సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తింపు లభించింది. ప్రపంచదేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణకు చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రెండూ ఎంపిక కావ డం విశేషం. ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఐరాస తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం పంపింది. ఈ నెల 21–23 తేదీల మధ్య ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరానికి రావాల్సిందిగా కోరింది. ఆ తేదీల్లో ఐరాస నిర్వహించే ‘వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంతర్జాతీయ సదస్సులో రైతుబంధు, రైతుబీమా పథకాలపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆయన ఈ నెల 20న రోమ్‌కు వెళ్లనున్నారు. ఆ 2 పథకాలకు సంబంధించి ఇప్పటికే ఐరాస పూర్తి సమాచారాన్ని రాష్ట్రప్రభుత్వం నుంచి సేకరించింది. తక్కువ నిడివి గల రెండు ప్రత్యేక డాక్యుమెంటరీ చిత్రాలను కూడా ప్రభుత్వం ఐరాసకు పంపించింది.
పథకాలపై రెండు ప్రత్యేక పుస్తకాలు
రోమ్‌లో ఐరాసకు చెందిన ఎఫ్‌ఏవోలో జరిగే అంత ర్జాతీయ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సదస్సుకు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరవుతుండటంతో రైతుబంధు, రైతుబీమా పథకాలపై తక్కువ పేజీలు గల 2 ప్రత్యేక పుస్తకాలను వ్యవసాయశాఖ ముద్రించింది. వీటిని రోమ్ సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ ప్రతినిధులకు అందజేయనుంది.
పుస్తకాల్లోని వివరాలు: రైతుబంధు పథకంపై వ్యవసాయశాఖ తయారు చేసిన పుస్తకంలో రాష్ట్రం లోని సాగు పరిస్థితులను వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ వంటి పథకాలనూ ప్రస్తావించారు. ఇక్కడున్న రిజర్వాయర్లు, నీటిపారుదల వసతి, రైతుబంధు పథకంలోని ముఖ్యమైన అంశాలను వెల్లడించారు. ప్రతీ రైతుకు ఒక సీజన్‌లో పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ఇదంతా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఆర్థికసాయంగా పేర్కొన్నారు. ఖరీఫ్‌లో అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టి రైతులకు చెక్కుల ద్వారా గ్రామసభల్లో పంపిణీ చేసినట్లు వివరించారు. రైతుబీమాపైనా మరో పుస్తకాన్ని అధికారులు తయారుచేశారు. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేలా రూ. 5 లక్షల బీమా ఎల్‌ఐసీ ద్వారా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఐరాస గుర్తింపు వల్ల ఎఫ్‌ఏవో నుంచి ఏమైనా ప్రత్యేకంగా నిధులు వస్తాయేమో అన్న చర్చ జరుగుతోంది. ప్రపంచంలో ఇలాంటి పథకం లేకపోవడంతో అది తమకు కలసి వస్తుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
రైతుబంధు’కు ఐరాస గుర్తింపు
Published Sat, Nov 17 2018 2:10 AM | Last Updated on Sat, Nov 17 2018 10:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment