నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్‌ని కలిసిన సీతక్క, ఇందిరా శోభన్
సీఎం ‘న్యూ ఇయర్’ క్లాస్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొలిటికల్ క్లాస్ తీసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం కలిసి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మొదటిసారి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం సరదాగా మాట్లాడుతూ.. తన రాజకీయ అనుభవాన్ని పంచుకున్నారు. ‘ప్రజాప్రతినిధిగా మీరు చేసే పనులన్నీ ప్రజలకు రిజిస్టర్ అవుతుంటాయి.
అన్ని విషయాలను వారు గుర్తుపెట్టుకుంటారు. మొదటిసారి మీపై చాలా అంచనాలతో గెలిపిస్తారు. అది గొప్ప విషయమేమీ కాదు. మీరేంటో తెలిసిన తర్వాత, మీ పనితీరు అర్థం చేసుకున్న తర్వాత రెండోసారి గెలిపిస్తేనే గొప్ప విషయం. పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లి వస్తుండాలి. కార్యకర్తలతో మమేకం కావాలి. మీరు ఈజీగా తీసుకుంటే ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. ప్రజలు ఒకసారి ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత అసలు రాజకీయమంటే ఏంటో అర్థమవుతుంది’అని క్లాస్ తీసుకున్నారు. అక్కడే ఉన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఉద్దేశించి.. ఆయన ఎలా గెలుస్తున్నారో అడిగి తెలుసుకోవాలని సూచించారు.
మీరే మాట్లాడండి..
కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. తాను కూడా మరింత పట్టుదలతో పనిచేస్తానని చెప్పారు. ఉదయం నుంచి మంత్రులకు, పార్టీ నేతలకు తానే ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలియజేశానని తెలిపారు. ‘ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మీ కోసం పనిచేసే నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపండి. వీలున్నప్పుడల్లా వారితో మాట్లాడండి. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కేడర్‌ను కలుపుకుని ముందుకెళ్లండి. ప్రజాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లండి’అని సూచించారు.
నా రిపోర్టు నా దగ్గరే ఉంది
తన పనితీరుకు 100కి 100 మార్కులు వేసుకోబోనని సీఎం రేవంత్ అన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి వచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టులు తన దగ్గర ఉన్నాయని, తన రిపోర్టు కూడా తన దగ్గరే ఉందని తెలిపారు. ఈ రిపోర్టులను త్వరలోనే అందరికీ పంపిస్తానని కూడా చెప్పినట్టు తెలిసింది.
సీఎంగా అధికారిక బాధ్యతలు అలవాటు అయినందున.. ఇక నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో జోక్యం చేసుకోవద్దని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా నియామకాలు చేయకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతలకు స్పష్టంచేసినట్లు తెలిసింది. అంగన్‌వాడీలు, రేషన్ డీలర్ల నియామకంలో తమకు కొన్ని అధికారాలు ఇవ్వాలని ఓ మంత్రి కోరిన సందర్భంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
సీఎం మాటలు స్ఫూర్తినిచ్చాయి: ఎంపీ చామల కిరణ్‌రెడ్డి
ప్రజాప్రతినిధి హోదాలో తొలిసారి సీఎం రేవంత్‌ను కలవడం స్ఫూర్తినిచ్చిందని, ఆయన చెప్పిన మాటలు తన బాధ్యతను మరింత పెంచాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌ను ఎప్పుడు కలిసినా ఏదో ఉత్తేజం వస్తుందని, ఈసారి మాత్రం రాజకీయ అనుభవాల గురించి ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనని బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment