బీమాకు కొర్రీ.. రైతుకు వర్రీ! | Rythu Bheema Scheme Beneficiaries Getting Troubles With Bankers | Sakshi
Sakshi News home page

బీమాకు కొర్రీ.. రైతుకు వర్రీ!

Published Mon, Feb 18 2019 5:36 AM | Last Updated on Mon, Feb 18 2019 5:36 AM

Rythu Bheema Scheme Beneficiaries Getting Troubles With Bankers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుబీమా అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు చనిపోయిన మూడు నుంచి పది రోజుల్లోగా ఆయా కుటుంబాలకు బీమా కింద రూ.5 లక్షలు ఎల్‌ఐసీ నుంచి ఇప్పించాలి. కానీ, జిల్లా వ్యవసాయాధికారులు, ఎల్‌ఐసీ, బ్యాంకు వర్గాల కారణంగా కొన్నిచోట్ల జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని గతేడాది ఆగస్టు 14వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏ కారణంతోనైనా 58 ఏళ్ల లోపు రైతులు చనిపోతే వారి కుటుంబాలను తక్షణమే ఆదుకునేందుకు రూ. 5 లక్షల బీమా పరిహారం చేతికందేలా ఈ పథకానికి రూపకల్పన చేసింది. అందుకోసం 28 లక్షలమంది రైతుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం రూ.636 కోట్లను ఎల్‌ఐసీకి ప్రీమియం కింద చెల్లించింది. అంటే.. ఒక్కో రైతుకు రూ.2,271 ప్రీమి యం చెల్లించింది. బీమా పరిహారాన్ని రైతులకు సకాలంలో అందించేలా ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ఎల్‌ఐసీ కాకుండా వ్యవసాయశాఖ తీసుకుంది. రైతు చనిపోతే మరణ ధ్రువీకరణపత్రం, ఇతర డాక్యుమెంట్లను తీసుకోవడం, పరిశీలించడం, అప్‌లోడ్‌ చేయడం వంటి పనులను కిందిస్థాయి వ్యవసాయాధికారులే చేస్తున్నారు. గతేడాది ఆగస్టు 14 నుంచి ఇప్పటివరకు 7,486 మంది రైతులకు రైతుబీమా కింద పరిహారం అందింది. ఇంకా 300 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం వివిధ దశల్లో పెండింగ్‌లో ఉంది. అందులో 192 దరఖాస్తులు జిల్లా వ్యవసాయాధికారుల వద్ద ఉండిపోయాయి. వాటికి ఆమోదం తెలపడంలో జాప్యం జరుగుతోందని నల్లగొండ జిల్లాకు చెందిన బాధిత రైతు కుటుంబసభ్యుడు ఎం.వీరేశం ఆరోపిస్తున్నారు. నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో 18 దరఖాస్తుల చొప్పున ఆయా జిల్లా వ్యవసాయాధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 15, నిజామాబాద్‌ జిల్లాలో 13 పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లోనైతే చనిపోయిన 55 మంది రైతుల బీమా దరఖాస్తులను ఇప్పటికీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. అత్యధికంగా మెదక్‌ జిల్లాలో 11 రైతు బీమా దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయలేదు.  

ఎల్‌ఐసీ ఎందుకు తిరస్కరించినట్లు?  
రైతుబీమా ప్రక్రియలో అన్నీ సక్రమంగా ఉన్నా కొన్ని దరఖాస్తులు ఎల్‌ఐసీ వద్ద తిరస్కరణకు గురికావడంపై విమర్శలున్నాయి. మొత్తం 43 మంది రైతుల పరిహారాన్ని ఎల్‌ఐసీ తిరస్కరించిందని వ్యవసాయశాఖ తెలిపింది. అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించినా ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో తెలియదని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబసభ్యుడు లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జిల్లాలో 8 మంది రైతుల బీమాను ఎల్‌ఐసీ తిరస్కరించింది. ఎల్‌ఐసీ ఆమోదించి డబ్బు పంపినా బ్యాంకులు సొమ్ము ఇవ్వకుండా కొర్రీలు పెడుతున్నాయి. ఈవిధంగా రాష్ట్రంలో 10 మంది రైతు కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement