హైదరాబాద్ సరిహద్దు జిల్లా కేంద్రాలకు హైస్పీడ్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం నుంచి సరిహద్దు ఆనుకుని ఉన్న జిల్లా కేంద్రాలకు హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు ‘మహానగర సమీకృత రవాణా ప్రాధికార సంస్థ’ (యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. సోమవారం ‘ఉమ్టా’ అధ్యక్షుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆధ్వర్యంలో ‘హెచ్‌ఎండీఏ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచే’ అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ అధికారులు సీఎస్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మెట్రో రైలు మార్గాలకు ఇరువైపులా అర కిలోమీటరు వరకు బహుళ వినియోగ ప్రాంతం (మల్టీపుల్ యూజ్ జోన్)గా అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.
జన సాంద్రత ఆధారంగా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) ప్రోత్సాహకాలను పలు దేశాల్లోని నగరాల్లో అమలుచేస్తున్నారని.. ఆ పద్ధతిని పాటించడం వల్ల ఆయా ప్రాంతాల్లో జనసాంద్రత పెరుగుతుందని, అలాంటి ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తంగా హెచ్‌ఎండీఏ పరిధిలో 2041 సంవత్సరం వరకు రవాణా వ్యవస్థ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే.. దాదాపు 1.29 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఏటా నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ నిధుల సమీకరణ ఎలా చేయాలన్న అంశంపైనా చర్చించారు. రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే జనసాంద్రత పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని సీఎస్ మహంతి అధికారులకు సూచించారు. కార్యాలయాలకు, పాఠశాలలకు నడిచి వెళ్లడానికి వీలుండే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూములు, ప్రకృతి సంపద, వారసత్వ సంపదను కాపాడాలని అభిప్రాయపడ్డారు.
జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారులకు చేరుకోవడానికి వీలుగా బైపాస్ రహదారులు, ఇన్నర్ రింగ్‌రోడ్లు, సబ్ ఇన్నర్ రింగ్‌రోడ్లు, జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రాంతాలు, వ్యాపార ప్రాంతాలను ముందుగా గుర్తించి వాటి అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు. పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి, ఐటీ, పరికరాల ఉత్పత్తి పరిశ్రమలు, పెట్టుబడుల ప్రాంతాల గుర్తింపు, ఐటీ సంస్థల ఏర్పాటు ప్రాంతాలను ప్రణాళికాపరంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులు శైలేంద్ర కుమార్ జోషి, సమీర్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.