మార్కెట్లోకి ‘బిగ్‌బాస్‌’? | LIC public listing back on govt agenda | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ‘బిగ్‌బాస్‌’?

Published Tue, Jul 30 2019 5:14 AM | Last Updated on Tue, Jul 30 2019 10:37 AM

LIC public listing back on govt agenda - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ షేర్లను కొనుగోలు చేసే రోజు భవిష్యత్తులో చూసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణ/వాటాల అమ్మకాల ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు ప్రాధా న్యం ఇస్తుండడంతో, ఎల్‌ఐసీ లిస్టింగ్‌ కూడా ప్రభుత్వ అజెండాలో భాగంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఐపీవో ద్వారా స్వల్ప మొత్తంలో వాటాలను ప్రభుత్వం విక్రయించే చాన్స్‌ ఉందని సమాచారం. ఎల్‌ఐసీ తొలిదశ ఐపీవోకు అధిక ప్రీమి యం ఉంటుందని అంచనా. ఈక్విటీ చిన్నది  కావడమే దీనికి కారణం. ఎల్‌ఐసీలో వాటాల అమ్మకం ఆరంభ దశలో ఉందని, ఈ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగినట్టు సంబంధిత వర్గాల సమాచారం.  

విలువ అధికం...
ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా, ఆర్థిక సేవల కంపెనీగా ఉంది. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లో ఎల్‌ఐసీ గనుక లిస్ట్‌ అయితే మార్కెట్‌ విలువ పరంగా టాప్‌ కంపెనీగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్‌ విలువ పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ను దాటిపోతుందని అంచనా. రూ.5 కోట్ల ఈక్విటీ ఆధారంగా వేసిన అంచనా ఇది. లిస్ట్‌ చేయడం వల్ల ఖాతాలు మరింత పారదర్శకంగా నిర్వహించడంతోపాటు, పెట్టుబడులు, రుణాల పోర్ట్‌ఫోలియో వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి వస్తుంది.

ఇది మరింత మెరుగైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు దారితీస్తుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం కేంద్ర సర్కారు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్, న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీలను లిస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఎల్‌ఐసీలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలంటే అందుకు ఎల్‌ఐసీ చట్టం 1956లో సవరణలు చేయాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీ చట్టంలోని సెక్షన్‌ 37 ప్రకారం... ఎల్‌ఐసీ పాలసీలు అన్నింటికీ వాటి సమ్‌ అష్యూర్డ్, బోనస్‌లు చెల్లించే విషయంలో ప్రభుత్వం హామీదారుగా ఉంటోంది.  


పెట్టుబడుల కొండ
ఎల్‌ఐసీ 2017–18 వార్షిక నివేదిక ప్రకారం చూస్తే... డిబెంచర్లు, బాండ్లలో రూ.4,34,959 కోట్ల పెట్టుబడులు కలిగి ఉండగా, ఎన్నో మౌలిక రంగ ప్రాజెక్టులకు రూ.3,76,097 కోట్లను రుణాలుగా సమకూర్చింది. అదే ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ పెట్టుబడులపై రూ.23,621 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఈక్విటీలలో ఆ ఏడాది రూ.68,621 కోట్లు  పెట్టుబడులు పెట్టింది. రూ.5 కోట్ల మూలధనంతో ఎల్‌ఐసీ సంస్థ ఏర్పాటు కాగా, ఐఆర్‌డీఏఐ నిబంధనల మేరకు బీమా సంస్థల కనీస ఈక్విటీ రూ.100 కోట్లుగా ఉండాలి.

ఈక్విటీ చిన్నదే అయినప్పటికీ, ఇతర కంపెనీలతో పోలిస్తే ఎల్‌ఐసీ నిర్వహణలో భారీ ఆస్తులు ఉన్నాయి. 2018–19లో ఎల్‌ఐసీ పెట్టుబడుల మార్కెట్‌ విలువ వార్షికంగా 8.61 శాతం పెరిగి రూ.28.74 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.26.46 లక్షల కోట్లుగా ఉంది. కార్పొరేషన్‌ మొత్తం ఆస్తులు రూ.31.11 లక్షల కోట్లకు చేరాయన్నది అంచనా. ‘‘అధికారికంగా ప్రకటించినా, ప్రకటించకపోయినా కానీ ఎల్‌ఐసీ వ్యవస్థాపరంగా చాలా ముఖ్యమైన బీమా సంస్థ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తదితర వెంచర్ల బెయిలవుట్‌ విషయంలో ఎల్‌ఐసీ పెట్టుబడులు ఇప్పటికే పెద్ద చర్చకు దారితీసింది.

మిలియన్ల పాలసీదారుల సొమ్ములు ఇవి. ఎల్‌ఐసీలో వాటాల అమ్మకానికి ముందు ఎల్‌ఐసీ చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుంది’’అని ఐఆర్‌డీఏఐ సభ్యుడు కేకే శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ఎల్‌ఐసీని తన పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఓ సాధనంగా వాడుకుంటున్న పరిస్థితి ఇన్వెస్టర్లకు అవగతమే. ఓఎన్‌జీసీ తదితర ఎఫ్‌పీవోలకు, ఐడీబీఐ బెయిలవుట్‌కు ప్రభుత్వ ఆదేశాలతో ఎల్‌ఐసీయే భారీగా నిధులు సమకూర్చింది. ఏటా ప్రభుత్వ సెక్యూరిటీల్లో అతిపెద్ద పెట్టుబడిదారు కూడా ఎల్‌ఐసీయే. ఏటా రూ.55,000–65,000 కోట్ల మేర స్టాక్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తోంది. 2018–19లో ఎల్‌ఐసీ నూతన పాలసీలు, రెన్యువల్‌ పాలసీల ప్రీమియం రూపంలో రూ.3,37,185 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. పాలసీదారులకు చెల్లించిన మొత్తం ప్రయోజనం రూ.2,50,936 కోట్లు కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement