సామాన్యులకు నరక యాతన...
న్యూఢిల్లీ: బుల్లెట్ రైళ్లను సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించడం ప్రతి భారతీయుడి కళ అని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు పార్లమెంట్‌లో అప్పుడెప్పుడో ప్రకటించారు. ఆ అందమైన కళ డబ్బున్న కొందరికి మాత్రమే. టిక్కెట్ కొనే దగ్గరి నుంచి గమ్యస్థానం చేరుకునేవరకు నరక యాతన అనుభవిస్తున్న సామాన్య ప్రయాణికుల కళ ఎంతమాత్రం కాదు. పొడవాటి క్యూలో నిలబడడం, కచ్చితంగా ఎప్పుడొస్తుందో తెలియని రైలు కోసం గంటల తరబడి నిరీక్షించడం, రైలు ఆగి, ఆగకుండానే జనరల్ బోగీలోకి పశువులవలే తోసుకుంటూ వెళ్లడం, అప్పటికే కిక్కిర్సిన బోగీల్లోకి వెళ్లేందుకు కుస్తీ పట్టడం ఆమ్ ఆద్మీకి నిత్యకృత్య అనుభవమే.
రెండు దళాబ్దాల క్రితం రాజ్‌ధాని, శతాబ్ది, దురొంతోస్, యువాస్ లాంటి ప్రీమియర్ రైళ్లు లేనప్పుడే సామాన్య రైలు ప్రయాణికుల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేది. ఫ్లాట్‌ఫామ్‌కు వెళితే టిక్కెట్ కౌంటర్లు ఎక్కువగా ఉండేవి. ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు అంతగా ఆలస్యం అయ్యేవి కావు. ఏ రైలు ఎప్పుడెస్తుందో నల్ల బోర్డుపై ప్రయాణికులకు అర్థమయ్యేలా చాక్‌పీస్‌తో చక్కగా రాసేవారు. ఫ్టాట్‌ఫామ్‌పై స్వచ్ఛమైన జామకాయలు, దోసకాయలు, మామాడి పండ్లు, పనస, అల్లనేరేడు, రేగు లాంటి రకరకాల పండ్లను స్థానిక వ్యాపారులు విక్రయించేవారు. వాటిని ఆరగించి ప్రయాణికులను తమ ఆకలిని తీర్చుకునేవారు.
ఆదునికత పేరుతో స్థానిక వెండర్లను ఫ్లాట్‌ఫామ్‌ల మీది నుంచి తరిమేశారు. బ్రాండెడ్ ఆహార పదార్థాలు వచ్చి చేరాయి. అవి ఖరీదైనవే కాకుండా ఆరోగ్యానికి కూడా అంత మేలైనవేమి కాదు. ఎక్స్‌ప్రెస్, సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రవేశంతో సాధారణ రైళ్ల రాకపోకలు మందగించాయి. వాటికి దారి ఇవ్వడం కోసం వీటిని జంక్షన్లలో నిలిపేస్తుండడంతో గంటల తరబడి ఆలస్యం అవుతున్నాయి. ఇప్పుడు శతాబ్ది, రాజధాని, దురొంతోస్ రైళ్లకు క్లియరెన్స్ ఇవ్వడం కోసం ఎక్క్‌ప్రెస్ రైళ్లను ఎక్కడికక్కడా నిలిపేస్తున్నారు. మధ్య తరగతి నుంచి ఆ పై వర్గాల ప్రయాణికుల కోసం కంప్యూటర్, మోబైల్ నెట్‌వర్క్ బుకింగ్, తత్కాల్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆమ్ ఆద్మీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.
చాలా రైల్వే స్టేషన్లలో ఇప్పటికీ టిక్కెట్ కొనేందుకు ఒకే కౌంటర్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎప్పుడు చూసి అక్కడ చాంతాడంగా పొడవాటి క్యూలు కనిపిస్తుంటాయి. విమానాశ్రయాల్లాగా మల్టిపుల్ కౌంటర్ వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చు. క్యూలు చెదిరి పోకుండా కౌంటర్‌కు కౌంటర్‌కు మధ్య డివిజన్ ఏర్పాటు చేయవచ్చు. గత రెండు శతాబ్దాలుగా ప్రయాణికులకు అనుగుణంగా త్రీటైర్, ఏసీ టైర్‌లను పెంచుతున్నారే తప్ప, సామాన్యులను దృష్టిలో పెట్టుకొని జనరల్ బోగీలను పెంచడం లేదు. అందుకనే ఇప్పుడవి పశువుల కొట్టాలను తలపిస్తున్నాయి. రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేసేందుకు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన డిజిటల్ చార్ట్‌లు ఎప్పుడు సవ్యంగా పనిచేయవు. ఢిల్లీ రైల్లే స్టేషన్‌లోని డిజిటల్ బోర్డులనే తీసుకుంటే ఫలానా రైలు బయల్దేరడానికి సిద్ధంగా ఉందని వస్తుంది. అప్పటికే ఆ రైలు వెళ్లిపోయి ఉంటుంది. చాలా సార్తు అక్షరాలు చుక్కల్లా విడిపోయి ఏమీ అర్థం కాదు.
సామాన్యుల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు జాతి ప్రతిష్ట కోసం బుల్లెట్ రైలు గురించి మాట్లాడటం అర్థరహితం. ఒక్క బుల్లెట్ రైలుకు 60 వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ డబ్బును మరిన్ని అదనపు రైళ్లు, ఇతర ప్రయాణికుల సదుపాయాల కోసం ఖర్చు పెట్టడం సముచితం అవుతుంది. ఇప్పటికే దక్షిణ, పశ్చిమ, ఉత్తర రైలు సర్వీసుల అభివృద్ధి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాలను తొలగించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. భారత్ బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టే స్థాయికి ఎదగకూడదన్నది వాదన కాదు, ముందు అత్యావసరాలను గుర్తించాలన్నది ఇక్కడ వాదన. రేపటి రైల్వే బడ్జెట్‌లో సురేశ్ ప్రభు దృక్పథం ఎలా ఉంటుందో చూడాలి.