కరోనా కల్లోలం ఆర్థిక స్థితిగతులను అతలాకుతలం చేసింది. కానీ ఎల్‌ఐసీకి మాత్రం స్టాక్ మార్కెట్లో లాభాల పంట పండించింది. మార్చిలో కనిష్ట స్థాయికి పడిపోయిన స్టాక్ మార్కెట్ మెల్లమెల్లగా రికవరీ అయి ప్రస్తుతం జీవిత కాల గరిష్ట స్థాయి రికార్డ్‌లు సృష్టిస్తోంది. మార్కెట్ పతన సమయంలో కొని, పెరుగుతున్నప్పుడు విక్రయించే ‘కాంట్రా’ వ్యూహాన్ని అమలు చేసే ఎల్‌ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ కూడా జీవిత కాల గరిష్ట స్థాయికి చేరాయి. కల్లోల కంపెనీల నుంచి వైదొలగడం, వృద్ధి బాటన ఉన్న కంపెనీల్లో వాటాలను పెంచుకోవడం ద్వారా ఎల్‌ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోంది. ఎల్‌ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్‌కు సంబంధించి సాక్షి
బిజినెస్ స్పెషల్ స్టోరీ...
భారత్‌లో అతి పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్ ఎల్‌ఐసీనే. ఈ జీవిత బీమా దిగ్గజం ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఈ ఆర్థిక సంవత్సరంలో జోరుగా పెరిగి రికార్డ్ స్థాయికి చేరింది. భారత్‌లోని టాప్ 200 కంపెనీల్లో ఎల్‌ఐసీకున్న వాటాల విలువ ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 7,700 కోట్ల డాలర్లకు ఎగసిందని అంచనా. సెప్టెంబర్ నుంచి చూస్తే, మార్కెట్ 12 శాతం మేర పెరిగింది. దీంతో ఎల్‌ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ కూడా ఆ రేంజ్‌లోనే పెరిగాయి. వీటి విలువ ప్రస్తుతం 8,600 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.6.45 లక్షల కోట్లు) పెరిగి ఉండొచ్చని అంచనా. ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. దీంతో 2018 మార్చినాటి 8,400 కోట్ల డా లర్ల అత్యధిక ఎల్‌ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ రికార్డ్ బ్రేక్ అయినట్లే.
ఆర్నెల్లలో 40 శాతం అప్...
కరోనా కల్లోలం కారణంగా ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్ బాగా నష్టపోయింది. దీంతో ఎల్‌ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 5,500 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఆశాజనక వార్తలు రావడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటంతో స్టాక్ మార్కెట్ రికవరీ బాట పట్టింది. ప్రస్తుతం స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతున్నాయి. స్టాక్ మార్కెట్ రికవరీ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌నాటికి ఎల్‌ఐసీ ఈక్విటీ హోల్డింగ్స్ విలువ 40 శాతం (2,200 కోట్ల డాలర్లు–లక్షన్నర కోట్లకు మించి)ఎగసి 7,700 కోట్ల డాలర్లకు(రూ.5.7 లక్షల కోట్లకు )చేరింది. కంపెనీల్లో ఎల్‌ఐసీ వాటా పెరగడం, కంపెనీల్లో ఉన్న ఎల్‌ఐసీ వాటాల విలువ కూడా పెరగడం దీనికి ప్రధాన కారణాలు. జూన్ 30 నాటికి ఎల్‌ఐసీకి దాదాపు 329 కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. ఎల్‌ఐసీ ఇన్వెస్ట్ చేసిన మొత్తం షేర్లలో 96 శాతం సానుకూల రాబడులనిచ్చాయి.
ఎల్‌ఐసీ...మంచి కాంట్రా ప్లేయర్!
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షేర్లలో ఇప్పటివరకూ రూ.55,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని ఎల్‌ఐసీ ఉన్నతాధికారొకరు చెప్పారు. గత ఏడాది ఇదే కాలానికి రూ. 32,800 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎల్‌ఐసీకి మంచి కాంట్రా ప్లేయర్ అనే పేరు ఉంది. అంటే మార్కెట్ పతనసమయంలో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పెరుగుతున్న సమయంలో అమ్మేసి లాభాలు చేసుకుంటుంది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ 40% పతనం కావడం, వెంటనే రికవరీ కావడం కూడా ఎల్‌ఐసీకి కలసివచ్చింది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చూస్తే రూ.10,000 కోట్ల లాభం ఆర్జించామని ఎల్‌ఐసీ చైర్మన్ ఎమ్‌ఆర్ కుమార్ ఈ ఏడాది ఆగస్టులోనే వెల్లడించారు. ఇక ఇప్పుడు స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ హైల వద్ద ట్రేడవుతుండటంతో ఎల్‌ఐసీకి భారీ లాభాలు వచ్చి ఉంటాయని నిపుణుల అంచనా.
బీమా కంపెనీలకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ కీలకమని నిపుణుల అభిప్రాయం. అందుకే నాణ్యత గల షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎల్‌ఐసీ మంచి లాభాలు కళ్లజూస్తోందని వారంటున్నారు. తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల నుంచి ఎల్‌ఐసీ తన వాటాలను తగ్గించుకుంటోంది. అధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచుతోంది. 1 శాతం కంటే తక్కువ వాటా ఉన్న 33 కంపెనీల నుంచి వైదొలగింది. గతంలో యస్‌బ్యాంక్‌లో ఎల్‌ఐసీ వాటా 8 శాతంగా ఉంది. ఎప్పుడైతే ఈ బ్యాంక్‌కు సంబంధించిన సమస్యలు వెలుగులోకి రావడం ఆరంభమైందో, ఆ బ్యాంక్‌లో తన వాటాను ఎల్‌ఐసీ 1.64%కి తగ్గించుకుంది. యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐతో సహా మరిన్ని ప్రభుత్వ బ్యాంక్‌లు పెట్టుబడులు పెట్టడంతో మళ్లీ యస్‌బ్యాంక్‌లో వాటాను 4.99%కి పెంచుకుంది. మరోవైపు మంచి ఫలితాలు సాధిస్తున్న కంపెనీల్లో తన వాటాలను పెంచుకుంటోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సూమర్, శ్రీ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ల్లో తన వాటాను మరింతగా పెంచుకుంది.
మెగా ఐపీఓకు రంగం సిద్ధం...
భారత జీవిత బీమా మార్కెట్లో ఎల్‌ఐసీ వాటా దాదాపు 76%. త్వరలో ఎల్‌ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వస్తోన్న విషయం తెలిసిందే. భారత్‌లో ఇదే అతి పెద్ద ఐపీఓ కానున్నది. ఎల్‌ఐసీ ఐపీఓ సైజు రూ.80,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఎల్‌ఐసీ విలువ రూ.10 లక్షల కోట్ల నుంచి రూ.12 లక్షల కోట్ల రేంజ్‌లో ఉం డొచ్చని భావిస్తున్నారు.
ఎల్‌ఐసీ.. షంషేర్!
Published Tue, Dec 1 2020 1:35 AM | Last Updated on Tue, Dec 1 2020 7:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment