‘బీమా’లో ఎఫ్‌డీఐ పరిమితి పెంపునకు ఎల్‌ఐసీ ఓకే!
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వ దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తన మద్దతును తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పరిమితి 26 శాతంగా ఉంది. ఇటీవల జరిగిన సెలక్ట్ కమిటీ సమావేశాల్లో ఎల్‌ఐసీ చైర్మన్ ఎస్‌కే రాయ్ పరిమితి పెంపునకు సానుకూలంగా తన అభిప్రాయాన్ని తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే 15 మంది సభ్యుల సెలక్ట్ కమిటీలోని ఒక వర్గం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇంతక్రితం ఎఫ్‌డీఐ పరిమితి పెంపును వ్యతిరేకించిన ఎల్‌ఐసీ తాజాగా తన ధోరణిని ఎందుకు మార్చుకుందన్న అంశంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దీనికి రాజకీయ పరమైన ఒత్తిడులూ కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న బీమా బిల్లుపై నవంబర్ చివరి వారంలో తమ నివేదిక సమర్పించడానికి కమిటీ ప్రయత్నిస్తుందని సమావేశం అనంతరం చైర్మన్ చందన్ మిశ్రా అన్నారు.