారైన టెండర్లు
కేంద్ర రైల్యేశాఖ ఎన్‌హెచ్‌ఆర్‌ఆర్‌సీఎల్ (నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్)ద్వారా చెన్నై–మైసూరు బుల్లెట్ ట్రైన్ పనులు చేపడుతోంది. 2019లోనే ఇందుకు సంబందించి డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) సిద్ధం చేసింది. ఈ మార్గానికి సంబంధించిన ఇప్పటికే టెండర్ల పక్రియను సైతం పూర్తి చేసింది. అందులో భాగంగా సర్వే పనులను ఇంజినీరింగ్ మాగ్నిట్యూడ్ కంపెనీ దక్కించుకుంది. ట్రాఫిక్‌కు సంబంధించిన పనులను పీకే ఇంజనీర్స్‌కంపెనీ, జనరల్ అలైన్‌మెంట్ డ్రాయింగ్స్‌ను ట్రాన్స్‌లింక్ కంపెనీ, ఫైనల్ అలైన్‌మెంట్‌ను ఆర్వీ అసోసియేట్స్, ఓవర్‌హెడ్, అండర్‌గ్రౌండ్ పనులను సుబుది టెక్నాలజీస్ కంపెనీ చేపడుతోంది. ఆర్‌ఏపీ ( రీసెటిల్‌మెంట్ యాక్షన్‌ప్లాన్)ని ఓవర్‌సీస్ మిన్–టెక్ కన్సల్టెంట్స్, ఎన్విరాల్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ రిపోర్ట్‌ను మరో కంపెనీ చేపట్టనున్నట్టు ప్రస్తుతం ఇక్కడ పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
స్టాపింగ్ స్టేషన్లు తొమ్మిదే..
చెన్నై నుంచి మైసూరు మార్గంలో కేవలం తొమ్మిది స్టాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో చెన్నై, పూనమలై, అరక్కోణం, కర్ణాటకలో బంగారుపేట, బెంగళూరు, చెన్నపట్న, మండ్య, మైసూరు, జిల్లాలో కేవలం చిత్తూరులో మాత్రమే బుల్లెట్ రైళ్లు ఆగనున్నాయి. కారిడార్‌కు సమీపంలోనే చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌హైవే ఉండేలా మార్గంలో అలైన్‌మెంట్ చేశారు. ఈ ప్రాజెక్టులో అండర్‌గ్రౌండ్ ( సొరంగమార్గం), ఎలివేషన్ వయాడక్ట్, ఓవర్‌హెడ్, ఫ్లైఓవర్ వంతెనలతో ట్రాక్ నిర్మాణం సాగనుంది. బెంగళూరులో రెండు అండర్‌గ్రౌండ్ రైల్యే స్టేషన్లు సైతం నిర్మించేలా ప్రణాళికలో పొందుపరిచారు.
తక్కువ సమయంలోనే గమ్యస్థానం
చెన్నై–మైసూర్ మధ్య 435 కిలోమీటర్ల దూరం ఉంది. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాదాపు ఒకటిన్నర గంటలో చేరుకోవచ్చు. సగటు వేగం గంటకు 320 కిలోమీర్లు అయితే సుమారు రెండు గంటలు పట్టొచ్చు. 9 స్టేషన్లలో ఆపిన సమయాన్ని లెక్కగడితే మరో 45 నిమిషాలు మాత్రమే అదనంగా పరిగణించవచ్చు. ఆ లెక్కన 2.45 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకొనే అవకాశం ఉంటుంది.
జిల్లాలో ప్రారంభమైన సర్వే
కర్ణాటక సరిహద్దుల నుంచి జిల్లాలోని వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల మీదుగా తమిళనాడు సరిహదులోని గుడిపాల మండలం వరకు ట్రాక్ నిర్మాణం కోసం శరవేగంగా సర్వే సాగుతోంది. ముఖ్యంగా పలమనేరు మండలంలోని సాకేవూరు, బేలపల్లె, కొలమాసనపల్లె, కూర్మాయి. పెంగరగుంట, సముద్రపల్లె సమీపంలో బెంచిమార్కులను ఏర్పాటు చేస్తున్నారు.
భూకంపాలను తట్టుకొనే సామర్థ్యం
బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌ను అత్యాధుని పరిజ్ఞానంతో భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టం ఉంటుందని సర్వే చేస్తున్న కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
బుల్లెట్ ట్రైన్, ట్రాక్ ప్రత్యేకతలు
►రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు
►ఆపరేషన్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు
►ట్రాక్‌గేజ్ : స్టాండర్డ్ (1435 mm)
►డీఎస్– ఏటీజీ సిగ్నలింగ్
►ట్రైన్ కెపాసిటీ : 750 మంది ప్రయాణికులు
►చెన్నై–మైసూర్ మధ్య దూరం 435 కిలోమీటర్లు
►రైలు స్టాపింగ్ స్టేషన్లు : 9
Comments
Please login to add a commentAdd a comment