హైస్పీడ్ రైళ్లతోనే ఏపీకి శోభ: మెట్రో శ్రీధరన్ | andhrapradesh willbe shine with high speed trains only, says sridharan | Sakshi
Sakshi News home page

హైస్పీడ్ రైళ్లతోనే ఏపీకి శోభ: మెట్రో శ్రీధరన్

Published Sat, Feb 28 2015 7:49 PM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

హైస్పీడ్ రైళ్లతోనే ఏపీకి శోభ: మెట్రో శ్రీధరన్ - Sakshi

హైస్పీడ్ రైళ్లతోనే ఏపీకి శోభ: మెట్రో శ్రీధరన్

గుడ్లవల్లేరు (కృష్ణాజిల్లా) : తెలంగాణాతో విడిపోవటంతో ఏపీ రాష్ట్రంలో రాజధాని ప్రాంతంతో పాటు ఇతర పట్టణాలు అభివృద్ధి చెందాలంటే మెట్రో, హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుతోనే సుసాధ్యమవుతుంది. ఆ రైళ్లతోనే కొత్త రాష్ట్రానికి అభివృద్ధి శోభ రానుందని భారత దేశపు మెట్రోమెన్‌గా పిలువబడే రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహాదారుడు పద్మ విభూషణ్ డాక్టర్ ఇ.శ్రీధరన్ అన్నారు. శనివారం గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఒక కార్యక్రమానికి వచ్చిన ఆయనకొద్దిసేపు విలేకరులతో ముచ్చటించారు.
ప్రశ్న : కొత్త రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనుల్ని ఎక్కడ ప్రారంభించనున్నారు?
శ్రీధరన్ : కృష్ణానది అవతల గట్టున ఉన్న గుంటూరు జిల్లాలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనుల్ని ప్రారంభిద్దామని అనుకున్నాం. కాని విజయవాడలోనే ఆ పనుల్ని చేపడతాం.
ప్రశ్న : ఆ పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిందా?
శ్రీధరన్ : గవర్నమెంట్ భవనాల ప్లాన్స్ ప్రభుత్వం నుంచి తమకు రాలేదు. ఆ ప్లాన్స్ వచ్చాకే మెట్రో ప్రాజెక్ట్‌ల ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది.
ప్రశ్న : విజయవాడ, గుంటూరు మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను ఎవరు నిర్మిస్తారు?
శ్రీధరన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మిస్తాయి.
ప్రశ్న : నిధులు ఎలా కేటాయించనున్నారు?
శ్రీధరన్ : రాష్ట్ర ప్రభుత్వం 50శాతం, కేంద్ర ప్రభుత్వం 20శాతంతో పాటు మిగిలిన వాటాను ప్రపంచ బ్యాంకు వంటి బ్యాంకర్లు భరిస్తారు.
ప్రశ్న : విజయవాడలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మించేందుకు మీకు ప్లాన్స్ ఎపుడు చేతికి అందవచ్చు?
శ్రీధరన్ : కనీసం 4నుంచి 5నెలలు పట్టనున్నాయి.
ప్రశ్న : ఎపుడు పనులు ఆరంభిస్తారు?
శ్రీధరన్ : 2015సంవత్సరాంతానికి పనులు ప్రారంభించనున్నాం.
ప్రశ్న : విజయవాడలో ఏ స్థాయిలో మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు?
శ్రీధరన్ : భవిష్యత్‌లో విజయవాడ రెండు నుంచి మూడు రెట్ల భూ విస్తీర్ణం పెరుగనుంది. రాబోయే 40-50ఏళ్లలో వచ్చే అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగానే మెట్రో ప్రాజెక్ట్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు.
ప్రశ్న : గుంటూరు, విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్ట్‌నే అమలు చేయనున్నారా?
శ్రీధరన్ : విజయవాడ, గుంటూరుతో పాటు తెనాలికి ఈ రైలు రాకపోకల్ని పెంచే అవకాశం ఉంది. విజయవాడ పట్టణం వరకైతే మెట్రో రైలే సరిపోతుంది. తెనాలి, గుంటూరుకు కూడా అయితే హైస్పీడ్ రైలే బాగుంటుందని నా అభిప్రాయం. అదే జాయింట్ ప్రాజెక్ట్‌గా రూపొందించే అవకాశం ఉంది.
ప్రశ్న : హైస్పీడ్‌కి ప్రభుత్వం నుంచి మద్ధతు ఉందా?
శ్రీధరన్ : కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు హైస్పీడ్ రైళ్ల ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైస్పీడ్‌కి అనుకూలమే. రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్ట్ పనులను తలపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రశ్న : రాష్ర్టంలో వేరే పట్టణంలో ఎక్కడైనా మెట్రో ప్రాజెక్ట్ అవకాశం ఉందా?
శ్రీధరన్ : వైజాగ్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనుల్ని చేపట్టే అవకాశం ఉంది.
ప్రశ్న : ఎన్ని కిలోమీటర్ల మేర పనుల్ని చేపట్టనున్నారు?
శ్రీధరన్ : 39కిలోమీటర్ల మేరకు మూడు కారిడార్స్‌ను కలుపుతూ పనుల్ని చేపట్టవలసి ఉంది.
ప్రశ్న : ప్రాధమికంగా పనులు ఏ స్థాయిలో ఉన్నాయి?
శ్రీధరన్ : మెట్రో పనులకు సంబంధించి భూ సర్వే పూర్తయ్యింది.
ప్రశ్న : మిగిలిన సర్వేలు ఎంతవరకూ వచ్చాయి?
శ్రీధరన్ : నిర్మాణాలకు భూ పరీక్షలు, పర్యావరణ పరిరక్షణకై సర్వే వచ్చే ఏప్రిల్ నెల చివరలో పూర్తి కానున్నాయి.

ప్రశ్న : దేశంలో ఎక్కడెక్కడ మెట్రో పనుల్ని తమరు చేపట్టారు?
శ్రీధరన్ : కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో మెట్రో పనుల్ని నిర్వహించాను.
ప్రశ్న : ఏపీలో మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణంపై మీ అభిప్రాయం?
శ్రీధరన్ : ఈ ప్రాంతంలో ప్రజలు మెట్రో ప్రాజెక్ట్‌కు ప్రాధమిక దశలోనే ఎంతో సహకారం అందిస్తున్నారు. చాలా సునాయాసంగా పనుల్ని పూర్తి చేయవచ్చు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement