
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలోనూ పాలసీదారులు తమ రిస్క్ కవర్‌ను కొనసాగించుకునేందుకు వీలుగా ఎల్‌ఐసీ మరోసారి పెద్ద మనసు చేసుకుంది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చంటూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. మార్చి 6 వరకు ఇది కొనసాగనుంది. కొన్ని షరతుల మేరకు పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీలను మార్చి 6 వరకు పునరుద్ధరించుకోవచ్చు. పాలసీదారులు నిర్దేశిత గడువులోపు పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అవి ల్యాప్స్ (రద్దు) అవుతాయి. ఇలా ల్యాప్స్ అయిన పాలసీలను ఇప్పుడు పునరుద్ధరించుకోవడం ద్వారా బీమా కవరేజీ కొనసాగేలా చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎల్‌ఐసీకి చెందిన 1,526 శాటిలైట్ కార్యాలయాల నుంచి సైతం పాలసీదారులు తమ ల్యాప్స్‌డ్ పాలసీలను పునరుద్ధరించుకోవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. ప్రీమియం చెల్లించని ఏడాది నుంచి గరిష్టంగా ఐదేళ్లలోపు ల్యాప్స్ అయిన వాటికి ఈ అవకాశం ఉంటుందని ఎల్‌ఐసీ స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రశ్నావళికితోడు, తమ ఆరోగ్య స్థితి మంచిగానే ఉందన్న స్వీయ ధ్రువీకరణ తీసుకోవడం ద్వారా పాలసీలను పునరుద్ధరించనున్నట్టు తెలిపింది. ఆలస్యపు ఫీజులో 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు.. లేదా పునరుద్ధరణకు రూ.2,000 చార్జీ తీసుకోనున్నట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment