'బుల్లెట్' కన్నా వేగంగా మ్యాగ్లెవ్ రైళ్లు | After Bullet trains, Modi govt sets sights on Maglev trains | Sakshi
Sakshi News home page

'బుల్లెట్' కన్నా వేగంగా మ్యాగ్లెవ్ రైళ్లు

Published Fri, Aug 5 2016 5:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

'బుల్లెట్' కన్నా వేగంగా మ్యాగ్లెవ్ రైళ్లు

'బుల్లెట్' కన్నా వేగంగా మ్యాగ్లెవ్ రైళ్లు

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికుల రవాణా వ్యవస్థ స్వరూపమే సమీప భవిష్యత్తులో మారిపోనుంది. అయస్కాంత క్షేత్ర వ్యవస్థ (మ్యాగ్లెవ్) ద్వారా గరిష్టంగా గంటకు 500 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైళ్లను నడపాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రైవేటు పార్టీల బిడ్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ ఆరో తేదీలోగా బిడ్లను దాఖలు చేయాల్సిందిగా నోటిఫికేషన్‌లో కోరినట్లు విశ్వసనీయ రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలుకన్నా ఈ మ్యాగ్లెవ్ రైళ్లు అతివేగంగా నడుస్తాయి.

బుల్లెట్ రైలు వేగం గంటకు 300 నుంచి 350 కిలోమీటర్లుకాగా, మ్యాగ్లెవ్ రైళ్లు కనిష్టంగా గంటకు 350, గరిష్టంగా గంటకు 500 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న హైదరాబాద్-చెన్నై, బెంగళూరు-చెన్నై, న్యూఢిల్లీ-చండీగఢ్, నాగపూర్-ముంబై రూట్లలో ఈ రైళ్లను ముందుగా ప్రవేశపెట్టాలని భారతీయ రైల్వే ప్రదిపాదించింది. ప్రపంచంలో ప్రస్తుతం ఈ తరహా రైళ్లు అమెరికా, జర్మనీ, జపాన్, చైనా, దక్షిణ కొరియా దేశాల్లో మాత్రమే నడుస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మ్యాగ్లెవ్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

రైల్వే స్టేషన్లు, రైలు మార్గాలను నిర్మించేందుకు స్థలాన్ని మాత్రమే రైల్వే శాఖ సేకరించి ఇస్తుంది. రైళ్లతోపాటు రైలు మార్గాలను, స్టేషన్లను నిర్మించడం, రైళ్లను నడపడం ప్రైవేటు పార్టీల బాధ్యతే. రెవెన్యూ పంపకాల పద్ధతిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కొనసాగుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. అతివేగవంతమైన రైళ్లు, బుల్లెట్ రైళ్లు, వేగవంతమైన రైళ్లను నడపాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృక్పథంలో భాగంగానే మ్యాగ్లెవ్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ఆ వర్గాలు వివరించాయి.

రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడుతుండడం వల్ల క్రమంగా రైళ్ల రెవెన్యూ పడిపోతూ వస్తోందని, ఇలాంటి అతివేగం రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త రైళ్లలో వైఫై, టీవీ స్క్రీన్లు, ఆన్‌లైన్ సినిమాలు, క్యాంటీన్లు లాంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉంటాయని తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement