పరిహారం అందక దయనీయ స్థితిలో రైతు కుటుంబాలు
ఏళ్ల తరబడి ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూపులు
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం సున్నా
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2014–2022 మధ్య 5,112 మంది రైతుల ఆత్మహత్యలు
రైతుబీమా లేని నాలుగేళ్లలో 4,125 మంది బలవన్మరణం.. కేవలం 1,600
కుటుంబాలకే ఎక్స్‌గ్రేషియా... పరిహారానికి ప్రతిబంధకంగా త్రిసభ్య కమిటీ నివేదికలు
కూతురి పెళ్లి కోసమో, కుమారుడి చదువు కోసమో అప్పులు చేశారంటూ రిపోర్టులు!
పరిహారం అందని కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ
కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నెరవేర్చి న్యాయం చేయాలంటున్న రైతు సంఘాలు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది మహబూబాబాద్ మండలంలోని గుండాలగడ్డ తండాకు చెందిన భూక్య సంత్రాలి, ఆమె కుమారుడు మహేష్. వీరి కుటుంబ పెద్ద భూక్య హసిరాం తనకున్న 5 ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి, పెసర పంటలు సాగు చేసేవాడు. ఇందుకోసం బ్యాంకులో, ప్రైవేటుగా రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. పత్తి, పెసరకు తెగుళ్లు సోకడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. అప్పులోళ్ల ఒత్తిడితో 2015 సెపె్టంబర్ 7న హసిరాం తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించిన తర్వాత త్రిసభ్య కమిటీ అధికారులు వచ్చి హసిరాం కుటుంబానికి పరిహారం చెల్లిస్తామని చెప్పి వెళ్లారు. తొమ్మిదేళ్ల నుంచి ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటికీ పరిహారం అందలేదని సంత్రాలి, మహేష్ వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్: అప్పులు తీసుకుని పంటలు సాగు చేసి, నష్టాల పాలై బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలను కనికరించే నాథుడే కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు కాలం కలిసి రాకపోతుందా.. కష్టాల నుంచి బయట పడకపోతామా..అనే ఆశతో సాగు చేస్తూ, పంటలు చేతికి రాక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన రైతుల కుటుంబాలు సాయం కోసం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు. దీంతో రైతు బీమా అమలుకు ముందు, రైతు బీమా అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడిన వేలాది మంది రైతుల కుటుంబాల పరిస్థితి నేటికీ దయనీయంగానే ఉంది.
నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2014 నుంచి 2022 వరకు 5,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా రు. ఇందులో రైతు బీమా అమల్లో లేని 2014–2018 సంవత్సరాల మధ్య బలవన్మరణాలకు పాల్పడిన వారు 4,125 మంది ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో 175 మంది రైతులు చనిపోయినట్లు రైతు స్వరాజ్య వేదిక (ఆర్‌ఎస్‌వీ) సర్వే చెబుతోంది.
త్రిసభ్య కమిటీ నివేదికే ప్రామాణికం
రైతు బీమా అమల్లో లేని జూన్ 2, 2014 నుంచి ఆగస్టు 14, 2018 మధ్యకాలంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 194 జీఓనే వర్తించేది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను విచారించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అధికారులు ఇచ్చే నివేదికే పరిహారం ఇచ్చేందుకు ప్రామాణికం. అయితే ఆ కమిటీ పంపిన నివేదికలు పరిహారం అందించడానికి ప్రతిబంధకంగా మారాయన్న ఆరోపణలు ఉన్నాయి.
అనేక కేసుల్లో సరైన విధంగా విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారించకుండా, కూతురు పెళ్లి లేదా కొడుకు చదువు లేదా ఇంటి నిర్మాణం కోసం అప్పులు అయ్యాయంటూ నివేదికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కౌలు రైతు అయితే కౌలు కాగితాలు లేవనో, మరో కారణమో పేర్కొంటూ నివేదికలు పంపినట్లు చెబుతున్నారు. ఈ కారణాలతోనే 4,125 మందిలో కేవలం 1,600 కుటుంబాలకు మాత్రమే ఎక్స్‌గ్రేషియా అందిందని, మిగతా వాటిని తిరస్కరించారని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎక్స్‌గ్రేషియా రాని కుటుంబాలు ఏళ్ల తరబడి కార్యాలయాలు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోతోంది. అయితే రైతు కుటుంబాలు ఇప్పటికీ ప్రభుత్వం ఆదుకోక పోతుందా, పరిహారం అందకపోతుందా అన్న ఆశతోనే ఎదురు చూస్తున్నాయి. ఇక 2018 ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో రైతు బీమా అమల్లోకి వచ్చాక అధికారులు ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబం దగ్గరికి వెళ్లడమే మానేశారు. దీంతో సొంత భూమి ఉన్న రైతుకు రైతు బీమా వస్తే వచ్చినట్టు లేదంటే లేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
కౌలు రైతుల సంగతేంటి..?
సొంత భూమి లేని కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే 194 జీఓ వర్తించక, రైతు బీమా రాక.. ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం అందడం లేదు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా కౌలు రైతులు, రైతు కూలీలకు బీమా అమలైతే వారికి కూడా 194 జీఓ వర్తిస్తుంది.
194 జీఓ ఏం చెబుతోంది?
జీవో 194 వర్తిస్తే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, అప్పుల వారందరికీ వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద రూ.లక్ష ఇచ్చే అవకాశం ఉంది. ఆ కుటుంబం అప్పుల నుంచి కొంత మేరకు బయట పడుతుంది. ప్రభుత్వం ఇల్లు, పెన్షన్ మొదలైన సౌకర్యాలు కల్పించనుండడంతో జీవితానికి భరోసా లభిస్తుంది. పిల్లలు చదువులు కొనసాగించేందుకు వీలవుతుంది. అయితే 194 జీవో ప్రకారం రైతు కేవలం వ్యవసాయం కోసమే అప్పు చేసినట్లుగా త్రిసభ్య కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది.
పరిహారానికి సిఫారసు చేయాల్సి ఉంటుంది. అయితే మెజారిటీ కేసుల్లో త్రిసభ్య కమిటీ నివేదికలు రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా లేవని సమాచారం. కాగా పరిహారం అందని కుటుంబాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు అధికారంలో ఉన్నందున తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
హామీ ఇచ్చిన విధంగా ఆదుకోవాలి
బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఎక్స్‌గ్రేషియా కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. కొందరికి కుటుంబం గడవటం కూడా కష్టంగా ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఈ కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం చాలా అన్యాయం. సరైన విధంగా విచారణ జరిపించి ఆయా కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. కౌలు రైతులను, రైతు కూలీలను వెంటనే గుర్తించి బీమా పరిధిలోకి తీసుకురావాలి.
– బి.కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక
సాయం కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా..
నా భర్త ఎలవేణి వెంకటయ్య మాకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయ పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించేవాడు. అయితే పత్తి పంటకు నీళ్లు లేవని అప్పు చేసి రెండు బోర్లు వేశాడు. కానీ చుక్క నీళ్లు రాలేదు. దీంతో పాటు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి కోసం అప్పు చేశాడు. అసలు, వడ్డీ కలిపి రూ.6 లక్షలవడంతో వాటిని తీర్చలేననే బాధతో 2017 అక్టోబర్ 10న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడేళ్ల నుంచి పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నా.
– ఎలవేణి స్వరూప, చౌటపల్లి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
Comments
Please login to add a commentAdd a comment