High speed trains
-
త్వరలోనే ఆ జిల్లాలో జెట్ స్పీడ్ బుల్లెట్ రైళ్లు..
అబ్బురపరిచే వేగం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. అద్భుతమైన నిర్మాణాలు.. అత్యుత్తమ సౌకర్యాలు.. అలసట తెలియని ప్రయాణం.. అతితక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేర్చేందుకు గంటకు 350 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకంగా నిర్మించనున్న ట్రాక్‌పై చెన్నై– మైసూరు మధ్య పరుగులు తీయనున్నాయి. జర్మన్ టెక్నాలజీతో దేశంలోనే ఆరో కారిడార్‌గా ఈ మార్గాన్ని అభివృద్ధి పరిచేందుకు సర్వే పనులు సాగుతున్నాయి. ఇందుకోసం వివిధ విభాగాల వారీగా పలు కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. జిల్లా మీదుగా సాగే ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి బెంచిమార్క్లు నిర్మాణమవుతున్నాయి. పలమనేరు (చిత్తూరు): జపాన్, జర్మనీ దేశాల్లో కనిపించే జెట్ స్పీడ్ బుల్లెట్ రైళ్లను త్వరలోనే జిల్లాలోనూ చూడబోతున్నాం. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకత. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత వేగంగా నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై నుంచి 320 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు ప్రయాణించాలంటే గంటకు 70 కి.మీ సగటున దాదాపు ఐదు గంటల సమయం పట్టేది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ద్వారా అయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలే. ఇప్పటికే దేశంలో ముంబై–అహ్మదాబాద్, ఢిల్లీ–వారణాసితో పాటు మరో మూడు మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లున్నాయి. ఆరో మార్గంగా చెన్నై–మైసూర్ కారిడార్‌ను జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2018లోనే జర్మన్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది. 2020 జూన్‌లో చెన్నై–మైసూర్ రైల్యే కారిడార్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ప్రాథమిక సర్వేతోపాటు బెంచిమార్క్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఖరారైన టెండర్లు కేంద్ర రైల్యేశాఖ ఎన్హెచ్ఆర్ఆర్సీఎల్ (నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్)ద్వారా చెన్నై–మైసూరు బుల్లెట్ ట్రైన్ పనులు చేపడుతోంది. 2019లోనే ఇందుకు సంబందించి డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) సిద్ధం చేసింది. ఈ మార్గానికి సంబంధించిన ఇప్పటికే టెండర్ల పక్రియను సైతం పూర్తి చేసింది. అందులో భాగంగా సర్వే పనులను ఇంజినీరింగ్ మాగ్నిట్యూడ్ కంపెనీ దక్కించుకుంది. ట్రాఫిక్‌కు సంబంధించిన పనులను పీకే ఇంజనీర్స్కంపెనీ, జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్‌ను ట్రాన్స్‌లింక్ కంపెనీ, ఫైనల్ అలైన్‌మెంట్‌ను ఆర్వీ అసోసియేట్స్, ఓవర్‌హెడ్, అండర్‌గ్రౌండ్ పనులను సుబుది టెక్నాలజీస్ కంపెనీ చేపడుతోంది. ఆర్ఏపీ ( రీసెటిల్మెంట్ యాక్షన్‌ప్లాన్)ని ఓవర్సీస్ మిన్–టెక్ కన్సల్టెంట్స్, ఎన్విరాల్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్‌ను మరో కంపెనీ చేపట్టనున్నట్టు ప్రస్తుతం ఇక్కడ పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. స్టాపింగ్ స్టేషన్లు తొమ్మిదే.. చెన్నై నుంచి మైసూరు మార్గంలో కేవలం తొమ్మిది స్టాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో చెన్నై, పూనమలై, అరక్కోణం, కర్ణాటకలో బంగారుపేట, బెంగళూరు, చెన్నపట్న, మండ్య, మైసూరు, జిల్లాలో కేవలం చిత్తూరులో మాత్రమే బుల్లెట్ రైళ్లు ఆగనున్నాయి. కారిడార్‌కు సమీపంలోనే చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌హైవే ఉండేలా మార్గంలో అలైన్మెంట్ చేశారు. ఈ ప్రాజెక్టులో అండర్‌గ్రౌండ్ ( సొరంగమార్గం), ఎలివేషన్ వయాడక్ట్, ఓవర్‌హెడ్, ఫ్లైఓవర్ వంతెనలతో ట్రాక్ నిర్మాణం సాగనుంది. బెంగళూరులో రెండు అండర్‌గ్రౌండ్ రైల్యే స్టేషన్లు సైతం నిర్మించేలా ప్రణాళికలో పొందుపరిచారు. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చెన్నై–మైసూర్ మధ్య 435 కిలోమీటర్ల దూరం ఉంది. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాదాపు ఒకటిన్నర గంటలో చేరుకోవచ్చు. సగటు వేగం గంటకు 320 కిలోమీర్లు అయితే సుమారు రెండు గంటలు పట్టొచ్చు. 9 స్టేషన్లలో ఆపిన సమయాన్ని లెక్కగడితే మరో 45 నిమిషాలు మాత్రమే అదనంగా పరిగణించవచ్చు. ఆ లెక్కన 2.45 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకొనే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రారంభమైన సర్వే కర్ణాటక సరిహద్దుల నుంచి జిల్లాలోని వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల మీదుగా తమిళనాడు సరిహదులోని గుడిపాల మండలం వరకు ట్రాక్ నిర్మాణం కోసం శరవేగంగా సర్వే సాగుతోంది. ముఖ్యంగా పలమనేరు మండలంలోని సాకేవూరు, బేలపల్లె, కొలమాసనపల్లె, కూర్మాయి. పెంగరగుంట, సముద్రపల్లె సమీపంలో బెంచిమార్కులను ఏర్పాటు చేస్తున్నారు. భూకంపాలను తట్టుకొనే సామర్థ్యం బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌ను అత్యాధుని పరిజ్ఞానంతో భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టం ఉంటుందని సర్వే చేస్తున్న కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బుల్లెట్ ట్రైన్, ట్రాక్ ప్రత్యేకతలు ►రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు ►ఆపరేషన్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు ►ట్రాక్గేజ్ : స్టాండర్డ్ (1435 mm) ►డీఎస్– ఏటీజీ సిగ్నలింగ్ ►ట్రైన్ కెపాసిటీ : 750 మంది ప్రయాణికులు ►చెన్నై–మైసూర్ మధ్య దూరం 435 కిలోమీటర్లు ►రైలు స్టాపింగ్ స్టేషన్లు : 9 -
హైస్పీడ్ రైళ్లలో బంగ్లాకు మిర్చి ఎగుమతి
సాక్షి, అమరావతి/ సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ –19 నేపథ్యంలో గుంటూరు వ్యాపారులు ఎగుమతులకు కొత్త మార్గం ఎంచుకున్నారు. గతంలో మాదిరిగా నౌకలు, లారీలు, గూడ్స్‌ల్లో కాకుండా హైస్పీడ్ పార్శిల్ రైళ్లలో విదేశాలకు వాణిజ్య పంటలు ఎగుమతి చేసి లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ విధానంలో బంగ్లాదేశ్‌కు మిర్చి ఎగుమతి చేస్తుండగా త్వరలో చైనా, వియత్నాం దేశాలకు కూడా ఎగుమతులకు హైస్పీడ్ రైళ్లు వినియోగించాలని యోచిస్తున్నారు. తక్కువ కాలంలో సరుకు ఎగుమతి అవుతుండటంతోపాటు సరిహద్దుల్లో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో వ్యాపారులు ఈ విధానం పట్ల మొగ్గు చూపుతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. హైస్పీడ్ రైళ్లలో మిర్చి ఎగుమతికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందింది. విదేశాలకు ఏటా రూ.3 వేల కోట్ల మిర్చి ► బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మిర్చికి మంచి డిమాండ్ ఉంది. గుంటూరు కేంద్రంగా కొన్ని సంస్థలు ఏటా రూ.3 వేల కోట్ల విలువైన మిర్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ► చైనాకు రూ.1500 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.1000 కోట్లు, వియత్నాంకు రూ.500 కోట్ల విలువైన పంట ఎగుమతి చేస్తున్నాయి. ► బంగ్లాదేశ్‌లో క్వింటా మిర్చికి రూ.13,500 నుంచి రూ.14,500 (తేజరకం) ధర లభిస్తోంది. లాక్డౌన్ ముగిశాక వ్యాపారులు నౌకలు, లారీలు, గూడ్స్‌ల్లో ఎగుమతి చేస్తున్నారు. ► అయితే ఎగుమతికి ఏడెనిమిది రోజుల సమయం పట్టడంతోపాటు దేశ సరిహద్దుల వద్ద లారీల అనుమతికి ఆలస్యమవుతోంది. ఈ లోగా ధరల్లో మార్పులు వస్తుండటంతో వ్యాపారులు, ఎగుమతిదారుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ► గుంటూరు రైల్వే డివిజన్ మిర్చి, అల్లం, ఉల్లి, పసుపు పంటల ఎగుమతికి హైస్పీడ్ పార్శిల్ రైళ్లను ప్రవేశపెడతామని ప్రకటించింది. లారీల కంటే తక్కువ ధర.. ► లారీలకు చెల్లించే సరుకు రవాణా చార్జీల కంటే రైళ్లలో ధరలు తక్కువగా ఉండటంతో వ్యాపారులు హైస్పీడ్ రైళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ► రోడ్డు మార్గం ద్వారా బంగ్లాదేశ్‌కు ఎండు మిర్చి రవాణాకు టన్నుకు రూ.7 వేలు. అదే పార్శిల్ రైళ్ల ద్వారా అయితే రూ.4,608 మాత్రమే. ► ఈ నెల 9 న గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు 16 పార్శిల్ వ్యాన్లతో కూడిన పార్శిల్ ఎక్స్‌ప్రెస్‌లో 384 టన్నుల ఎండు మిర్చి ఎగుమతి చేసిన వ్యాపారులు చార్జీలకింద రైల్వేకి రూ.17.60 లక్షలు చెల్లించారు. ► ఇతర రాష్ట్రాలకు బాయిల్డ్ రైస్ ఎగుమతికి ఎఫ్‌సీఐ అధికారులు తమను కలిసినట్టు గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ మోహన్‌రాజా మీడియాకు తెలిపారు. -
ఇండియాకు హైస్పీడ్ రైళ్లు దండగ
ఇంతకీ ఇండియా ఇపుడు హైస్పీడ్ రైళ్లపై అంత ఖర్చుపెట్టడం దండగని చెప్పింది వేరెవరో కాదు. హెచ్‌టీటీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి బిబోప్ గ్రేష్టా. ఇండోర్‌లోని ఐఐఎంలో ఇటీవల నిర్వహించిన ఐ5 సదస్సుకు ఆయన హాజరైన సందర్భంగా మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మలేసియాలో బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థతో మాట్లాడినపుడు కూడా ఆసియాను పెద్ద మార్కెట్‌గా అభివర్ణించారు. ఆ ఇంటర్వ్యూల వివరాలివీ... * ఆ టెక్నాలజీకి కాలం చెల్లింది * హెచ్‌టీటీ సీఓఓ గ్రేష్టా వ్యాఖ్య భారతదేశం హైస్పీడ్ రైళ్ల దిశగా వెళుతూ భారీగా ఖర్చుచేస్తోంది. మీరు దీన్నొక అవకాశంగా భావిస్తారా? మేం ఇండియా నాయకులతో మాట్లాడతాం. వారు నిజంగా జనం తాలూకు రవాణా కష్టాల్ని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారో, లేరో తెలుసుకుంటాం. ఇండియాలో హైస్పీడ్ రైళ్ల గురించి ఏళ్ల తరబడి చెబుతూనే ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఇదో చెత్త. హైస్పీడ్ రైళ్ల టెక్నాలజీకి కాలం చెల్లింది. తదుపరి తరానికిది పెనుభారంగా మారుతుంది. విదేశాలు చేసిన తప్పుని ఇండియా మళ్లీ చెయ్యటమెందుకు? ఈ టెక్నాలజీకి పెట్టుబడి ఎక్కువ. అది ఏ దశలోనూ తిరిగిరాదు. తప్పులు... అంటే మీ ఉద్దేశమేంటి? నేను ఇండియాకు వచ్చేముందు చైనా రైల్వే అధికారులతో మాట్లాడా. కొన్ని రూట్లలో వ్యవస్థ గరిష్ఠ సామర్థ్యాన్ని చేరుకుందని, దాన్ని మూడు రెట్లు వేగవంతం చేయాల్సిన అవసరముందని వాళ్లు చెప్పారు. ఎందుకంటే గంటకు 600 కిలోమీటర్ల వేగం దాటితే గాలిలో నిరోధం చాలా ఎక్కువుంటుంది. అక్కడ గాలి ద్రవంగా మారుతుంది. దీంతో వేగం పెంచాలంటే విపరీతమైన ఇంధనం కావాలి. చాలా ఖర్చవుతుంది. దీర్ఘకాలంలో అసాధ్యం కూడా. సరే! మరి హైపర్ లూప్‌తో దీన్నెలా మారుస్తారు? హైపర్‌లూప్ టెక్నాలజీలో గాలి ఉండదు. నిరోధం కూడా ఉండదు. దాదాపు ధ్వని వేగంతో ప్రయాణించొచ్చు. హైస్పీడ్ రైలుకు పెడుతున్న ఖర్చులో ఆరోవంతుతో ఈ వ్యవస్థను నిర్మించొచ్చు. ఇంధ నం అతితక్కువ చాలు. సోలార్ ప్యానెళ్లు, గాలి, పునరుత్పాదక ఇంధనాల సాయంతో హెచ్‌టీ నడుస్తుంది. దీనర్థం... చ్టీకి వాడే ఇంధనం కన్నా 30 శాతం అధికంగా దాన్నుంచి ఉత్పత్తి అవుతుంది. అంటే... హెచ్‌టీ ఒకరకంగా ప్రజల్ని రవాణా చేసే ఓ భారీ పవర్‌స్టేషన్. ఇండియాలో ఇదంతా సాధ్యమా? నిజానికి హైపర్‌లూప్ నిర్మాణానికి భూగర్భమే కరెక్టు. ప్రస్తుతం మనకు ఆ టెక్నాలజీ లేదు కనక పైలాన్లపై నిర్మిస్తాం. అంటే ఇపుడున్న పైలాన్లనే వినియోగిస్తాం. సిటీలోకి ప్రవేశించడానికి, బయటకెళ్లటానికి ప్రస్తుత మౌలిక సదుపాయాలనే వినియోగిస్తాం. అవసరమైతే కొత్తవీ నిర్మించొచ్చు. దేశంలో విశ్లేషించి, హైపర్‌లూప్ టెక్నాలజీకి అనువైన రెండు కారిడార్లను గుర్తించాం. మరి స్థానికులు నిరాశ్రయులైతే? ఎందుకంటే ఇండియాలో చాలా ప్రాజెక్టుల జాప్యానికి ప్రధాన కారణమదేగా? పైలాన్లపై నిర్మిస్తే ఈ సమస్య ఉండదు. రోడ్డును స్తంభింపజేయకుండా ప్రతి 60 మీటర్లకూ పైలాన్‌ను నిర్మిస్తాం. ఇవి తీవ్రమైన భూకంపాలను కూడా తట్టుకునేలా ఉంటాయి. హైపర్‌లూప్ ద్వారా ఉత్పత్తయ్యే ఇంధనాన్ని బయటకు సరఫరా చేసేలా పైలాన్లుంటాయి. దీని నిర్మాణంతో భూములకు విలువ వస్తుంది. నిర్వహణకు అత్యంత భారీ వ్యయమయ్యే టెక్నాలజీకి బదులు... ఇండియాలో ఇలాంటి టెక్నాలజీ వాడితే మంచిది. పైగా ఇది పర్యావరణానికి అనుకూలం. మీ టెక్నాలజీని అత్యంత రహస్యంగా ఉంచారని, మీ పరీక్షల ఫలితాలను వెల్లడించటం లేదని ఆరోపణలొస్తున్నాయి... మీరు ఇంటర్నెట్లో చూస్తున్నది మా తుది ప్రాడక్ట్ కాదు. మార్కెట్లో మాకూ ఒక పోటీదారుంది. మా డిజైన్లను బయటపెడితే వారు కాపీ చేసే అవకాశమూ ఉంది. అందుకే... ఎవ్వరూ కాపీ చెయ్యలేని దశలో మా డిజైన్లను విడుదల చేస్తాం. మరి నమూనాలు, పరీక్షల సంగతేంటి? ప్రస్తుతం నమూనాల్ని నిర్మిస్తున్నాం. లాస్ ఏంజిలిస్‌లోని మా ప్రాజెక్టుకు వచ్చే ఏడాది ఫిబ్రరిలో కొన్ని అనుమతులొస్తాయి. 2019లో మా తొలి వాహనం పరుగుతీస్తుంది. మరో రెండు ప్రాజెక్టులపై సంతకాలు చేశాం. ఒకటి స్లొవేకియాలో వస్తుంది. రెండోది దుబాయ్‌లో అని ఇంటర్నెట్ నిండా కనిపిస్తోంది? నేనైతే ఇప్పుడే పేరు చెప్పలేను. అయితే ఆ దేశంలోనే తొలి హైపర్‌లూప్ టెక్నాలజీ వస్తుందని మాత్రం చెప్పగలను. భారత్‌లో భాగస్వామ్యాలేమైనా ఉన్నాయా? ఇండియాలో 14 కంపెనీలతో భాగస్వామ్యం ఉంది. వారు గోప్యంగా పని చేస్తున్నారు. వివరాలు త్వరలో ప్రకటిస్తాం. ఇంజినీరింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లకు ఇండియా కీలకమని మా నమ్మకం. మాతో చేతులు కలపాలన్న కంపెనీలన్నిటికీ పిలుపునిచ్చాం. మా ప్రాజెక్టు కోసం 52 దేశాల్లో 600 కంపెనీలు పనిచేస్తున్నాయి. అవన్నీ కన్సల్టెంట్ల కిందికే వస్తాయి. వాటిని మేం కొనుగోలు చేయం. -
మెట్రోకుపచ్చజెండా
అమరావతికి హైస్పీడ్ రైళ్లు ► శ్రీధరన్ డీపీఆర్‌ను ఆమోదించిన సర్కారు ► త్వరలో డీఎంఆర్సీ ఆధ్వర్యంలో నిర్మాణం ► వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది 40 శాతం ► జపాన్ కంపెనీ నుంచి 60 శాతం రుణం! సాక్షి, విజయవాడ బ్యూరో : ఇక నవ్యాంధ్ర రాజధానిలో హైస్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకోసం రాష్ట్రంలోని మెట్రోప్రాజెక్టుల సలహాదా రు శ్రీధరన్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదించడంతో ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. రూ.5,705 కోట్ల అంచనా వ్యయమున్న ఈ ప్రాజెక్టును శ్రీధరన్ నేతృత్వంలోని డీఎంఆర్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) చేపట్టనుంది. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన 60 శాతం మొత్తాన్ని జపాన్‌కు చెందిన జైకా వంటి విదేశీ కంపెనీల నుంచి రుణం ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. భూసమీకరణకయ్యే రూ.769 కోట్ల ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో కొనుగోళ్లకయ్యే ఖర్చులో ఆరు శాతం మొత్తాన్ని సర్వీసు చార్జిగా తీసుకుని డీఎంఆర్సీ నిర్మాణాన్ని చేపడుతుంది. తొలినుంచి అనుకున్నట్లుగానే ఏలూరురోడ్డు, బందరు రోడ్డు కారిడార్లను 25.76 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మెట్రో మెయిన్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్, బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకూ 12.76 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో పెనమలూరు వరకూ ఒకటో కారిడార్ నిర్మితమవుతుంది. రెండో కారిడార్‌ను బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, అలంకార్ మీదుగా ఏలూరురోడ్డు అక్కడి నుంచి నిడమానూరు వరకూ 13 కి.మీ. మేర 13 స్టేషన్లతో నిర్మిస్తారు. భవి ష్యత్తులో చేపట్టే రెండో దశ ప్రాజెక్టులో ఒక టో కారిడార్‌ను రాజధాని వరకూ పొడిగిస్తారు. ఇందుకోసం బస్టాండ్ సమీపంలో కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించి అక్కడి నుంచి కారిడార్‌ను తుళ్లూరు వరకూ పొడిగిస్తారు. రెండో దశలోనే రెండవ కారిడార్‌ను ఒకవైపు గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ, మరోవైపు గొల్లపూడి సెంటర్ వరకూ విస్తరిస్తారు. రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరలో రూపొందించనున్నారు. 25.76 కి.మీ. తొలి దశ మెట్రో ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేస్తామని ప్రారంభంలో గంటకు 40 నుంచి 50 వేల మంది ప్రయాణిస్తారని డీఎం ఆర్సీ అంచనా వేసింది. 2019 నాటికి గంటకు 2.91 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉందని ట్రాఫిక్ సర్వే ద్వారా తేల్చారు. మెట్రో రైళ్లలో 5 కి.మీ. వరకూ టికెట్ ధర రూ.10, 5 నుంచి పది కి.మీ. అయితే రూ.20, పది కి.మీ. దాటితే రూ.30 వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ధరల ద్వారా ఏడు సంవత్సరాల్లో మెట్రో ప్రాజెక్టు ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చని అంచనా. మరోవైపు రాజధాని అమరావతిని హైస్పీడ్ రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అనుసంధానించే విషయంపై ప్రభుత్వం డీఎంఆర్సీ సలహాను కోరింది. బెంగళూరు-అమరావతి, విశాఖ నుంచి అమరావతి మీదుగా తిరుపతి వరకూ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని శ్రీధరన్‌ను సీఎం కోరారు. విజయవాడ-మంగళగిరి-గుంటూరు-తెనాలి సర్క్యూట్‌ను మెట్రో నుంచి మినహాయించి ర్యాపిడ్ రైల్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించాలని శ్రీధరన్ డీపీఆర్‌లో ప్రతిపాదించారు. -
మెట్రోకు ఓకే !
- అమరావతికి హైస్పీడ్ రైళ్లు! - శ్రీధరన్ డీపీఆర్‌ను ఆమోదించిన సర్కారు - త్వరలో డీఎంఆర్సీ ఆధ్వర్యంలో నిర్మాణం - వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేది 40 శాతం - జపాన్ కంపెనీ నుంచి 60 శాతం రుణం! సాక్షి, విజయవాడ బ్యూరో : ఇక నవ్యాంధ్ర రాజధానిలో హైస్పీడ్రైళ్లు పరుగులు తీయనున్నాయి. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకోసం రాష్ట్రంలోని మెట్రోప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదించడంతో ప్రాజెక్టుకు మార్గం సుగుమమైంది. రూ.5,705 కోట్ల అంచ నా వ్యయమున్న ఈ ప్రాజెక్టును శ్రీధరన్ నేతృత్వంలోని డీఎంఆర్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) చేపట్టనుంది. ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన 60 శాతం మొత్తాన్ని జపాన్‌కు చెందిన జైకా వంటి విదేశీ కంపెనీల నుంచి రుణం ద్వారా సేకరించాలని ప్ర భుత్వం భావిస్తోంది. భూసమీకరణకయ్యే రూ.769 కోట్ల ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రాజెక్టు వ్యయంలో కొనుగోళ్లకయ్యే ఖర్చులో ఆరు శాతం మొత్తాన్ని సర్వీసు చార్జిగా తీసుకుని డీఎంఆర్సీ నిర్మాణాన్ని చేపడుతుంది. తొలి నుంచి అనుకున్నట్లుగానే ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు కారిడార్లను 25.76 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మెట్రో మెయిన్ స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్, బందరు రోడ్డు మీదుగా పెనమలూరు వరకూ 12.76 కిలోమీటర్ల మేర 12 స్టేషన్లతో పెనమలూ రు వరకూ ఒకటో కారిడార్ నిర్మితమవుతుంది. రెండవ కారిడార్‌ను బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్, అలంకార్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డు అక్కడి నుంచి నిడమానూరు వరకూ 13 కిలోమీటర్ల మేర 13 స్టేషన్లతో నిర్మిస్తారు. భవిష్యత్తులో చేపట్టే రెండో దశ ప్రాజెక్టులో ఒక టో కారిడార్‌ను రాజధాని వరకూ పొడిగిస్తారు. ఇందుకోసం బస్టాండ్ సమీపంలో కృష్ణా నదిపై బ్రిడ్జి నిర్మించి అక్కడి నుంచి కారిడార్‌ను తుళ్లూరు వరకూ పొడిగిస్తారు. రెండో దశలోనే రెండవ కారిడార్‌ను ఒకవైపు గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ, మరోవైపు గొల్లపూడి సెంటర్ వరకూ విస్తరిస్తారు. రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను త్వరలో రూపొందించనున్నారు. 25.76 కిలోమీటర్ల తొలి దశ మెట్రో ప్రాజెక్టును 2019కల్లా పూర్తి చేస్తామని ప్రారంభంలో గంటకు 40 నుంచి 50 వేల మంది ప్రయాణిస్తారని డీఎంఆర్సీ అంచనా వేసింది. 2019 నాటికి గంటకు 2.91 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉందని ట్రాఫిక్ సర్వే ద్వారా తేల్చారు. మెట్రో రైళ్లలో 5 కిలోమీటర్ల వరకూ టికెట్ ధర రూ.10, 5 నుంచి పది కిలోమీటర్లయితే రూ.20, పది కిలోమీటర్లు దాటితే రూ.30గా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ ధరల ద్వారా ఏడు సంవత్సరాల్లో మెట్రో ప్రాజెక్టు ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు రాజధాని అమరావతిని హైస్పీడ్ రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు అనుసంధానించే విషయంపై ప్రభుత్వం డీఎంఆర్సీ సలహాను కోరింది. బెంగళూరు నుంచి అమరావతి, విశాఖపట్నం నుంచి అమరావతి మీదుగా తిరుపతి వరకూ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి శ్రీధరన్‌ను కోరారు. అలాగే విజయవాడ-మంగళగిరి-గుంటూరు-తెనాలి సర్క్యూట్‌ను మెట్రో నుంచి మినహాయించి ర్యాపిడ్ రైల్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించాలని శ్రీధరన్ డీపీఆర్‌లో ప్రతిపాదించారు. -
హైస్పీడ్ రైళ్లతోనే ఏపీకి శోభ: మెట్రో శ్రీధరన్
గుడ్లవల్లేరు (కృష్ణాజిల్లా) : తెలంగాణాతో విడిపోవటంతో ఏపీ రాష్ట్రంలో రాజధాని ప్రాంతంతో పాటు ఇతర పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మెట్రో, హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుతోనే సుసాధ్యమవుతుంది. ఆ రైళ్లతోనే కొత్త రాష్ట్రానికి అభివృద్ధి శోభ రానుందని భారత దేశపు మెట్రోమెన్‌గా పిలువబడే రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహాదారుడు పద్మ విభూషణ్ డాక్టర్ ఇ.శ్రీధరన్ అన్నారు. శనివారం గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయనకొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు. ప్రశ్న : కొత్త రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనుల్ని ఎక్కడ ప్రారంభించనున్నారు? శ్రీధరన్ : కృష్ణానది అవతల గట్టున ఉన్న గుంటూరు జిల్లాలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనుల్ని ప్రారంభిద్దామని అనుకున్నాం. కాని విజయవాడలోనే ఆ పనుల్ని చేపడతాం. ప్రశ్న : ఆ పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందా? శ్రీధరన్ : గవర్నమెంట్ భవనాల ప్లాన్స్ ప్రభుత్వం నుంచి తమకు రాలేదు. ఆ ప్లాన్స్ వచ్చాకే మెట్రో ప్రాజెక్ట్‌ల ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ప్రశ్న : విజయవాడ, గుంటూరు మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ఎవరు నిర్మిస్తారు? శ్రీధరన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తాయి. ప్రశ్న : నిధులు ఎలా కేటాయించనున్నారు? శ్రీధరన్ : రాష్ట్ర ప్రభుత్వం 50శాతం, కేంద్ర ప్రభుత్వం 20శాతంతో పాటు మిగిలిన వాటాను ప్రపంచ బ్యాంకు వంటి బ్యాంకర్లు భరిస్తారు. ప్రశ్న : విజయవాడలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మించేందుకు మీకు ప్లాన్స్ ఎపుడు చేతికి అందవచ్చు? శ్రీధరన్ : కనీసం 4నుంచి 5నెలలు పట్టనున్నాయి. ప్రశ్న : ఎపుడు పనులు ఆరంభిస్తారు? శ్రీధరన్ : 2015సంవత్సరాంతానికి పనులు ప్రారంభించనున్నాం. ప్రశ్న : విజయవాడలో ఏ స్థాయిలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు? శ్రీధరన్ : భవిష్యత్‌లో విజయవాడ రెండు నుంచి మూడు రెట్ల భూ విస్తీర్ణం పెరుగనుంది. రాబోయే 40-50ఏళ్లలో వచ్చే అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగానే మెట్రో ప్రాజెక్ట్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు. ప్రశ్న : గుంటూరు, విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్ట్‌నే అమలు చేయనున్నారా? శ్రీధరన్ : విజయవాడ, గుంటూరుతో పాటు తెనాలికి ఈ రైలు రాకపోకల్ని పెంచే అవకాశం ఉంది. విజయవాడ పట్టణం వరకైతే మెట్రో రైలే సరిపోతుంది. తెనాలి, గుంటూరుకు కూడా అయితే హైస్పీడ్ రైలే బాగుంటుందని నా అభిప్రాయం. అదే జాయింట్ ప్రాజెక్ట్‌గా రూపొందించే అవకాశం ఉంది. ప్రశ్న : హైస్పీడ్‌కి ప్రభుత్వం నుంచి మద్ధతు ఉందా? శ్రీధరన్ : కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైస్పీడ్‌కి అనుకూలమే. రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్ట్ పనులను తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రశ్న : రాష్ర్టంలో వేరే పట్టణంలో ఎక్కడైనా మెట్రో ప్రాజెక్ట్ అవకాశం ఉందా? శ్రీధరన్ : వైజాగ్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనుల్ని చేపట్టే అవకాశం ఉంది. ప్రశ్న : ఎన్ని కిలోమీటర్ల మేర పనుల్ని చేపట్టనున్నారు? శ్రీధరన్ : 39కిలోమీటర్ల మేరకు మూడు కారిడార్స్‌ను కలుపుతూ పనుల్ని చేపట్టవలసి ఉంది. ప్రశ్న : ప్రాధమికంగా పనులు ఏ స్థాయిలో ఉన్నాయి? శ్రీధరన్ : మెట్రో పనులకు సంబంధించి భూ సర్వే పూర్తయ్యింది. ప్రశ్న : మిగిలిన సర్వేలు ఎంతవరకూ వచ్చాయి? శ్రీధరన్ : నిర్మాణాలకు భూ పరీక్షలు, పర్యావరణ పరిరక్షణకై సర్వే వచ్చే ఏప్రిల్ నెల చివరలో పూర్తి కానున్నాయి. ప్రశ్న : దేశంలో ఎక్కడెక్కడ మెట్రో పనుల్ని తమరు చేపట్టారు? శ్రీధరన్ : కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో మెట్రో పనుల్ని నిర్వహించాను. ప్రశ్న : ఏపీలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణంపై మీ అభిప్రాయం? శ్రీధరన్ : ఈ ప్రాంతంలో ప్రజలు మెట్రో ప్రాజెక్ట్‌కు ప్రాధమిక దశలోనే ఎంతో సహకారం అందిస్తున్నారు. చాలా సునాయాసంగా పనుల్ని పూర్తి చేయవచ్చు. -
మా రైళ్లు అమ్ముతాం.. తీసుకోరూ!!
భారత మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు మరోసారి చైనా, జపాన్ పోటీ పడుతున్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే బడ్జెట్లో మంత్రి సదానంద గౌడ ప్రకటించడంతో, ఆ మార్కెట్ కోసం ఈ రెండు దేశాలు ఇప్పుడు నేనంటే నేనంటూ ముందుకొస్తున్నాయి. అహ్మదాబాద్-ముంబై మార్గంలో ఇప్పటికే హైస్పీడ్ రైళ్లను నడిపించడానికి వీలుందా లేదా అనే విషయంలో జపాన్ కంపెనీ ఇప్పటికే కొన్ని పరీక్షలు చేసింది. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనకు వెళ్లనుండటంతో.. అప్పుడే ఈ పరీక్షల ఫలితాలపై అక్కడ చర్చ జరగనుంది. షిన్కన్సెన్ కంపెనీకి చెందిన హైస్పీడ్ రైళ్లను కొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని జపాన్ ప్రధాని షింజో అబె గట్టిగా కోరుతారని భావిస్తున్నారు. క్యోటో నుంచి టోక్యోకు ఇదే కంపెనీ హైస్పీడ్ రైళ్లను నడిపిస్తోంది. మరోవైపు ప్రపంచంలోనే అతిపెద్ద హైస్పీడ్ రైల్ నెట్వర్క్ చైనాలో ఉంది. తాము జపాన్ కంటే తక్కువ ధరకే రైళ్లు అమ్ముతామని చైనా అంటోంది. సెప్టెంబర్ రెండోవారం తర్వాత చైనా అధ్యక్షుడు సి జిన్‌పింగ్ భారతదేశంలో తొలిసారి పర్యటించనున్నారు. ఒకవైపు జపాన్ తాము మంచి నాణ్యమైన రైళ్లు, ఉన్నత భద్రతా ప్రమాణాలు అందిస్తామని చెబుతుంటే, చైనా మాత్రం తక్కువ ధరకు ఇస్తామని అంటోంది. -
హైదరాబాద్ సరిహద్దు జిల్లా కేంద్రాలకు హైస్పీడ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం నుంచి సరిహద్దు ఆనుకుని ఉన్న జిల్లా కేంద్రాలకు హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు ‘మహానగర సమీకృత రవాణా ప్రాధికార సంస్థ’ (యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. సోమవారం ‘ఉమ్టా’ అధ్యక్షుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆధ్వర్యంలో ‘హెచ్ఎండీఏ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచే’ అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ అధికారులు సీఎస్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మెట్రో రైలు మార్గాలకు ఇరువైపులా అర కిలోమీటరు వరకు బహుళ వినియోగ ప్రాంతం (మల్టీపుల్ యూజ్ జోన్)గా అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. జన సాంద్రత ఆధారంగా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) ప్రోత్సాహకాలను పలు దేశాల్లోని నగరాల్లో అమలుచేస్తున్నారని.. ఆ పద్ధతిని పాటించడం వల్ల ఆయా ప్రాంతాల్లో జనసాంద్రత పెరుగుతుందని, అలాంటి ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తంగా హెచ్ఎండీఏ పరిధిలో 2041 సంవత్సరం వరకు రవాణా వ్యవస్థ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే.. దాదాపు 1.29 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఏటా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ నిధుల సమీకరణ ఎలా చేయాలన్న అంశంపైనా చర్చించారు. రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే జనసాంద్రత పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని సీఎస్ మహంతి అధికారులకు సూచించారు. కార్యాలయాలకు, పాఠశాలలకు నడిచి వెళ్లడానికి వీలుండే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు, ప్రకృతి సంపద, వారసత్వ సంపదను కాపాడాలని అభిప్రాయపడ్డారు. జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులకు చేరుకోవడానికి వీలుగా బైపాస్ రహదారులు, ఇన్నర్ రింగ్‌రోడ్లు, సబ్ ఇన్నర్ రింగ్‌రోడ్లు, జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాలు, వ్యాపార ప్రాంతాలను ముందుగా గుర్తించి వాటి అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు. పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, ఐటీ, పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు, పెట్టుబడుల ప్రాంతాల గుర్తింపు, ఐటీ సంస్థల ఏర్పాటు ప్రాంతాలను ప్రణాళికాపరంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులు శైలేంద్ర కుమార్ జోషి, సమీర్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.