వొడాఫోన్ ఇండియాకు భారీ పెట్టుబడులు
* మాతృ సంస్థ నుంచి రూ. 47,700 కోట్ల నిధులు
* భారత్‌లోకి అతిపెద్ద ఎఫ్‌డీఐగా రికార్డు
ముంబై: రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికం మార్కెట్లో పోటీపెరిగిన నేపథ్యంలో వొడాఫోన్ ఇండియాకు బ్రిటన్ మాతృసంస్థ వొడాఫోన్ నుంచి భారీ పెట్టుబడులు వచ్చాయి. తాజా మూలధనం రూపంలో రూ. 47,700 కోట్ల నిధులు అందినట్లు గురువారం వొడాఫోన్ ఇండియా ఎండీ సునీల్ సూద్ చెప్పారు. పబ్లిక్ ఇష్యూ ద్వారా భారీగా నిధులు సమీకరించాలన్న ప్రణాళికను ఇంతకుమునుపు కంపెనీ ప్రకటించింది. అయితే తక్షణ అవసరాల కోసం మాతృసంస్థ హుటాహుటిన ఈ పెట్టుబడులు పంపించింది.
భారత్‌లోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) ఇదేనని సూద్ చెప్పారు. రుణాన్ని తీర్చడానికి, వచ్చేవారం నుంచి ప్రారంభంకానున్న స్పెక్ట్రం వేలంలో బిడ్ చేసేందుకు ఈ నిధులు ఉపయోగిస్తామన్నారు. కంపెనీకి ప్రస్తుతం రూ. 25,000 కోట్ల రుణ భారం వుంది.