తోట్లవల్లూరు, న్యూస్‌లైన్ : కంద రైతులు కుదేలవుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికందే సమయానికి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో సతమతమవుతున్నారు. వాణిజ్య పంటలలో ప్రధానమైనది కంద. జిల్లాలోని తోట్లవల్లూరు, కంకిపాడు, పెనమలూరు, పమిడిముక్కల, ఉయ్యూరు, మొవ్వ, చల్లపల్లి, మోపిదేవి తదితర ప్రాంతాల్లోని మెట్ట, లంక భూముల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఉద్యానశాఖ అంచనా ప్రకారం సుమారు 500 నుంచి 600 హెక్టార్లలో కంద సాగవుతోంది. ఏడాదికి సగటున 40 నుంచి 45 వేల టన్నుల పంట దిగుబడి ఉంటుంది.
భారీగా పెట్టుబడులు
కందకు మంచి ధర లభిస్తుందనే ఆశతో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. పట్టి విత్తనం ఎకరానికి 20 పుట్లు వినియోగించారు. ఇందుకోసం రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు వెచ్చించారు.
దుక్కులు, విత్తనం నాటడం, కలుపులు, ఎరువులు, పురుగు మందులకు మరో రూ.50 వేలు ఖర్చుచేశారు. కౌలు రైతులు ఈ ఖర్చులకు తోడు మరో రూ. 30 వేలు కౌలు చెల్లించాలి. వెరసి ఎకరం కంద సాగుకి రూ. 1.40 లక్షల వరకు ఖర్చయింది.
తగ్గుతున్న దిగుబడులు
కంద పంట దిగుబడులు తగ్గుతున్నాయి. గతంలో ఎకరానికి 80 నుంచి 100 పుట్లు వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం ఎకరానికి 40 నుంచి 50 పుట్లకు పరిమితమైంది. విత్తన ఎంపికలో అజాగ్రత్త, పంట మార్పిడి చేయకపోవటం, భూసారం తగ్గుతుండటం, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం తదితర కారణాలవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, తరచూ పంటమార్పిడి చేస్తూ, సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు చేపడితే దిగుబడులు కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
ధర పతనం
కంద ధర గణనీయంగా పడిపోయింది. నెల రోజుల క్రితం వరకూ పుట్టి కంద ధర రూ. 1,800 పలికింది. ఇప్పుడు కందను కొనే నాథుడే కరువయ్యాడు. ఒక్కసారిగా ధర రూ. 1,100కు పడిపోయింది. గతంలో రావులపాలెం నుంచి వ్యాపారులు వచ్చి పంట కొనుగోలు చేసేవారు. ఇప్పుడు వారు ముఖం చాటేశారు.
తీవ్రనష్టం వాటిల్లింది
ఎకరం పొలంలో కందను సాగుచేశా. పుట్టి విత్తనం రూ. 3 వేలకు కొనుగోలు చేసి పంట వేశాను. కేవలం విత్తనానికే రూ. 60 వేలు ఖర్చయింది. ఎరువులు, పురుగుమందులు, సాగు ఖర్చులు మరో రూ. 50 వేలు అయ్యాయి. ధర పూర్తిగా పడిపోయింది.
- మండేపూడి కోటిరెడ్డి, రైతు, భద్రిరాజుపాలెం
ఎగుమతి తగ్గింది
నెల క్రితం కంద పుట్టి రూ. 1,800 వరకు కూడా కొనుగోలు చేశాం. ప్రస్తుతం మార్కెట్ మందగించింది. ఎగుమతులు తగ్గడంతో వ్యాపారులు కూడా కంద కొనుగోళ్ల పై ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం పుట్టి రూ. 1,100కు కొనుగోలు చేస్తున్నాం. రైతులకు నష్టమే.
- సత్యనారాయణ, కమీషన్ ఏజెంట్, తోట్లవల్లూరు
పంటంతా ఒకేసారి రావడం వల్లే
కంద పంట కాలం పూర్తి కావటంతో అన్ని చోట్లా ఒక్కసారే తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ధరలు కొంత వరకు తగ్గాయి. వేరే పంట వేసుకోవాలనే ఆతృతలో ఉన్న రైతుల బలహీనతను వ్యాపారులు ఆసరాగా తీసుకుంటున్నారు. బాగా తక్కువ ధర చెల్లించి లాభాలు గడిస్తున్నారు. దీనివల్ల రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు.
- పి.ఎం. సుబానీ, ఉద్యానశాఖ ఏడీఏ, విజయవాడ
కంద రైతు కుదేలు
Published Thu, Dec 12 2013 1:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement