బీజింగ్ : జపాన్ సినీ తార ర్యోకో నకానో 1979లో చైనా సందర్శనలో భాగంగా బీజింగ్ వెళ్లారు. అప్పటికే ఆమె నటించిన ‘మ్యాన్ హంట్’ సినిమా చైనాలో విడుదలై ఏడాది అయింది. సినిమా హిట్టయిన సందర్భంగానే ఆమె బీజింగ్ వచ్చారు. ఇక్కడి హోటల్లో బస చేసిన ఆమె కిటికీలో నుంచి చూడగా, ఆమెకు ప్రతివీధిలో కనుచూపు మేర సైకిళ్లే కనిపించాయి. ఇదేమి ‘సైకిళ్ల సముద్రమా చైనా’ అని ఆమె సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆమె ఒక్కరేమిటీ? ఆ కాలంలో చైనాకు వెళ్లిన ప్రతి విదేశీయుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు.
40 ఏళ్ల క్రితం చైనా ప్రజలకు కార్లు కొనే స్థోమత, వాటిల్లో తిరిగే యోగ్యతా లేదు. అందుకని సైకిళ్లనే అత్యంతగా ఆదరించారు. అందుకనే చైనాకు ‘కింగ్డ్‌మ్ ఆఫ్ బైస్కిల్స్’ అని పేరు వచ్చింది. అయితే ఆ తర్వాత అనతికాలంలోనే చైనా ప్రజల రవాణా వ్యవస్థలోనే అద్భుతమైన మార్పులు వచ్చాయి. అందుకు కారణం చైనా అధ్యక్షుడు డెంగ్‌జియావోపింగ్ 1978లో చరిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం. ఆ సంస్కరణల కారణంగా నాలుగు దశాబ్దాల కాలంలోనే చైనా అనూహ్య అభివద్ధిని సాధించింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగిన ఈ దేశం ప్రపంచంలోనే రెండవ బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఘనతికెక్కింది.
నేడు చైనా అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైళ్లకు నిలయంగా మారింది. 2008లో చైనా మొదటి బుల్లెట్ రైలు నిర్మించింది. బీజింగ్ నుంచి టియాన్‌జిన్ మున్సిపాలిటీకి మధ్య 120 కిలోమీటర్ల దూరాన్ని ఇది 30 నిమిషాల్లో చేరుకునేది. 2017, చివరి నాటికి రెండున్నర లక్షల కిలోమీటర్ల వరకు బుల్లెట్ ట్రెయిన్ల వ్యవస్థ విస్తరించింది. అంటే ప్రపంచంలో మొత్తం రైల్వే నెట్‌వర్కుల్లో 66 శాతం నెట్‌వర్క్ ఒక్క చైనాకే ఉంది. డెంగ్ జియావోపింగ్ 1978లో జపాన్‌ను సందర్శించినప్పుడు టోక్యో నుంచి క్యోటోకు శింకన్‌సేన్ బుల్లెట్ ట్రెయిన్‌లో ప్రయాణించి అశ్చర్యపడ్డారు. ఆ రోజే తమ దేశంలో కూడా ఇలాంటి విప్లవాత్మక రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఆధునిక రవాణా వ్యవస్థ కారణంగా మధ్యలో అంతరించి పోయిన సామాన్య మానవుల వాహనం ‘సైకిల్’ ఇప్పుడు చైనా వీధుల్లో మళ్లీ ప్రత్యక్షమయింది. ఏ వీధిలో తిరిగినా అవే దర్శనమిస్తున్నాయి. అందుకు కారణం పర్యావరణం పట్ల అవగాహన కలగడం, ఆరోగ్య రక్షణ పట్ల ఆసక్తి పెరగడం. మెట్రో రైల్వే స్టేషన్ల మధ్య నడిపేందుకు ఇవి మరింతగా ఈ సైకిళ్లు మరింతగా ఉపయోగపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment