బెంగళూరులో బుల్లెట్ రైళ్లు!
కర్ణాటకలో బుల్లెట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. బెంగళూరు నుంచి మైసూర్, చెన్నైలకు వీటిని నడపాలని భావిస్తోంది. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సహాయంతో వీటిని ప్రవేశపెట్టనున్నారు.
ప్రగతి పథంలో దూసుకుపోతున్న బెంగళూరులో వేగంగా పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చేందుకు బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టనున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. వారం రోజుల పాటు చైనాలో పర్యటించిన ఆయన రెండు రోజుల క్రితం సొంత రాష్ట్రానికి తిరిగొచ్చారు. తమ రాష్ట్రంలో బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టాలని జపాన్ నిపుణులను ఆహ్వానించానని సిద్ధరామయ్య తెలిపారు. ఇందులో భాగంగా రైల్వే శాఖ, తమ రాష్ట్ర అధికారులతో చర్చలు జరపాలని సూచించినట్టు చెప్పారు.
ముందుగా బెంగళూరు- మైసూర్-చెన్నై మధ్య బుల్లెట్ రైళ్లు నడపాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రపంచంలో మొట్టమొదటగా బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టి, విజయవంతంగా నడుపుతున్న ఘనత జపాన్కు చెందుతుందని చెప్పారు. తమ రాష్ట్రంలో హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు జపాన్ సాంకేతిక సహాయం బాగా ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.