కాళేశ్వరం బరాజ్‌లపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్‌కు నిపుణుల కమిటీ వివరణ
నిర్మాణం జరిగినప్పటి నుంచీ బరాజ్‌లను పూర్తిగా నింపారు
నీటి ఒత్తిడి పెరిగిపోయి
బుంగలు ఏర్పడ్డాయి
వాటిని సకాలంలో పూడ్చక నష్టానికి దారితీశాయని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణం పూర్తయిన నాటి నుంచీ నిరంతరం గరిష్ట నిల్వలను కొనసాగించారని.. దాంతో ఒత్తిడి పెరిగి వాటికి తీవ్ర నష్టం కలిగిందని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు నిపుణుల కమిటీ నివేదించింది. నీటి పారుదల శాఖలోని హైడ్రాలజీ విభాగం ఇంజనీర్లు, విచారణ కమిషన్‌కు సహకరించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ సభ్యులను జస్టిస్ పినాకి చంద్రఘోష్ గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో విచారించారు.
ప్రాథమిక పరిశీలన అంశాలతో..
ఎన్‌ఐటీ వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్‌రావు, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ ఎన్.రమణమూర్తి, ఉస్మానియా వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం హెచ్‌ఓడీ పి.రాజశేఖర్, రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్‌తో ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇటీవల బరాజ్‌లను పరిశీలించి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తమ దృష్టికి వచి్చన లోపాలను తాజాగా జస్టిస్ చంద్రఘోష్‌కు వివరించింది. బరాజ్‌లను సుదీర్ఘకాలం పూర్తిస్థాయిలో నీటితో నింపి ఉంచడంతో.. బరాజ్‌లపై ఒత్తిడి పెరిగి బుంగలు ఏర్పడ్డాయని కమిటీ సభ్యులు పేర్కొన్నట్టు తెలిసింది.
బుంగలను వెంటనే పూడ్చయకపోవడంతో వాటి తీవ్రత పెరిగి బరాజ్‌లకు తీవ్ర నష్టం కలిగించిందని వెల్లడించినట్టు సమాచారం. బరాజ్‌ల వైఫల్యంపై రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని.. సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అఫిడవిట్ రూపంలో సమరి్పంచాలని నిపుణుల కమిటీకి ఈ సందర్భంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదేశించారు.
నేడు ఈఎన్సీల ఆఫీసుల సిబ్బంది విచారణ
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్), ఈఎన్సీ (ఓ అండ్ ఎం) కార్యాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లను జస్టిస్ చంద్రఘోష్ శుక్రవారం విచారించనున్నారు. చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులను విచారణకు రావాలని కోరారు.
త్వరలో బహిరంగ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ త్వరలో బహిరంగ విచారణ నిర్వహించాలని నిర్ణయించింది. అఫిడవిట్ల రూపంలో విచారణ కమిషన్‌కు సమాచారాన్ని సమరి్పంచిన వారందరినీ బహిరంగ విచారణలో ప్రశ్నించనుంది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఎవరెవరిని పిలవాలనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. బ్యారేజీలపై విజిలెన్స్ విభాగం నిర్వహించిన దర్యాప్తునకు సంబంధించిన తుది నివేదికను సత్వరం సమర్పించాలని కమిషన్ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సమరి్పంచలేదు. విజిలెన్స్ తుది నివేదిక కోరుతూ మరోసారి లేఖ రాయనుంది.
బరాజ్‌ల నిర్మాణంతో సంబంధమున్న ప్రభుత్వ కార్యాలయాలు, మోడల్ స్టడీస్ ల్యాబ్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులను పరిశీలించాలని జస్టిస్ చంద్రఘోష్ నిర్ణయం తీసుకున్నారు. పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)ను సైతం ఆయన సందర్శించనున్నట్టు తెలిసింది. కాళేశ్వరం బరాజ్‌లకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విచారణ ముగించిన తర్వాత.. ఆర్థిక అవకతవకతలపై జస్టిస్ చంద్రఘోష్ దృష్టిసారించనున్నారు. అంచనా వ్యయం, ఖర్చులు, రుణాలు, వడ్డీ రేట్లు తదితర అంశాలపై విచారణ నిర్వహించనున్నారు.
అఫిడవిట్ల పరిశీలన తర్వాత నిర్ణయం
గురువారం విచారణ ముగిసిన తర్వాత జస్టిస్ పినాకి చంద్రఘోష్ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. బరాజ్‌ల వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులకు నోటీసులేమైనా జారీ చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. అధికారులు సమరి్పంచిన అఫిడవిట్లను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment