సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భారీ నిధులను సమకూర్చడంలో బ్యాంకుల ద్వారా సేకరించిన రుణాలే కీలక పాత్ర పోషించాయి. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణకు వీలుగా ఏర్పాటు చేసిన కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే ఇప్పటివరకు ఏకంగా రూ. 40 వేల కోట్లకు పైగా సేకరించగా, అందులోంచే ప్రాజెక్టు నిర్మాణ పనులకు రూ. 29,259 కోట్లను ఖర్చు చేశారు. ప్రాజెక్టు నిధుల అవసరాలను తీర్చడంలో బ్యాంకుల పాత్ర కీలకం కావడంతో రుణాలిచ్చిన బ్యాంకర్లను ఘనంగా సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 37 లక్షల ఎకరాలకు సాగునీటినిచ్చే ఈ ప్రాజెక్టు కోసం మొత్తంగా రూ. 80,500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. దానికి తగినట్లుగా గడిచిన నాలుగు బడ్జెట్‌లలో రూ. 6 వేల కోట్ల నుంచి రూ. 8 వేల కోట్ల వరకు కేటాయింపులు చేస్తూ వచ్చారు.
ఈ స్థాయిలో నిధుల ఖర్చుకు వీలుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ల నుంచి నిధుల సేకరించారు. తొలి విడతలో ఆంధ్రా బ్యాంకు కన్సార్షియం నుంచి రూ. 7,400 కోట్లు సేకరించగా, అనంతరం పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్షియం నుంచి రూ. 11,400 కోట్ల రుణానికి సంబంధించి ఒప్పందం జరిగింది. ఇక పీఎఫ్‌సీ ద్వారా రూ. 18 వేల కోట్లు, నాబార్డ్ ద్వారా రూ. 1,500 కోట్ల మేర రుణాలు దక్కాయి. దీంతో ప్రాజెక్టు పరిధిలో ఇంతవరకు మొత్తంగా రూ. 49,877 కోట్లు ఖర్చవగా అందులో రుణాల ద్వారానే రూ. 29,259 కోట్లు ఖర్చు చేశారు. మారో రూ. 20 వేల కోట్లు రాష్ట్ర నిధుల నుంచి ఖర్చు చేశారు.
సీఎం చేతుల మీదుగా సన్మానం..
కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలిచ్చిన బ్యాంకర్లను ఘనంగా సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా 21న ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించింది. వివిధ బ్యాంకుల సీఎండీ, ఎండీలు, డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. వీరంతా గురువారం ఉదయం హెలికాప్టర్‌లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌస్‌ల ప్రాంతాల్లో పర్యటించి అక్కడి నిర్మాణాలను పరిశీలిస్తారు. అనంతరం రామగుండంలో బస చేస్తారు. శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వీరంతా పాల్గొననున్నారు. అదే రోజున వీరికి సీఎం చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment