huge investment
-
వొడాఫోన్ ఇండియాకు భారీ పెట్టుబడులు
* మాతృ సంస్థ నుంచి రూ. 47,700 కోట్ల నిధులు * భారత్‌లోకి అతిపెద్ద ఎఫ్‌డీఐగా రికార్డు ముంబై: రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికం మార్కెట్లో పోటీపెరిగిన నేపథ్యంలో వొడాఫోన్ ఇండియాకు బ్రిటన్ మాతృసంస్థ వొడాఫోన్ నుంచి భారీ పెట్టుబడులు వచ్చాయి. తాజా మూలధనం రూపంలో రూ. 47,700 కోట్ల నిధులు అందినట్లు గురువారం వొడాఫోన్ ఇండియా ఎండీ సునీల్ సూద్ చెప్పారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా భారీగా నిధులు సమీకరించాలన్న ప్రణాళికను ఇంతకుమునుపు కంపెనీ ప్రకటించింది. అయితే తక్షణ అవసరాల కోసం మాతృసంస్థ హుటాహుటిన ఈ పెట్టుబడులు పంపించింది. భారత్‌లోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) ఇదేనని సూద్ చెప్పారు. రుణాన్ని తీర్చడానికి, వచ్చేవారం నుంచి ప్రారంభంకానున్న స్పెక్ట్రం వేలంలో బిడ్ చేసేందుకు ఈ నిధులు ఉపయోగిస్తామన్నారు. కంపెనీకి ప్రస్తుతం రూ. 25,000 కోట్ల రుణ భారం వుంది. -
రైల్వేకు ‘ఎల్ఐసీ’ దన్ను
ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడికి బీమా దిగ్గజం సై ⇒ భారతీయ రైల్వేల చరిత్రలో అత్యంత భారీ ఇన్వెస్ట్మెంట్ ⇒ ఇరు సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ⇒ పెట్టుబడి నిధులపై ఐదేళ్లపాటు వడ్డీ, రుణ చెల్లింపులు ఉండవు న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలకు నిధుల పంట పండనుంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులను వెచ్చించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటిదాకా రైల్వేల చరిత్రలో ఇదే అత్యంత భారీ పెట్టుబడి. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుల సమక్షంలో ఇరు సంస్థలూ ఈ పెట్టుబడి నిధులకు సంబంధించి బుధవారం ఒక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. భారతీయ రైల్వేలకు చెందిన ఇండియన్ రైల్వేస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) తదితర సంస్థలు జారీచేసే బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా ఎల్ఐసీ ఈ ప్రతిపాదిత పెట్టుబడి నిధులను వెచ్చిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2015-16) నుంచి ప్రారంభమయ్యే పెట్టుబడులపై రైల్వే శాఖ ఐదేళ్లపాటు వడ్డీ, రుణాలు తిరిగి చెల్లింపులు జరపకుండా మారటోరియం కూడా అమలు కానుంది. రైల్వేల పనితీరు మెరుగుపడాలి: జైట్లీ ‘ఇది పూర్తిగా వాణిజ్య నిర్ణయం. ఎల్ఐసీ పదేళ్లపాటు రూ.1.5 లక్షల కోట్లను రైల్వేల్లో పెట్టుబడి పెడుతుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ వ్యాఖ్యానించారు. భారతీయ రైల్వేల పనితీరు చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎంతో చరిత్ర కలిగిన మన రైల్వేలు మరింత వృద్ధి పథంలో దూసుకెళ్లాలి. ఈ సంస్థను అత్యంత నైపుణ్యంతో ప్రొఫెషనల్‌గా నడిపించాలి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆనందదాయకమైన ప్రయాణ అనుభూతిని కల్పించగలగాలి. అంతేకానీ, అరకొర సదుపాయాలతో నిర్బంధంగా నడిపిస్తామంటే కుదరదు. ఇవన్నీ చేయాలంటే సేవల్లో నాణ్యత భారీగా పెరగాల్సిందే’ అని జైట్లీ పేర్కొన్నారు. ఇక ఎల్ఐసీ విషయానికొస్తే.. అద్భుతమైన వ్యాపార దిగ్గజంగా ఇది ఎదిగిందన్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రొఫెషనల్ దృక్పథంతో ఎంత భారీగా ఎదగవచ్చో.. దేశానికి ఎంతగా సేవలందించవచ్చో తెలియజేసేందుకు ఎల్ఐసీయే ప్రత్యక్ష ఉదాహరణ అని జైట్లీ కొనియాడారు. ప్రస్తుతం ఎల్ఐసీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.15 లక్షల కోట్ల పైమాటే. స్టాక్ మార్కెట్లో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు పలు సంస్థలకు దీర్ఘకాలిక రుణాలను కూడా ఇది అందిస్తోంది. ఏటా రూ.30 వేల కోట్లు... వచ్చే ఐదేళ్లలో ఏటా సగటున రూ.30 వేల కోట్ల విలువైన రైల్వేలు జారీ చేసే బాండ్లను కొనుగోలు చేస్తామని ఎంఓయూపై సంతకాల అనంతరం ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ చెప్పారు. అయితే, ఎల్ఐసీ ఈ పెట్టుబడులపై ఏ స్థాయిలో రాబడులను అందుకోనుందన్న ప్రశ్నకు.. వడ్డీ రేటు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తాము కొనుగోలు చేసే బాండ్లకు కాలపరిమితి 30 ఏళ్లు ఉంటుందని.. ఐదేళ్ల వ్యవధిలో నిధులిస్తామని రాయ్ తెలిపారు. ఇది వివాహ బంధంలాంటిది..: ప్రభు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలోని రెండు అతిపెద్ద సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని వివాహ బంధంగా అభివర్ణించారు. ఇరు సంస్థలకూ ఇది మేలు చేకూర్చే ఒప్పందమని పేర్కొన్నారు. రైల్వే మౌలిక రంగ ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధుల సమీకరణ దిశగా కీలకమైన చర్యగా ఈ ఎంఓయూ నిలుస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘ప్రాజెక్టులకు డబ్బులెక్కడ ఉన్నాయి? అని అందరూ అడుగుతుంటారు. ఇదిగో డబ్బు. దీనికి తేనె కూడా పూసి ఉంది (దేర్ ఈజ్ మనీ, విత్ హనీ). ఎందుకంటే ఈ నిధులపై వడ్డీరేటు అటు ఎల్ఐసీ, ఇటు రైల్వేలకు కూడా ఎంతో లాభదాయకమైన రీతిలో ఉంటుంది’ అంటూ కొంత సరదా ధోరణిలో రైల్వే మంత్రి మాట్లాడారు. నిధుల కొరతను ఎదుర్కొంటున్న రైల్వే మౌలిక ప్రాజెక్టులను ఇక వేగంగా పూర్తిచేసేలా ఎల్ఐసీ పెట్టుబడులు ఉపయోగపడతాయని కూడా ప్రభు తెలియజేశారు. రైల్వేలను లాభాల్లోకి తీసుకురావడంలో ఇది తొలి అడుగుగా పేర్కొన్నారు. రైల్వేల అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో రూ.8.5 లక్షల కోట్ల నిధులను ఖర్చుచేయనున్నట్లు 2015-16 బడ్జెట్ ప్రసంగంలో సురేశ్ ప్రభు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కంద రైతు కుదేలు
తోట్లవల్లూరు, న్యూస్‌లైన్ : కంద రైతులు కుదేలవుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికందే సమయానికి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో సతమతమవుతున్నారు. వాణిజ్య పంటలలో ప్రధానమైనది కంద. జిల్లాలోని తోట్లవల్లూరు, కంకిపాడు, పెనమలూరు, పమిడిముక్కల, ఉయ్యూరు, మొవ్వ, చల్లపల్లి, మోపిదేవి తదితర ప్రాంతాల్లోని మెట్ట, లంక భూముల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఉద్యానశాఖ అంచనా ప్రకారం సుమారు 500 నుంచి 600 హెక్టార్లలో కంద సాగవుతోంది. ఏడాదికి సగటున 40 నుంచి 45 వేల టన్నుల పంట దిగుబడి ఉంటుంది. భారీగా పెట్టుబడులు కందకు మంచి ధర లభిస్తుందనే ఆశతో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. పట్టి విత్తనం ఎకరానికి 20 పుట్లు వినియోగించారు. ఇందుకోసం రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు వెచ్చించారు. దుక్కులు, విత్తనం నాటడం, కలుపులు, ఎరువులు, పురుగు మందులకు మరో రూ.50 వేలు ఖర్చుచేశారు. కౌలు రైతులు ఈ ఖర్చులకు తోడు మరో రూ. 30 వేలు కౌలు చెల్లించాలి. వెరసి ఎకరం కంద సాగుకి రూ. 1.40 లక్షల వరకు ఖర్చయింది. తగ్గుతున్న దిగుబడులు కంద పంట దిగుబడులు తగ్గుతున్నాయి. గతంలో ఎకరానికి 80 నుంచి 100 పుట్లు వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం ఎకరానికి 40 నుంచి 50 పుట్లకు పరిమితమైంది. విత్తన ఎంపికలో అజాగ్రత్త, పంట మార్పిడి చేయకపోవటం, భూసారం తగ్గుతుండటం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం తదితర కారణాలవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, తరచూ పంటమార్పిడి చేస్తూ, సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ధర పతనం కంద ధర గణనీయంగా పడిపోయింది. నెల రోజుల క్రితం వరకూ పుట్టి కంద ధర రూ. 1,800 పలికింది. ఇప్పుడు కందను కొనే నాథుడే కరువయ్యాడు. ఒక్కసారిగా ధర రూ. 1,100కు పడిపోయింది. గతంలో రావులపాలెం నుంచి వ్యాపారులు వచ్చి పంట కొనుగోలు చేసేవారు. ఇప్పుడు వారు ముఖం చాటేశారు. తీవ్రనష్టం వాటిల్లింది ఎకరం పొలంలో కందను సాగుచేశా. పుట్టి విత్తనం రూ. 3 వేలకు కొనుగోలు చేసి పంట వేశాను. కేవలం విత్తనానికే రూ. 60 వేలు ఖర్చయింది. ఎరువులు, పురుగుమందులు, సాగు ఖర్చులు మరో రూ. 50 వేలు అయ్యాయి. ధర పూర్తిగా పడిపోయింది. - మండేపూడి కోటిరెడ్డి, రైతు, భద్రిరాజుపాలెం ఎగుమతి తగ్గింది నెల క్రితం కంద పుట్టి రూ. 1,800 వరకు కూడా కొనుగోలు చేశాం. ప్రస్తుతం మార్కెట్ మందగించింది. ఎగుమతులు తగ్గడంతో వ్యాపారులు కూడా కంద కొనుగోళ్ల పై ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం పుట్టి రూ. 1,100కు కొనుగోలు చేస్తున్నాం. రైతులకు నష్టమే. - సత్యనారాయణ, కమీషన్ ఏజెంట్, తోట్లవల్లూరు పంటంతా ఒకేసారి రావడం వల్లే కంద పంట కాలం పూర్తి కావటంతో అన్ని చోట్లా ఒక్కసారే తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ధరలు కొంత వరకు తగ్గాయి. వేరే పంట వేసుకోవాలనే ఆతృతలో ఉన్న రైతుల బలహీనతను వ్యాపారులు ఆసరాగా తీసుకుంటున్నారు. బాగా తక్కువ ధర చెల్లించి లాభాలు గడిస్తున్నారు. దీనివల్ల రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. - పి.ఎం. సుబానీ, ఉద్యానశాఖ ఏడీఏ, విజయవాడ